Friday, January 3, 2025

సినిమా వాళ్ల ఎపిసోడ్‌లో కొంత సంయమనం పాటించాలనుకున్నాం: పొన్నం

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక చిత్రపరిశ్రమకు
సంబంధించిన కొంతమంది పెద్దలు చర్చను కొనసాగించడం తప్పు
కొండా సురేఖను అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేది
బలహీన వర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదు
విలేకరులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చిట్‌చాట్

మనతెలంగాణ/హైదరాబాద్:  సినిమా వాళ్ల ఎపిసోడ్‌లో కొంత సంయమనం పాటించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని రవాణా, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు స్పందించడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ఎవరైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారంటే అక్కడితో ఇక ఆ సమస్య ముగిసినట్లేనని ఆయన వెల్లడించారు. ఫిర్యాదుదారులు మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అడిగారని, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని, అయినా సినిమా వాళ్లు చర్చను కొనసాగించారని ఆయన తెలిపారు.

కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించు కున్నాక అంత దాడి అవసరమా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదని ఆయన పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా ప్రతినిధులతో మంత్రి పొన్నం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా సురేఖను అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేదన్నారు. పిసిసి అధ్యక్షుడు సైతం ఈ విషయం గురించి చర్చ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండూ ఒకటే

కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను నెరవేరుస్తున్నామన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండూ ఒకటేనని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై కుట్ర పూరితంగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు, ఆందోళనలు చేస్తున్నాయని మంత్రి పొన్నం మండిపడ్డారు. రైతుల కోసం మొన్న బిజెపి ఆందోళన చేస్తే ఇవాళ బిఆర్‌ఎస్ ఆందోళన చేస్తోందని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం మరో సారి వివక్షత చూపించిందని, దీని గురించి కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు మాట్లాడడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెసిడెన్షియల్, విద్యాసంస్థల సమస్యలపై సిఎం, డిప్యూటీ సిఎంలతో చర్చించా

రెసిడెన్షియల్, విద్యాసంస్థల సమస్యలపై సిఎం, డిప్యూటీ సిఎంలతో చర్చించానని ఆయన తెలిపారు. విద్యార్థుల సమస్యలపై వారిద్దరూ సానుకూలంగా స్పందించారన్నారు. రాష్ట్రంలో ఉన్న 1,029 గురుకులాల్లో చాలా వాటికి సొంత భవనాలు లేదని, కిరాయికి తీసుకున్న హాస్టల్స్ లో కూడా సరైన వసతులు లేవని మంత్రి వాపోయారు. పాములు, దోమలు లేకుండా ఉండాలని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారిని కోరానని ఆయన తెలిపారు. మెస్, డైనింగ్ హాల్స్ తదితర అంశాల్లో గ్రీన్‌చానెల్ ద్వారా నిధులు కేటాయించాలన్నారు. రెసిడెన్షియల్, విద్యాసంస్థలు సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం సంతోషంగా ఉందన్నారు.

బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తాం

బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలు మంచి సలహాలు ఇవ్వాలని మంత్రి పొన్నం కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో వరదసాయం విషయంలో నిరాశే మిగిలిందన్నారు. మహిళల ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, డిఎస్సీ, ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. మహిళలు ఆందోళన పడొద్దని, ఈ సంవత్సరం మహిళ సంఘాల సభ్యులకు మాత్రమే అవకాశం ఇచ్చామన్నారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందిదని, ఇప్పటికే బతుకమ్మ చీరలకు రూ.150 కోట్లు విడుదల చేశామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News