Wednesday, October 16, 2024

మహారాష్ట్రలో బిష్ణోయ్ గ్యాంగ్ పంజా

- Advertisement -
- Advertisement -

ఎన్‌సిపి అగ్రనేత బాబా సిద్ధిఖీ దారుణ హత్య
కుమారుడి కార్యాలయంలో ఉండగానే దుండగుల కాల్చివేత
చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ఇద్దరు నిందితుల అరెస్టు
అగ్రనటుడు సల్మాన్ సహా బాలీవుడ్ ప్రముఖులకు సిద్ధ్దిఖీ సన్నిహితుడు

భారీ ఇఫ్తార్ విందులకు ఆయన
మారుపేరు సమగ్ర విచారణకు
విపక్షాల డిమాండ్
ఎన్నికల ముంగిట సంచలనం

ముంబై : ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (66)తుశనివారం సాయంత్రం ముంబై లోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా తుపాకీ కాల్పులకు గురయ్యారు. ఆయన కుమారుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు. వెంటనే సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి అయిన సిద్ధిఖీ మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉంటున్నారు. వచ్చే నెల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ హత్య జరగడం సంచలనం కలిగిస్తోంది. గత ఫిబ్రవరి వరకు కాంగ్రెస్‌లో కీలక స్థానం వహించిన సిద్ధిఖీ తరువాత కాంగ్రెస్ నుంచి వైదొలగి ప్రాంతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి అజిత్‌వర్గం)లో చేరారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్‌వర్గం ఎన్‌సిపి భాగస్వామ్యం అయిన సంగతి తెలిసిందే. సిద్ధిఖీ హత్య పిరికి చర్యగా అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ సంఘటన విని తాను షాక్‌కు గురయ్యానని చెప్పారు.

బాబా సిద్ధిఖీని చంపింది మేమే… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.ఈ కేసులో అరెస్టయిన హరియాణాకు చెందిన కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందినవారమని పేర్కొన్నట్టు ఇప్పటికే పోలీస్ వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను పోలీస్‌లు ఆదివారం అదుపు లోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు. బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. సిదూ మూసేవాలాను 2022లో హత్యతోపాటు అనేక హత్యకేసుల్లో ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.

సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు కొన్ని నెలలుగా ప్రణాళికలు రచించారని , ఆయనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని తెలిపారు. ఈ హత్య చేసినందుకు గాను నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ.50,000 అడ్వాన్స్ , మారణాయుధాలు ఇచ్చినట్టుగా తమ విచారణలో తేలిందని పోలీస్‌లు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది ట్రైలర్ మాత్రమే .ముందుంది అసలు సినిమా అంటూ ఆనాడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పోస్ట్ పెట్టారు. తాజా సంఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటివద్ద భద్రతను పెంచారు.

కన్నీటి పర్యంతమైన శిల్పాశెట్టి

సిద్ధిఖీకి నివాళి అర్పించేందుకు రాజకీయ నాయకుడు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. సినీ నటి శిల్పాశెట్టి , ఆమె భర్త రాజ్‌కుంద్రా నివాళులు అర్పించారు. ఆస్పత్రి నుంచి బయటకు రాగానే శిల్పాశెట్టి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.

బిగ్‌బాస్ 18 షూటింగ్ రద్దు ..  ఆస్పత్రికి సల్మాన్
తన స్నేహితుడు సిద్ధిఖీ హత్యకు గురైనప్పుడు సల్మాన్ ఖాన్ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. మరణవార్త విన్న వెంటనే మిగిలిన షూటింగ్ రద్దు చేసుకుని ఆస్పత్రికి బయల్దేరారు. సిద్ధిఖీ హత్యకు నిరసనగా ఆదివారం పార్టీ కార్యకలాపాలన్నిటినీ రద్దు చేశామని ఎన్సీపీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.

దేశం మొత్తం భయపడుతోంది : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : సిద్ధఖీ హత్య మహారాష్ట్ర బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ హత్యతో మహారాష్ట్ర మాత్రమే కాదు, దేశం మొత్తం భయపడుతోందన్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, గ్యాంగ్‌స్టర్ పాలన తీసుకురావాలనుకునే వారికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భద్రత ఇవ్వలేని మహారాష్ట్ర ప్రభుత్వం: సిద్ధిఖీ హత్యపై ఖర్గే విమర్శ

ఎన్‌సిపి నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్రలో ఇప్పుడున్న శాంతిభద్రతల క్షీణతను తెలియచేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. పట్టపగలు హత్య జరిగింది. దీనిని బట్టి అక్కడ శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయి అనేది విదితం అవుతోందని కాంగ్రెస్ నేత ఖర్గే తమ స్వగ్రామం కలబురగిలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తర కర్నాటకలోని ఈ ప్రాంతం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. మహారాష్ట్రలోని బిజెపి శివసేన షిండే వర్గపు ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించలేకపోతోంది. ఈ విషయం ఇప్పటి ఘటనతో రుజువు అయింది. మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఈ అవలక్షణపు కూటమికి ప్రజలు సరైన గుణపాఠం చెపుతారని ఖర్గే వ్యాఖ్యానించారు. పక్షం రోజుల క్రితం సిద్థిఖీ తనకు ప్రాణగండం ఉందని ప్రభుత్వానికి తెలియచేశారు. దాడి జరగవచ్చునని , సరైన భద్రత కల్పించాలని కూడా ముందుగా ఆందోళన వ్యక్తం చేశారని ఖర్గే తెలిపారు. పోలీసు కమిషనర్‌కు కూడా చెప్పారని,అధికారులు ఎందుకు భద్రత పెంచలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతలు క్షీణించిన దశలో ప్రజలు ఇక కుదురుగా ఉండటం సాధ్యమా అని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News