Monday, November 25, 2024

రైతు ‘బందే’నా !

- Advertisement -
- Advertisement -

పంటల సాగులో పెట్టుబడి భరోసా ఇంకెప్పుడు
ఖరీఫ్ కరిగిపోయింది..రబీకైన ఖజానా కరుణిస్తుందా
ఆశలన్ని ప్రభుత్వంపైనే

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో రైతుబంధు పథకం బందయిపోయింది. రైతుభరోసాకోసం వ్యవసాయ రంగంలో కొత్తరాగాలు వినిపిస్తున్నాయి. అసలే కొత్త ప్రభుత్వం ..పదేళ్వ విరామం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా పాలనలో ఇదే తొలిఅనుభవం.. గత బిఆర్‌ఎస్ పాలనలో ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయివున్న రాష్ట్రం.. ఒక వైపు ప్రభుత్వ ఖజానాకు ఆర్దిక ఇబ్బందులు ..మరో వైపు పంట రుణాల మాఫీకోసం వత్తిళ్లు ..ఇన్నేసి ఇబ్బందుల్లోనూ రేవంత్ రెడ్డి సర్కారు పంట రుణాల మాఫీలో తల తాకట్టు పెట్టయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకు సాగుతోంది.

ఇప్పటికే మూడు విడతలుగా రెండు లక్షల రూపాయల వరకూ రైతుల రుణాలు మాఫీ చేసింది. 22,37,848 మంది రైతుల బ్యాంకు ఖాతాలకు పంట రుణాల మాఫీ కింద రూ.17,933.19కోట్లు జమ చేసింది.రూ.2లక్షలు పైన ఉన్న రుణాలకు కూడా మాఫీ చేసేందకు నిధుల కోసం కసరత్తులు చేస్తోంది. ఇదిలా నడుస్తుండగానే.. రాష్ట్రంలో పంటల సాగుకోసం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద అందించాల్సిన నిధులు ఎప్పుడందిస్తారని రైతులు కొత్త రాగం అందుకుంట్నునారు.రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత మెరుగైన రీతిలో పారదర్శకంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన నిర్ణయం తీసుకుంది.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొండలకు ,గుట్టలకు రాళ్లకు రప్పలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు పథకం కింద కళ్లు మూసుకుని నిధులు దుర్వినియోగం చేసిందని ఈ ప్రభుత్వం బలంగా నమ్మింది. రైతుబంధ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆ స్థానంలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా ఎకరానికి ఏటా రూ.15వేలు పంటలకు పెట్టుబడి సాయంగా అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి గట్టి హామీ కూడా ఇచ్చింది.

గత రబిలోనే కొడిగట్టిన రైతు‘బందు’:

గత రబీ సీజన్‌లోనే రైతుబంధు పథకం కొడిగట్టింది. ఎన్నికల కోడ్‌తో ఈ పథకం పలు మార్లు వాయిదాలు పడి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో పూర్తిగా ఆరిపోయింది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2018-19ఆర్ధిక సంవత్సరం నుంచి రైతుబంధు పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఎకరాకు రూ.8వేలు పంటల పెటుబడి కింద రెండు విడతలుగా ఖరీఫ్‌లో రూ.4000 రబీలో రూ.4000 అందజేసేలా పథకం విధివిధానాలు నిర్ణయించి అదే ఏడాది ఖరీఫ్ నుంచి అమలుకు శ్రీకారం చుట్టింది. అయితే ఆ తర్వాత మరో రెండు వేలు పెంచి మొత్తం 10వేలు రైతుబంధు కింద అందజేస్తూ వచ్చింది. అప్పటివరకూ రైతులకు వ్యవసాయశాఖ ద్వారా ప్రతి సీజన్‌లో ఇస్తున్న విత్తనాల సబ్సిడీలను పూర్తిగా రద్దు చేసింది.

అంతే కాకుండా పంటల సాగులో యాంత్రీకరణ సబ్సీడీలను కూడా నిలిపివేసింది. ఇన్‌పుట్ సబ్సిడీలకు మంగళం పాడింది. పిడిగుకు.. పిండానికి ఒకటే మంత్రం అన్న రీతిలో ప్రభుత్వం ద్వారా సబ్సిడీల కింద అప్పటివరకూ అందుతున్న నిధులను నిలిపివేసి అన్ని కలిపి రైతుబంధు రూపంలోకి మార్చి ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి చిట్టచివరగా గత ఏడాది రబీ సీజన్‌లో 70లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.7700కోట్లు జమ అయ్యాయి. ఇక అంతటితో రైతుబంధు పధకం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం చిత్రపటం నుంచి కనుమరుగైపోయింది.

రైతుభరోసా రబీకైనా సాధ్యమేనా!

రాష్ట్రంలో రైతుభరోసా పథకం ఈ రబీనుంచైనా అమలుకు ఖజానా అనుకూలిస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.పంట రుణాల మాఫీ నుంచి విజయవంతంగా బయట పడగలిగితే చాలన్న రీతిలో ఆర్దిక శాఖ కసర్తులు చేస్తోంది. మరో వైపు రైతులు ఈ రబీ నుంచి రైతుభరోసా పథకం అమలు కాకపోతుందా అని అశపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ పథకం అమలును ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఎమాత్రం కాస్త ఊపిరి సలిపేంత ఆర్ధిక వెసులు బాటు కలిగినా ఇక రైతుభరోసా పథకం అమలు చేసి తీరాల్సిందే అన్నంత పట్టుదలగా ఉన్నారు.ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులు .వాటి అమలును సమన్వయం చేసుకూంటూ వస్తున్న ముఖ్యమంత్రి కొత్తగా ఈ రబీనుంచి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. సన్నరకాల ధాన్యం సాగును ప్రోత్సహిస్తూ ధాన్యానికి ప్రత్యేక బోనస్ ప్రకటించారు.

రాష్ట్రంలో 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ ప్రణాళిక సిద్దం చేసిందని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో 40లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నరకం ధాన్యం కొనగోలు చేస్తొంది. ఇందుకోసం ప్రభుత్వం క్వింటాలకు రూ.500బోనస్ చెల్లించనుంది. ప్రభుత్వ ఖజానాపైన వ్యవసాయరంగం ఖాతాలనే బోనస్ కింద రూ.2000కోట్లు అదనపు భారం పడనుంది .సెప్టెంబర్ తొలివారం లో కురిసిన అతిభారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 79574ఎకరాల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన 79216మంది రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు నెల రోజుల్లోనే పంటనష్టం పరిహారం కింద ఎకరానికి రూ.10వేలుచొప్పున నిధులు రైతుల ఖాతాలకు జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇన్నేసి ఆర్దిక వత్తిళ్లను భరిస్తూనే రైతుభరోసా పథకం అమలుకు విధి విధానాలపై కసరత్తులు జరుగుతున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.వనరుల సమీకరణ సాధ్యపడితే ఈ రబీ నుంచే రైతులకు పంటలసాగు పెట్టుబడి సాయం కూడా అందే అవకాశాలు సాకారమవుతాయని ఆర్ధికశాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క కూడా భరోసా ఇస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News