Wednesday, October 16, 2024

ఇకో-టూరిజమ్ అభివృద్ధికి శరవేగంగా అడుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పర్యాటకం (ఇకో టూరిజం) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఉన్న సుందర, రమణీయ ప్రదేశాలు, ఆధ్మాత్మిక కేంద్రాలతో కలిసి ఇకో టూరిజం అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళికను అమలు చేయబోతోంది. ఇందుకోసం అటవీశాఖ మంత్రి ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ కమిటీ ఒడిశా, కర్ణాటక, ఇంకా ఇతర రాష్ట్రాల్లో పర్యటించి పర్యావరణ పర్యాటకంలో ఆయా ప్రాంతాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయనుంది. అధ్యయనం అనంతరం ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఇకో-టూరిజం పాలసీని రూపొందించేందుకు పటిష్ట ప్రణాళికను రూపొందించనుంది.

అటవీ, పర్యావరణ శాఖకి ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.1,064 కోట్ల కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడు నెలల్లోగా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, అటవీ చట్టంలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని డ్రాఫ్ట్ ఎకోటూరిజం పాలసీ కోసం కమిటీ సిఫార్సులను అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులకు ప్రభుత్వం తాజాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కమిటీ కనీసం మూడు సమావేశాలు నిర్వహించడం ద్వారా మూడు నెలల్లోగా పర్యావరణ పర్యాటక విధానానికి సంబంధించిన ముసాయిదా (డ్రాఫ్ట్) కోసం కమిటీ సిఫార్సులను అందించాల్సి ఉంటుంది. తెలంగాణా రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది. ఎన్నో సుందర జలపాతాలు, వన్య జీవులు, డ్యాంలు (ఆనకట్టలు), జలాశయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని 12 సర్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్లను ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించుకుంటూ, వాటిని మరింత విస్తృతపరచి, అటవీ వైశాల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో-టూరిజమ్‌ను పెంపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

A festival for 'Tourism'

దీనిలో భాగంగా పటిష్టమైన ఇకో-టూరిజం విధానాన్ని రూపొందించడానికి రాష్ట్రంలోని ఏడు అటవీ ప్రాంతాలు -అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్ -అనంతగిరి సర్క్యూట్, ఖమ్మంలోని కనకగిరి, అదిలాబాద్‌లోని కుంటాల జలపాతం, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం సర్క్యూట్‌లను గుర్తించారు. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు పెద్ద ఎత్తున సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని అడవులలోని పర్యావరణ పర్యాటక అవకాశాలను అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి, పర్యావరణ పర్యాటక విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం ఇప్పటికే నియమించిన కమిటీ పని చేస్తోంది.

Telangana touism developed a lot in ten years

ఈ కమిటీలో అటవీ, పర్యావరణ మంత్రి అధ్యక్షతన, కమిటీ సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, గిరిజన సంక్షేమ కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్, భారతీయ పరిశ్రమల శాఖ సమాఖ్య ప్రతినిధి, జూ పార్క్ డైరెక్టర్, వరల్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ప్రతినిధి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి, సభ్య కార్యదర్శిగా టిఎస్‌ఎఫ్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇకోటూరిజం) ఉంటారు. ఇంకా ఈ కమిటీలో హాస్పిటాలిటీ, అడ్వెంచర్ టూరిజం పరిశ్రమలు, ఎన్జీఓలు లేదా రాష్ట్రంలోని పులుల రిజర్వు విభాగంలోని అటవీ అధికారుల నుండి మరో నలుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే అవకాశం ఉంది.

ఇకో టూరిజంలో భాగంగా చేపట్టే చర్యలు

కమిటీ అందజేసిన ముసాయిదా నివేదిక అనంతరం ప్రభుత్వం ఇకో టూరిజం అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగా క్షేత్రస్థాయిలో కొన్ని చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. అటవీ ప్రాంతాల వెలుపల ఉన్న ప్రభుత్వ భూమి, అటవీ భూములలోని ప్రాంతాలు, పర్యావరణ, సున్నిత మండలాల్లోని ప్రైవేట్ భూములను పర్యాటక ప్రయోజనాల కోసం గుర్తించడం, అటవీ ప్రాంతాల పరిధిలో ఉండే ప్రతిపాదిత స్థలాలపై టిఎస్‌ఎఫ్‌డిసి, అటవీ శాఖ పాత్రలను నిర్వచించడం జరుగుతుంది. అలాగే పెట్టుబడులు, స్పాన్సర్షిప్లను ఆకర్షించడానికి వ్యాపార నమూనాలను సూచించడం, ప్రైవేట్ వ్యవస్థాపకతను పెంపొందించడం, రక్షిత ప్రాంతాలలో వన్యప్రాణి సఫారీలు, ఇతర ప్రకృతి -సాహస-పర్యాటక ప్రణాళికల అవకాశాన్ని గుర్తించడం వంటి అంశాలపై కసరత్తు చేపడుతుంది.

స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం, స్థానిక గిరిజన సంఘాల జీవనోపాధి అభివృద్ధిని మెరుగుపరచడానికి వ్యూహాలను రూపొందించడం, రాష్ట్రంలో అడవులు, జీవవైవిధ్యం పెంపొందించడానికి స్థిరమైన పర్యావరణ పర్యాటకాన్ని నిర్ధారించడానికి చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఉన్న జాతీయ పార్కులు, జూలాజికల్ పార్కులను మెరుగుపరచడానికి వ్యూహాలతో ముందుకు రావడం తద్వారా పర్యాటకానికి కొత్తరూపురేఖలు తీసుకువచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, రవాణాశాఖలతో కూడిన టూరిజం సర్కూట్ల సింక్రొనైజేషన్ కోసం సలహాలు అందించడం వంటి అంశాలను పరిశీలిస్తుంది. అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్-కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News