Tuesday, October 8, 2024

ఆనందోత్సాహాల నుంచి విషన్నవదన స్థితికి

- Advertisement -
- Advertisement -

హర్యానా ఫలితాలతో ఎఐసిసికి ‘షాక్’
ఎగ్జిట్ పోల్స్ జోస్యాలకు పూర్తి విరుద్ధం

న్యూఢిల్లీ : మంగళవారం కాంగ్రెస్ పరిస్థితి ఆనందోత్సాహాల నుంచి విషన్నవదన దశకు దిగజారింది. ఉదయం ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఆనందాతిరేకాలు వ్యక్తం కాగా మధ్యాహ్నానికి నిరుత్సాహ వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతకర రీతిలో పరాజయం దిశగా సాగుతున్నదని హర్యానా శాసనసభ ఫలితాల సరళి సూచించింది. ఉదయం వోట్ల లెక్కింపు మొదలైనప్పుడు ఎగ్జిట్ పోల్స్ జోస్యానికి తగినట్లుగా హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం దిశగా సాగుతున్న సూచనలు గోచరించాయి. ఢిల్లీలో 21 అక్బర్ రోడ్‌లోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ, ‘జిలేబీలు’, ‘లడ్డూలు’ పంచుతూ కనిపించారు. పార్టీ ఆధిక్యంలో సాగుతోందని సరళి సూచించినప్పుడు ఉదయం సుమారు 9 గంటలకు వృద్ధ పార్టీ ప్రధాన కేంద్రంలో డప్పు నాదాలు ప్రతిధ్వనించాయి. కానీ, ఉదయం 10 గంటలు దాటే సరికి బిజెపి క్రమంగా పుంజుకుంటున్న సంకేతాలు కనిపించగా ప్రధాన కేంద్రాన్ని నిరుత్సాహం ఆవరించింది.

డప్పులు, మిఠాయిలు అక్కడి నుంచి అదృశ్యమయ్యాయి. ప్రధాన కార్యాలయంలోని వివిధ ప్రదేశాల్లో కాంగ్రెస్ నాయకులు మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ కనిపించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాల సరళి మారుతుందని వారు వాదించారు. కానీ అలా జరగలేదు. ఇక కాంగ్రెస్ క్యాంటీన్ ఎప్పటివలె రద్దీగా కనిపించింది. అయితే, అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తల ముఖాల్లో నిరాశ కొట్టవచ్చినట్లు కనిపించింది. తాము పకోడీలు, పూరీలు వంటి ప్రత్యేక వంటకాలు సిద్ధం చేశామని, కానీ, హర్యానా ఎన్నికల ఫలితాల సరళిలో మార్పుతో వాటిని తీసుకునే వారే కరవయ్యారని క్యాంటీన్ కార్మికుడు ఒకరు వాపోయారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయం ఆ వెంటనే దాదాపుగా నిర్మానుష్యంగా మారిపోయింది.

మీడియా సిబ్బంది, కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే అక్కడ ఉండిపోయారు. ‘ఏమి జరిగిందో మేము ఊహించుకోలేకపోతున్నాం. వాస్తవానికి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగానో ఉంది. ఇది చాలా ఆశ్చర్యకర ఫలితం’ అని పార్టీ కార్యకర్త ఒకరు అన్నారు. గత నెల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన వోట్ల లెక్కింపు సాగుతున్నప్పుడు కాంగ్రెస్, బిజెపిలకు మిశ్రమ ఫలితాల సూచనలు కనిపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో కాషాయ పార్టీ పరాజయం దిశగా సాగింది. కానీ, హర్యానాలో ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఆదిలో కానవచ్చిన సరళికి భిన్నంగా కాంగ్రెస్‌పై బిజెపి పైచేయి సాధించింది. ఆ సరళి కొనసాగినట్లయితే, కాంగ్రెస్ హర్యానా రాష్ట్రంలో ఓటమితోను, కేంద్ర పాలిత ప్రాంతంలో ‘రెండవ భాగస్వామి విజయం’తో సరిపెట్టుకోవలసి రావచ్చు.

ఎన్నికల కమిషన్ (ఇసి) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఫలితాల సరళి ప్రకారం, మధ్యాహ్నం 2 గంటలకు అధికార బిజెపి హర్యానా అసెంబ్లీలో మెజారిటీ స్థాయిని దాటి, 47 సీట్లలో ఆధిక్యంలో ఉంది లేదా గెలిచింది. కాంగ్రెస్ 38 సీట్లలో ఆధిక్యంలో ఉంది లేదా గెలిచింది. హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. జమ్మూ కాశ్మీర్‌లో కూడా కాంగ్రెస్‌కు ఉత్సాహభరితంగా మొదలైన ఫలితాల సరళి క్రమంగా నిరాశాజనకంగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) మెజారిటీ సాధించబోతుండగా, మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు సీట్లలో ఆధిక్యంలో ఉంది లేదా గెలిచింది. ఇది ఇలా ఉండగా, ఇసి వెబ్‌సైట్‌లో హర్యానా ఎన్నికల ఫలితాలను అప్‌డేట్ చేయడం ‘అనూహ్యంగా మందగించడం’ గురించి కాంగ్రెస్ కమిషన్ దృష్టికి తీసుకువచ్చింది. ‘తప్పుడు వార్తలు, దురుద్దేశపూర్వక కథనాలను’ వెంటనే తిప్పికొట్టడానికి వీలుగా కచ్చితమైన గణాంకాలతో అప్‌డేట్ చేయవలసిందిగా అధికారులను ఆదేశించాలని ఇసికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News