Sunday, November 24, 2024

టీమిండియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌తో బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టి20లో భారత్ 86 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోను సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు చేపట్టిన బంగ్లాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తూ బంగ్లా బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్ (16), లిటన్ దాస్ (14)లు విఫలమయ్యారు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (11) కూడా నిరాశ పరిచాడు.

తౌహిద్ హృదయ్ (2), మెహదీ హసన్ మిరాజ్(2)లు కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. మహ్మదుల్లా ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మహ్మదుల్లా 3 సిక్సర్లతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. జాకేర్ అలీ (1), రిశాద్ హుస్సేన్ (9), తంజిమ్ హసన్ సాకబ్ (8)లు కూడా విఫలమయ్యారు. దీంతో బంగ్లా స్కోరు 135 పరుగుల వద్దే ఆగిపోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను నితీష్ రెడ్డి, రింకు సింగ్‌లు అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రెడ్డి 34 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 4 బౌండరీలతో 74 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన రింకు సింగ్ 29 బంతుల్లో 3 సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్య 19 బంతుల్లోనే వేగంగా 32 పరుగులు చేశాడు. రియాన్‌పరాగ్ (15) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ స్కోరు 221 పరుగులకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News