Sunday, October 6, 2024

మూసీ నది వెనుక దాక్కున్న ముసుగు దొంగలు ఎవరు..?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సందిస్తూ ట్వీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ వెనుక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు కెటిఆర్ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరని అడిగారు. రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరని ప్రశ్నించారు. మహిళలకు వంద రోజుల్లోనే నెలకు రూ.2,500 ఇస్తానని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడు ఎవరు..? అని నిలదీశారు. అవ్వ, తాతలకు నెలకు రూ.4000 ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరని అడిగారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని మాట తప్పిన దగావీరుడు ఎవరని ప్రశ్నించారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ.1.50 లక్షల కోట్ల లూటిఫికేషన్‌కి తెరతీసిన ఘనుడు ఎవరు అంటూ కెటిఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సిఎంకు బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా..? –

ముఖ్యమంత్రికి బతుకమ్మ అంటే గిట్టదా, పట్టదా? అని కెటిఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురావట్లేదా..? అని ప్రశ్నించారు. పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా అంటూ ధ్వజమెత్తారు. చెత్తా, చెదారం మధ్య మురికి కంపులో మన అక్కాచెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పంచాయతీల్లో పైసల్లేని పరిస్థితులు దాపురించాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? అని ప్రశ్నించారు. ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో చేసుకునే భాగ్యం కూడా మహిళలకు లేదా..? అని అడిగారు. బతుకమ్మ చీరలను రద్దు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా అంటూ రాష్ట్ర ప్రభుత్వం, సిఎంకు కెటిఆర్ ప్రశ్నలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News