Wednesday, October 16, 2024

కశ్మీర్‌లో అర్ధ సూర్యోదయం

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికలతో కశ్మీర్‌లో అర్ధ సూర్యోదయం జరిగింది. మనకు అర్ధ చంద్రోదయం అనే పద ప్రయోగం ఉంది గాని అర్ధ సూర్యోదయ ప్రయోగం ఇంత వరకు లేదు. ఈ పదం ఉబుసుపోకకో, సంచలనానికో ఉపయోగిస్తున్నది కాదు. అందుకు తగిన అర్థం ఉంది. అక్కడే పది సంవత్సరాల సుదీర్ఘ వ్యవధి తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోగలిగారు. మన దేశంలో స్వాతంత్య్రానంతరం మొదటి ఎన్నికలు 195152లో జరిగిన నాటి నుంచి, ఏ రాష్ట్రంలోనైనా పదేళ్లు కాదు కదా అయిదేళ్లయినా జరగకపోవటం ఇదే మొదటిసారి. అందుకు కారణాలు ఏమిటి, బాధ్యులెవరన్నది పక్కన ఉంచితే, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో, అందులోనూ మొత్తం ప్రపంచంలోనే అతి పెద్దదని గర్వంగా చాటుకునే వ్యవస్థలో ఇదొక పెద్ద విషాదమన్నది కశ్మీర్ ప్రజల భావన.

ఇటువంటి పరిస్థితులలో అక్కడ ఎన్నికలు జరగడం వాస్తవానికి పూర్తి సూర్యోదయం కావాలి. కాని యథాతథంగా ఎన్నికలు జరగటమే సూర్యోదయం కాగా, దానిని అర్ధ సూర్యోదయమని మాత్రమే అనడానికి గల కారణం ఏమిటి? గెలిచిందెవరు, ఓడిందెవరు అనేది ప్రధానం కాదు. బిజెపి గెలవటమనే ప్రసక్తి లేదని ముందే తెలిసిన విషయం. తను జమ్మూ ప్రాంతంలో ఎప్పటి వలెనే అత్యధిక స్థానాలు గెలిచినా, కశ్మీర్ లోయలో తమకు తోడు రాగల మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పిడిపి తగినన్ని సీట్లు తెచ్చుకున్నట్లయితే, లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే అయిదుగురు ఎంఎల్‌ఎలతో కలిపి అధికారానికి రావచ్చుననే అంచనాలు మొదట ఉండిన మాట నిజం. కాని, మెహబూబా చాలా వెనుకబడిపోయినట్లు ప్రచారం మధ్యలోనే తేలిపోవడంతో వారి ఆశలు కూడా తేలిపోయాయి. అదే విధంగా, ఫరూఖ్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి పూర్తి ఆధిక్యత రాని పక్షంలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే వారితో చిక్కులు కల్పించవచ్చుననే ఆలోచనలు సైతం నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 90లో 49 లభించడంతో భంగపడిపోయాయి.

ఈ విధమైన సీట్లు, ఓట్ల వివరాలును తర్వాత చూద్దాము. ప్రస్తుతానికి వస్తే, పదేళ్ల వ్యవధి తర్వాత ఎన్నికలు జరగడం, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడనుండటం, బిజెపి వ్యూహం మొత్తంగా విఫలం కావటం అనే మూడూ కలిసి కూడా, ఒక వైపు ఆహ్వానించదగినవి అవుతూనే, మరొక వైపు అర్ధ సూర్యోదయంగా మిగులుతున్నాయి. ఎందుకంటే, జమ్మూకశ్మీర్‌ను అక్కడి రాజ్యాంగ సభ ఒక తీర్మానం ద్వారా భారత యూనియన్‌లో 1954లో విలీనం చేసినప్పటి నుంచి, 1987 ఎన్నికలలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సాగించిన అక్షరాలా అరాచకం వరకు 33 సంవత్సరాల పాటు కశ్మీర్ ప్రజలకు ఏ పార్టీ పరిపాలించినా అంతా అస్తవ్యస్తమే. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌లు విడిగా పాలించినా, కూటమిగానైనా, పీకలలోతు అవినీతిలో కూరుకుని, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్షం చేశాయి.

