Sunday, October 6, 2024

తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్‌లో విభేదాలు…!

- Advertisement -
- Advertisement -

జేఏసిలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికప్పుడు లీక్
గత ప్రభుత్వ పెద్దలకు సమాచారం చేరవేత..?
ఇప్పటికే పలువురు మంత్రులు హెచ్చరించినా మారని
ఉద్యోగ సంఘాల నాయకుల తీరు
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్‌లో విబేధాలు బయటపడుతున్నాయి. 205 సంఘాలతో ఏర్పాటైన ఈ జేఏసికి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏలూరి శ్రీనివాసరావులను గతంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకున్నారు. ఈ జేఏసికి 3 లక్షల మంది ఉద్యోగులు, 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు ఉంది. అయితే ఈ జేఏసిలో ఒక నాయకుడంటే మరొక నాయకుడికి గిట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే జేఏసిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే దానిని లీక్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతోపాటు ఈ జేఏసిలో ఉన్న కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులు గత ప్రభుత్వంతో అతి సన్నిహితంగా మెలిగారని ప్రస్తుతం వారంతా బిఆర్‌ఎస్ నాయకులతో టచ్‌లో ఉండడంతో పాటు ఈ జేఏసిలో జరుగుతున్న పరిణామాలను, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ పెద్దలకు తెలియచేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం ఈ జేఏసిలో ఉన్న కొన్ని సంఘాల్లోని నాయకుల తీరుపై గుర్రుగా ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టును తెప్పించుకున్న ప్రభుత్వం, ఈ జేఏసిలోని కొన్ని సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని గుర్తించింది.

రెండు డిఏలను కూడా ఇప్పించలేని…..

దీంతో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఈ జేఏసి నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ విషయాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆ జేఏసిలోని కొన్ని సంఘాల నాయకులు బాహాటంగా పేర్కొనడం విశేషం. ఇప్పటికే కొందరు మంత్రులు సైతం జేఏసిలోని కొన్ని సంఘాల నాయకుల తీరు గురించి బాహాటంగా హెచ్చరించారని, పద్ధతి మార్చుకోవాలని సూచించినా ఆ సంఘాల్లోని నాయకుల్లో మార్పురావడం లేదని అందుకే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సైతం లైట్‌గా తీసుకుంటుందని ఈ జేఏసికి చెందిన కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటుండడం విశేషం.

ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ ఉండగా ప్రస్తుతం దసరాకు రెండు పెండింగ్ డిఏలైనా ఈ జేఏసి నాయకులు ప్రభుత్వం నుంచి ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నా అది కూడా సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు ఈ జేఏసిలో విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వం వద్ద తమకు చెడ్డపేరు వస్తుందని కొందరు జేఏసి నాయకులు పేర్కొంటున్నారు.

గత ప్రభుత్వ పెద్దలతో రెగ్యులర్‌గా

ఇలా ఈ జేఏసిలో ఉన్న సంఘాలకు చెందిన చాలా ఉద్యోగ సంఘాల నాయకులు గత ప్రభుత్వ పెద్దలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు నాయకుల గురించి ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకుంటున్న ప్రభుత్వం వారిలో మార్పు రానంత వరకు సమస్యలను అలాగే పెండింగ్‌లో పెడుతుందని ఉద్యోగులు సైతం వాపోతున్నారు. గుర్తింపు పొందిన 7 ఉద్యోగ సంఘాలైన టిఎన్జీఓ, టిజిఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టిఆర్‌టియూ, యూటిఎఫ్, ఎస్‌టియూ, టిఆర్‌టిఎఫ్, టీచర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలైన ఈఎస్‌పిసి, టిటిజేసి, జాక్టో, టిఏజేఏసి, రెవెన్యూ సంఘాలతో పాటు పలు సంఘాల నాయకులకు చెందిన నాయకుల్లో కొంతమంది ఈ విధంగా గత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ప్రస్తుత ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేస్తున్నారని, దీంతోపాటు ప్రభుత్వం గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఈ జేఏసికి చెందిన కొన్ని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎలాంటి సానుకూలత రాదని, ఉద్యోగులు మరింత ఇబ్బందిపడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గత ప్రభుత్వంతో టచ్‌లో ఉన్న వారిని ఆయా సంఘాల నుంచి తొలగించి ఉద్యోగులకు మేలు చేసే నాయకులను ఎన్నుకోవాలని పలువురు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 15 రోజుల క్రితం రెవెన్యూ సంఘాలతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించినప్పుడు గత ప్రభుత్వం వాసనలు విడనాలని మంత్రి సున్నితంగా హెచ్చరించారు. ఇలా పలువురు మంత్రులు కూడా కొన్ని ఉద్యోగ సంఘాల నాయకుల తీరు గురించి హెచ్చరించినా వారిలో మార్పు రాకపోవడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News