ప్రైవేటు ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌కు కృషి
దివ్యాంగుల జాబ్ పోర్టల్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క –
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రభుత్వంలో చాల కాలంగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాల కోసం యూత్ ఫర్ జాబ్స్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రత్యేకంగా తయారు చేసిన వికలాంగుల జాబ్ పోర్టల్‌ను మంత్రి సీతక్క సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఒక శాతం రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు వివరించారు. ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. దివ్యాంగులు కంపెనీల చుట్టూ ఇకపై తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పోర్టల్ ద్వారా మహిళా శిశు సంక్షేమ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌లో పది మందికి నియామక పత్రాలను మంత్రి అందజేశారు. దివ్యాంగులు జాబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల్లోనూ దివ్యాంగులకు రిజర్వేషన్ పాటిస్తామని మంత్రి చెప్పారు. దివ్యాంగుల పరికరాల కోసం బడ్జెట్లో రూ.50 కోట్లు వెచ్చించినట్లు వివరించారు. ‘దివ్యాంగులకు విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమాల్లో చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. దివ్యాంగులకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.50 కోట్లను ఖర్చు చేస్తున్నామని అన్నారు.
ఇతరులతో పోటీ పడేందుకు దివ్యాంగులకు ఎన్నో అవరోధాలు ఉంటాయని, అందువల్ల వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ రూపొందించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మబంధువు సీతక్క అని కొనియాడారు. ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ దివ్యాంగుల పాలిట వరమని అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది వికలాంగులున్నారో ఆ డేటా తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి అర్హతలు, ఉపాధి అవకాశాలు ఏమిటనే వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల పరికరాల కోసం రూ.50 కోట్లు ప్రజా ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వీరయ్య, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జేడీ శైలజ, పెద్ద సంఖ్యలో హాజరైన వికలాంగ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ 25,-26 తేదీల్లో ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర 4వ మహాసభలు
ఈ నెల 25-, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని గ్రామీణభివృద్ధి, పంచాయతీ రాజ్, మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో ఎన్‌పిఆర్‌డి తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల గోడపత్రికను టివిసిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ, ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె వెంకట్, యం అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. బిసి కులగననతో పాటు వికలాంగుల జనాభా లెక్కలు సేకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు వికలాంగులకు ఇంటి వద్దకే చేరే విదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్య, ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేస్తున్నామని అన్నారు. 21 రకాల వికలాంగులు ఐక్యంగా ఉండాలని, అప్పుడే వికలాంగుల సమస్యలు పరిష్కారం అవుతాయాని అన్నారు. వికలాంగుల కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు నిధులు కేటాయించామని అన్నారు. వికలాంగులకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి పంపిణి చేస్తామని అన్నారు. నిరుద్యోగ వికలాంగులకు ఉపాధి చూపడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.
ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ అక్టోబర్ 25-, 26తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర 4వ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాసభలను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, టివిసిసి చైర్మన్ ముత్తినేని వీరయ్య హాజరు అవుతున్నారని తెలిపారు. ఈ మహాసభలకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు. మహాసభల్లో నిరుద్యోగ సమస్య, రిజర్వేషన్స్ అమలు, పెన్షన్ పెంపు, స్వయం ఉపాధి, చట్టాల అమలు, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల్లో రాష్ట్రంలో వికలాంగుల సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
……………………