జమ్మూకు పరిమితమైన బిజెపి తన వంతు అవినీతి పాత్రను తాను పోషించింది. ఈ విధమైన 33 సంవత్సరాల అస్తవ్యస్తత చివరలో 1987 నాటి ఎన్నికల అరాచయం ఆ రాష్ట్రాన్ని, యావత్ సమాజాన్ని కూడా విషాద స్థితి నుంచి విషమ స్థితిలోకి నెట్టాయి. 1989 నుంచి మొదలైన మిలిటెన్సీ, రెండు తరాల పాటు యువకులను మిలిటెంట్లుగా మార్చి మొత్తం సమాజాన్ని బీభత్సంగా చేసివేసింది. నిజానికి, బయటి భారతంలోని వారికి అంతగా తెలియదు గాని, కశ్మీర్‌ది ఒక గొప్ప జ్ఞానమయమైన సంస్కృతి, సమాజం. ఇది సందర్భం కానందున అందులోకి వెళ్లలేము గాని, ఆ రాష్ట్రం దశాబ్దాల పాటు ఆ విధంగా కల్లోలమయం కావటానికి మొదటి దోషులు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కాగా, తర్వాతది బిజెపి. నేను ఒక జర్నలిస్టుగా స్వయంగా ఆ రాష్ట్రానికి మూడు సార్లు వెళ్లి, ప్రతి ఒక్క జిల్లాను సందర్శించి, నాయకులు, అధికారుల నుంచి మొదలుకొని సామాన్యులు, మిలిటెంట్ల వరకు అందరితో మాట్లాడిన మీదట రాస్తున్న మాట ఇది.

ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో ఉంచుకుంటూ ప్రస్తుత ఎన్నికల గురించి అంటున్నది, ఇన్నిన్ని దశాబ్దాల పాటు ఇంతింత కల్లోలానికి గురైన కశ్మీర్ సమాజం ఇప్పటికీ కొత్త శక్తులను సృష్టించుకోలేదు. ఆ ప్రజల పట్ల, ఆ సమాజం పట్ల, అభివృద్ధి నిబద్ధతతో, సంక్షేమ నిబద్ధతతో, విలువల నిబద్ధతతో పని చేసి ఆ రాష్ట్రాన్ని భవిష్యత్తు వైపు తీసుకు వెళ్లగల కొత్త రాజకీయ శక్తులను, తరాన్ని, పార్టీలను ముందుకు తెచ్చి నిలబెట్టుకోలేకపోయింది. అన్నీ అవే పార్టీలు, అదే నాయకులు. తమను మొదటి నుంచి పీడించి, వేధించి, అభివృద్ధి లేమితో వెనుకకు తోసి, అవినీతితో దోచుకున్న వారే. రానున్న కాలంలోనైనా తమ తీరును మార్చుకోగల లక్షణాలను ఎంత మాత్రం ప్రదర్శించని వారే. కేవలం అధికార దాహంతో పరితపిస్తున్న వారే. అటువంటప్పుడు దీనిని పూర్ణ సూర్యోదయమని అనగలమా?

యథాతథంగా ఎన్నికల ఫలితాల గురించి కొంత చెప్పుకుని, రాగల కాలంలో జరగవలసిందేమిటి, జరగగల అవకాశమున్నదేమిటో తర్వాత చూద్దాము. ఫలితాలలో ప్రధానంగా పేర్కొనవలసినవి కొన్నున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ బలమైన పార్టీ, బిజెపికి స్పష్టమైన విధంగా వ్యతిరేకంగా నిలవటం, కాంగ్రెస్‌తో, సిపిఎంతో పొత్తు కుదుర్చుకోవటం, ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి మాట్లాడకున్నా (ఇపుడు ఏ పార్టీ కూడా అది అడగటం లేదు) ప్రస్తుత కేంద్ర పాలిత ప్రాంత (యూనియన్ టెర్రిటరీ) స్థాయి నుంచి పూర్తి హోదా గల రాష్ట్రంగా మార్చాలన్న డిమాండ్‌తో (ఇది ప్రజల ఆత్మగౌరవ సమస్యగా మారింది) ముందుకు రావటం, మెహబూబా పార్టీకి బిజెపికి సన్నిహితమనే ముద్ర ఉండటం అన్నవి నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి అనుకూలంగా మారాయన్నది మొదటి ముఖ్యమైన విషయం.

పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతూ తమకు తిరిగి ఊపిరి పీల్చుకునే అవకాశం లభించినట్లు భావించిన ప్రజలు శాంతియుతంగా పెద్ద ఎత్తున పోలింగ్‌కు వెళ్లారన్నది రెండవ విషయం. యథాతథంగా పోలింగ్ శాతం 2014 కన్న రెండు అంకెలు తగ్గి ఉండవచ్చుగాక. కాని, మిలిటెన్సీకి పేరుబడిన ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్, బారాముల్లా జిల్లాలలో పోలింగ్ గత 30 ఏళ్లలోనే ఎప్పుడూ లేనంతగా జరగడం గమనించదగ్గ విశేషం. మూడవది, ఇంత హడావుడి చేసి నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు పెట్టుకున్నా, రాహుల్ గాంధీ యాత్రలు జరిపినా, కాంగ్రెస్ సీట్లు పోయిన సారి ఉండిన 12 నుంచి ఆరుకు తగ్గాయి. నాల్గవది, బిజెపి సీట్లు కొంత పెరిగాయి గాని వారికి సంప్రదాయికంగా పెట్టని కోట అయిన జమ్మూలోనే. అక్కడ వారు కాంగ్రెస్ ఓట్లను మరింత ఆకర్షించగా, కశ్మీర్ లోయలో పిడిపి ఓట్లను నేషనల్ కాన్ఫరెన్స్ భారీగా సంపాదించుకుంది. మొత్తం మీద, తమ ముందున్న పరిస్థితులలో, పైన అనుకున్నట్లు కొత్త శక్తులేవీ ఆవిర్భవించనందున, ప్రజలకు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఎన్నుకోదగినదిగా కన్పించింది. వాస్తవానికి వారికి ఈ రెండు పార్టీల పట్ల విశ్వాసమేమీ లేదు. సన్నిహిత సహచరులకు, ఆశ్రిత గణాలకు తప్ప. అందుకు కారణం వారి గత పాలనలోని అనుభవాలు.

కాని ప్రస్తుత పరిస్థితులలో అంతకన్న ప్రత్యామ్నాయం లేదు. ఇవన్నీ అక్కడి సామాన్యులు స్వయంగా చెప్పే మాటలు. అందువల్ల వారి రాగల అయిదేళ్లలో పరిపాలన ఏ విధంగా ఉండగలదోనని ఆశానిరాశల మధ్య ఊగిసలాడుతూ ఎదురు చూస్తుండగలరు. లద్దాఖ్ యు.టి గానే కొనసాగినా జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వగలమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించినందున అదెప్పుడు జరగగలదన్నది ఒక ప్రశ్న అవుతుంది. ఆర్టికల్ 370 రద్దయి ఆ రాష్ట్రంలో బయటి వారి ఆస్తుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు మొదలైపోయినందున ఈ పరిణామాలు మును ముందు ఏ విధంగా సాగి ప్రజలపై, యువకులపై ఎటువంటి ప్రభావాలు సృష్టించవచ్చునన్నది మరొక ప్రశ్న.

పూర్తి రాష్ట్ర స్థాయి లభించినా అక్కడి ప్రభుత్వం వీటినేమైనా నియంత్రించగలదో లేదో తెలియదు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి కశ్మీర్‌ను తక్కిన రాష్ట్రాలతో సమాన స్థాయి అభివృద్ధికి తీసుకు పోగలమని ప్రధాని మోడీ పలు మార్లు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేరగలవన్నది ఒక కీలకమైన విషయంగా మారుతుంది. ఆయన నిజంగా ఆ పని చేస్తారా లేక ముస్లిం మెజారిటీ ప్రాంతం తమ పార్టీని తిరస్కరించినందున అందుకు అనుగుణంగా వ్యవహరిస్తారా అన్నది జాగ్రత్తగా గమనించవలసిన విషయమవుతుంది. పోతే, కశ్మీర్‌లో పైన అనుకున్న అర్థంలో పూర్ణ సూర్యోదయం కాగల అవకాశాలు కనుచూపు మేరలోనైతే కన్పించడం లేదు. కాని ఈ అర్ధ సూర్యోదయం కనీసం ఆ స్థాయిలోనైనా మిగులుతుందా లేక అందరూ కలిసి లోగడ వలె క్రమంగా సూర్య గ్రహణం తెప్పించగలరా అన్నది అన్నిటికి మించిన కీలక ప్రశ్న.

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News