Sunday, December 22, 2024

మూసీ మూటల లెక్కలు చెప్పేందుకే సిఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన

- Advertisement -
- Advertisement -

మూసీ ప్రాజెక్టు మూటల లెక్కలు చెప్పేందుకే ముఖ్యమంత్రి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ విమర్శించారు. పేద ప్రజలు గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన భాసులతో మంతనాలు చేస్తున్నారని అరోపంచారు. సిఎం ఢిల్లీ పర్యటనలతో ప్రజలకు ఏం ప్రయోజనం ఒనగురిందో చెప్పాలని కెటిఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేవలం పది నెలల కాలంలో 23 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎంత మేర లబ్ది చేకూర్చారో చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెలలో కాలంలోనే ఢిల్లీకి 23 సార్లు చక్కర్లు కొట్టారని, ఇందులో ప్రజల ప్రయోజనం ఏముందో, ఇప్పటివరకు ముఖ్యమంత్రి పర్యటనల కారణంగా రాష్ట్రానికి వచ్చిన నిధులెన్నో లెక్కలు ప్రకటించాలని అన్నారు.

కనీసం ఫ్లైట్ ఛార్జీల ఖర్చంతా నిధులైనా ఈ రాష్ట్రానికి తీసుకువచ్చారా..? అని ఎద్దేవా చేశారు. అత్యధిక సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలు ప్రజల కోసమా లేదంటే కాంగ్రెస్ అధిష్టానాన్ని మెప్పించడానికా..? ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. మూసీలో కొల్లగొట్టే వేల కోట్ల రూపాయల లెక్క చెప్పేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారన్నారు. పేదల గూడు కూల్చేందుకు రాహుల్ గాంధీతో, అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పాలన గాలికి వదిలి గాలిమోటర్ ఎక్కుతున్న రేవంత్ తీరుపైన కెటిఅర్ మండిపడ్డారు.

రేవంత్‌రెడ్డి వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసు
ప్రజల అవసరాలను పక్కన పెట్టి చీటికిమాటికి ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండటం చూస్తుంటే ప్రజలకు మంచి చేయటం కన్నా ఢిల్లీ బాసులకు జై కొడితే తన సీటుకు ఎలాంటి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నారని కెటిఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి పది నెలల పాలనలో తెలంగాణలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. అటు ఢిల్లీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పాలనపై సంతోషంగా లేనందునే పదే పదే పిలుస్తూ ఆయనకు చీవాట్లు పెడుతున్నట్లుందని పేర్కొన్నారు. కేవలం పది నెలల కాలంలోనే ఇన్ని సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటే ఇదే లెక్కలో ఐదైళ్లలో మరో 125 సార్లు ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రజలు అధికారం ఇచ్చింది ఢిల్లీకి గులాంగిరి చేసేందుకు కాదు…పేదలకు మంచి చేసేందుకన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించాలని సూచించారు. కేవలం ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసేందుకు వెళ్లి రాష్ట్రానికి నిధులు తెస్తామంటూ రేవంత్‌రెడ్డి వేసుకున్న ముసుగు ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. పదే పదే పాలనను గాలికి వదిలి ఢిల్లీకి వెళ్తున్న అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలను పక్కన పెట్టి ప్రజలకు మంచి చేసే పనిలో నిమగ్నం కావాలని సూచించారు. ఇకనైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెట్టడం మాని ఓట్లేసి గెలిపించిన ప్రజలకిచ్చిన హమీల అమలుపైన దృష్టిసారించాలని కెటిఆర్ ముఖ్యమంత్రికి హితవు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News