Thursday, December 26, 2024

ఊహకందని ఫలితాలు కకావికలమైన కాకిలెక్కల సర్వేలు

- Advertisement -
- Advertisement -

హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు కొంత మందికి మోదాన్ని, మరి కొందరికి ఖేదాన్ని కలిగించాయి. సర్వేలన్నీ కాకిలెక్కలని తేలిపోయాయి. ప్రజల నాడిని పసిగట్టడంలో కాకలుతీరిన రాజకీయ యోధులంతా విఫలమయ్యారనే చెప్పవచ్చు. కేవలం కొంత మంది ఓటర్ల అభిప్రాయాలను బట్టి, మీడియా కథనాలను బట్టి ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల గెలుపోటములను నిర్ణయించడం సముచితంకాదు. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి సర్వేల పేరుతో ప్రజలను అయోమయానికి గురిచేయడం, సర్వేలను నమ్మి కోట్ల రూపాయల్లో బెట్టింగులు కాసి, సర్వం కోల్పోయి అత్మహత్యలకు పాల్పడడం వంటి సంఘటనలు గతంలో చూశాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సర్వేల విషయంలో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకోవాలి.

గత కొంతకాలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు ఘోరంగా విఫలమవుతున్న సంగతి విదితమే. 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో పలు సర్వేలు బిజెపి 400 పైగా సీట్లను గెలుచుకుంటారని జోస్యం చెప్పాయి. మోడీ కూడా లోక్‌సభకు జరిగిన అన్ని ఎన్నికల సభల్లో చార్ సౌ పార్ అంటూ నినదించారు. కాని 17వ లోక్‌సభలో గెలిచిన 303 స్థానాలను కూడా గెలుచుకోలేక, మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేక టిడిపి, జెడియుల బలంతో మూడోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు జరిగిన హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో రెండు చోట్లా బిజెపి అపజయాన్ని చవిచూస్తుందని, హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అయినప్పటికీ బిజెపి మూడోసారి హర్యానాలో అధికారం కైవసం చేసుకుని ప్రత్యర్ధుల నోళ్ళను మూయించింది.

హర్యానాలో తన ప్రాభవం కోల్పోయిందనుకున్న దశలో బిజెపి గతంలో కంటే అధిక సీట్లను సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎన్నికలకు ముందు హర్యానాలో బిజెపి పరిస్థితి ఆశాజనకంగా లేని మాట వాస్తవం. వ్యవసాయ చట్టాల విషయంలో బిజెపి అనుసరించిన వైఖరి సహజంగానే రైతుల్లో కోపాగ్నిని రగిలించింది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా బలమైన వర్గంగా ఉన్న జాట్‌లు బిజెపి వైఖరిపట్ల విసుగు చెంది, ఆ పార్టీకి దూరమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాట్‌వర్గాన్ని చేరదీసింది. ఇది దళిత వర్గాల్లో చీలికకు కారణమైనది. జాట్‌లు, రైతులు, యువకులు, దళితులు ఇతర సామాజిక వర్గాలు బిజెపికి దూరమైన నేపథ్యంలో బిజెపి అనుసరించిన రాజకీయ బహుముఖ వ్యూహం హర్యానాలో ఆ పార్టీని తిరిగి విజయ తీరాలకు చేర్చింది.

కాంగ్రెస్ పక్షాన నిలిచిన జాట్లు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌కు ఓట్లు వేయలేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఒకవైపు, నిరుద్యోగ సమస్య మరొక వైపు, రైతుల ఆగ్రహం మరో వైపు, అగ్ని వీర్ అంశంపై యువత నిరసన ఇంకో వైపు బిజెపి పుట్టు ముంచబోతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వలన కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరకుండా కుల సమీకరణాల ద్వారా, రాజకీయ వ్యూహాల ద్వారా యాంటీ ఇన్‌కంబెన్సీ ఓటును చీల్చడం ద్వారా తమ చేయి జారిపోతుందనుకున్న హర్యానా అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడంలో బిజెపి నేతలు తమ అనుభవాన్నంతటినీ రంగరించి, కాంగ్రెస్‌కు నిరాశను మిగిల్చారు. సునాయాసంగా హర్యానాలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటుదనుకున్న హస్తం అధినాయకుల ఆశలు ఆవిరైపోయాయి.

కాంగ్రెస్ తప్పిదాలే హర్యానాలో హస్తం ఓటమికి కారణం. బిజెపి వ్యూహాలను అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనది.‘నో ఎంట్రీ బోర్డ్ ఫర్ కాంగ్రెస్’ అని ప్రత్యర్ధి పార్టీ అన్నట్టుగానే హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండాపోయింది. ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్‌కు చెందిన జైరాం రమేష్ పేర్కొంటున్నా ప్రయోజనం ఏముంది? ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీకి శృంగభంగం జరిగింది. లిక్కర్ స్కాంలో అరెస్టు అయి, తీహార్ జైలులో శిక్ష అనుభవించిన ఆప్ నేత కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలై, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, హర్యానా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి, పరోక్షంగా బిజెపికి తోడ్పాటునందించినట్టయింది. కేజ్రీవాల్‌ను ప్రజలు నమ్మడం లేదనడానికి ఇది మరొక నిదర్శనం. ఢిల్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే విషయం రూఢి అయింది.

