రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి మెండిచేయి చూపిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్ రావు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాల వేడుకల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం గుండు సున్నా మిగిల్చిందని ఆయన ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బిజెపి ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. ఒక్క రూపాయీ సాధించలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయడంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
లోక్‌సభలో బిఆర్‌ఎస్ ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లోనూ తెలంగాణకు సున్నా కేటాయింపులు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అడిషనల్ గ్రాంట్ కింద రూ.15,000 కోట్లు ఇచ్చారని, ఎపికి ఇచ్చారని తమకు బాధలేదని, కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనేదే తమ ఆవేదన అని పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం మొదటి నుంచీ తెలంగాణకు మొండి చెయ్యే చూపిస్తోందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం పట్ల ఇంత వివక్ష ఎందుకంటూ హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.