మహారాష్ట్రలోని నాగపూర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై ఒక వ్యక్తి జరిపిన దాడిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ప్లాట్‌మ్ నంబర్ 6పై నిద్రిస్తున్న వ్యక్తులపైకి ఒక వ్యక్తి కాంక్రీట్ స్లీపర్‌ను(రైల్వే ట్రాకులపై వాడే 50 కిలోల బరువుండే స్లాబ్) వేసినట్లు రైల్వే పోలీసులు(జిఆర్‌పి) తెలిపారు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపించడంతో గస్తీ
విధులలో ఉన్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని దాడికి పాల్పడిన జైకుమార్ కేవల్(45)ను అదుపులోకి తీసుకున్నారని వారు చెప్పారు. ఈ దాడిలో తమిళనాడుకు చెందిన గణేష్ కుమార్(40)తో పాటు ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించాడని, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని మాయో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందచేస్తున్నట్లు వారు తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.