నిప్పులేకుండా పొగరాదని ప్రజలు విశ్వసిస్తున్నారనడానికి హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఖాతా తెరవని ఆప్ వైఫల్యమే ప్రబల నిదర్శనం. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తానని కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో మాదిరిగా కేజ్రీవాల్‌ను ప్రజలు విశ్వసించడం లేదు. ఈ కారణంగా 2025లో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా అప్ కు నిరాశనే మిగల్చగలవనడంలో కించిత్తు సందేహమైనా లేదు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌లు పొత్తు పెట్టుకుని ‘ఇండియా’ కూటమిని అధికారంలోకి తెచ్చారు. ఇక్కడ బిజెపి గెలవదని ముందుగా ఊహించినదే. ఆర్టికల్ 370 రద్దు, ఇతర కారణాల వలన బిజెపికి కశ్మీర్‌లో ఓటమి ఎదురైనా గౌరవప్రదమైన సీట్లు ఆ పార్టీకి దక్కడం విశేషం.

హర్యానాలో విపక్షాల అనైక్యత వలన బిజెపి లాభపడింది. ఒక శాతం కంటే తక్కువ ఓట్ల వ్యత్యాసంతో 48 సీట్లు గెలుచుకుని అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 37 సీట్లతో ప్రతిపక్షంగా మిగిలింది. జమ్మూకశ్మీర్‌లో 90 శాసనసభ స్థానాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ 42 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నది. జమ్మూలో బిజెపి తన హవా కొనసాగించినా, కశ్మీర్‌లో డీలాపడింది. జమ్మూకశ్మీర్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఎన్‌సి కంటే బిజెపికి వచ్చిన ఓట్ల శాతం అధికంగా ఉన్నా బిజెపికి ఎన్‌సి కంటే 13 సీట్లు తగ్గాయి. జమ్మూకశ్మీర్‌లో ఒంటరిగా పోటీ చేసిన బిజెపి గతంలో కంటే అధికంగా సీట్లను గెలుచుకుంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యం లో జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్‌సికి కశ్మీర్ ప్రజల తాత్కాలిక భావోద్వేగం ఓట్ల పంటగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేని బిజెపి కేవలం మిత్రపక్షాల సహకారంతో మూడోసారి ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ‘ఇండియా’ కూటమి నేతలకు జమ్మూకశ్మీర్‌లో విజయం ఉత్సాహాన్ని ఇచ్చినా, హర్యానాలో ఎదురైన చేదు అనుభవం కృంగదీసింది. ఎన్నికల్లో జయాపజయాలు సహజం. ఓటమితో కృంగకుండా, గెలుపుతో పొంగిపోకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై పని చేస్తే మరో 5 సంవత్సరాల తర్వాతనైనా ఎన్నికల్లో విజయం సాధించవచ్చు. అలాగే బిజెపి కూడా మొండిగా వ్యవహరించకుండా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ నిర్ణయాలను సమీక్షించుకోవాలి. వ్యవసాయ చట్టాల విషయంలోను, రైతుల ఉద్యమాల విషయంలోను ఉత్తర భారతంలో ఇప్పటికే బిజెపి తీవ్రంగా నష్టపోయిన విషయం కాదనలేని సత్యం.

కేంద్రంలో మూడోసారి ఎన్‌డిఎ అధికారంలోకి రావడంలో తెలుగు రాష్ట్రాలు ఊపిరిపోసిన విషయాన్ని మరవరాదు. ఉత్తర భారతం, దక్షిణ భారతం అనే విభేదాలు ప్రజల్లో పొడచూపకుండా బిజెపి అధినాయకత్వం తగు జాగరూకత వహించాలి. విపక్షాల పట్ల, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపట్ల రాజకీయాలకతీతమైన భావనతో సమధర్మం పాటించాలి. రాజకీయ పార్టీల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి, దేశ విశాల ప్రయోజనాల రీత్యా అన్ని పార్టీలతో కేంద్రం సఖ్యతగా మెలగాలి. ఫెడరల్ వ్యవస్థను కాపాడాలి. ప్రపంచంలో భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో భారతదేశం ప్రపంచానికే తలమానికం కాబోతున్న తరుణంలో మోడీ తన చాకచక్యాన్ని ప్రదర్శించి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రరాజ్యాల సరసన నిలపాలని ఆశిద్దాం.

సుంకవల్లి సత్తిరాజు

9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News