Wednesday, October 16, 2024

ఖజానాకు దసరా కిక్కు

- Advertisement -
- Advertisement -

ఈసారి పెరిగిన మద్యం విక్రయాలు

11 రోజుల్లో రూ.1057కోట్ల మద్యం విక్రయాలు
గత ఏడాదితో పోల్చితే రూ.152కోట్ల అదనపు అమ్మకాలు
10.44లక్షల కేసుల లిక్కర్, 17.52లక్షల కేసుల బీర్ల
విక్రయం హైదరాబాద్‌లో తగ్గిన అమ్మకాలు
మద్యం విక్రయాల్లో రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు టాప్
10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీర్ల విక్రయం

మనతెలంగాణ/హైదరాబాద్:  దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే గత సంవత్సరం దసరా కన్నా ఈ సంవత్సరం దసరాకు రూ.152 కోట్ల ఆదాయం పెరగడం విశేషం. పండుగ జరిగిన పదకొండు రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా బార్లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ ఈ విక్రయాలు భారీగా పెరగడం విశేషం. దీంతో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. పండుగ చివరి రోజైన శని, ఆదివారాల్లో అమ్మకాలు రెట్టింపు జరిగినట్లు ఆబ్కారీ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిఏటా దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగా జరుగుతుండగా ఈసారి కూడా అదే అంచనాతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా భారీగా మద్యం నిల్వలను ఆయా షాపుల్లో అందుబాటులో ఉంచింది.

రంగారెడ్డి జిల్లాదే అగ్రస్థానం

రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా పండుగను పురస్కరించుకొని అన్నిచోట్ల ఈ విక్రయాలు భారీగా జరిగాయి. గత నెల సెప్టెంబర్ 30వ తేదీ వరకు రూ.2,838.92 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండుగ చివరి మూడు రోజులు ఎక్సైజ్ శాఖ అనుకున్న విధంగా భారీగా మద్యం అమ్ముడుపోగా అందులో మద్యం, బీర్లను కొనుగోళ్లు చేయడానికి మద్యం ప్రియులు పోటీ పడ్డారు.

ఒక్కరోజే రూ.205 కోట్ల మద్యం లిప్ట్

దసరాకు ముందు రోజు శుక్రవారం (ఈనెల 11వ తేదీన) రూ.205 కోట్ల మద్యాన్ని ఎక్సైజ్ డిపోల నుంచి వైన్ షాపులకు, బార్లకు, క్లబ్‌లకు, పబ్‌లకు సరఫరా చేశారు. ఇక ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు 11 రోజుల్లో రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడయ్యింది. అందులో ఈ నెల 10వ తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్, 14.53 లక్షల కేసుల బీరు అమ్ముడు కాగా, అయితే ఒక్క శుక్రవారం రోజునే ఎక్సైజ్ డిపోల నుంచి వైన్ షాపులకు రూ.205.42 కోట్ల విలువైన 2.08 లక్షల కేసుల లిక్కర్, 3.07 లక్షల కేసుల బీర్‌లను సరఫరా చేశారు.

అలాగే శని, ఆదివారాల్లో కూడా మద్యం రెట్టింపు స్థాయిలో అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ గణాంకాలు తెలిపాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సుమారుగా రూ.820 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, అక్టోబర్ 5వ తేదీన రూ.127 కోట్ల 18 లక్షలు, 6 వ తేదీన ఆదివారం ఎక్సైజ్ డిపోలకు సెలవు ప్రకటించారు. 7వ తేదీన , రూ.129 కోట్ల 39 లక్షలు, 8వ తేదీన రూ.102 కోట్ల 93 లక్షలు, 9వ తేదీన రూ.120 కోట్ల 16 లక్షలు, 10వ తేదీన రూ.139 కోట్ల 16 లక్షలు, 11వ తేదీన రూ.205 కోట్లకు పైగా మద్యాన్ని ఎక్సైజ్ శాఖ విక్రయించింది. రోజుకు కోటి పైగా మద్యం సేల్ అయ్యిందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

గ్రేటర్‌లో తగ్గిన మద్యం విక్రయాలు

హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సరూర్ నగర్, శంషాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈసారి మద్యం విక్రయాలు తగ్గాయని, గతేడాదితో పోలిస్తే మద్యం సేల్ పడిపోయిందిన ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో 674 మద్యం దుకాణాలు ఉండగా, గతేడాది రూ.317.23 కోట్లు అమ్మకాలు జరగ్గా, ప్రస్తుతం ఈసారి మాత్రం రూ.312 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

డిపోల వారీగా విక్రయాల వివరాలు

ఈనెల 01వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వివిధ డిపోల్లో జరిగిన ఎక్సైజ్ మద్యం అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి. జనగాం డిపోలో 2023 సంవత్సరంలో రూ.9.35 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.17.74 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. వరంగల్ అర్భన్ 2023 సంవత్సరంలో రూ.23.32 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.36.78 కోట్లు, వరంగల్ రూరల్‌లో 2023 సంవత్సరంలో రూ.12 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.17.98 కోట్లు, జయశంకర్ భూపాలపల్లిలో 2023 సంవత్సరంలో రూ.9.42 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.12.26 కోట్లు, సిద్ధిపేటలో 2023 సంవత్సరంలో రూ.23.19 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.29.99 కోట్లు, కరీంనగర్‌లో 2023 సంవత్సరంలో రూ.21.59 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.27.42 కోట్లు, జగిత్యాలలో 2023 సంవత్సరంలో రూ.15.47 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.19.57 కోట్లు, రాజన్న సిరిసిల్లలో 2023 సంవత్సరంలో రూ.10.24 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.12.87 కోట్లు, పెద్దపల్లిలో 2023 సంవత్సరంలో రూ.16.38 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.20.29 కోట్లు, యాదాద్రి భువనగిరిలో 2023 సంవత్సరంలో రూ.21.93కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.25.53 కోట్లు, నల్లగొండలో 2023 సంవత్సరంలో రూ40.12 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.46.60 కోట్లు, మెదక్‌లో 2023 సంవత్సరంలో రూ.12.20 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.13.98 కోట్లు, నాగర్‌కర్నూల్‌లో 2023 సంవత్సరంలో రూ.15.99 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.17.94 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

హైదరాబాద్‌లో గతం కన్నా ఈసారి రూ.7 కోట్లు తక్కువ

ఇక మహబూబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.13.08 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.14.64 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.05.03 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.5.60 కోట్లు, వికారాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.15.98 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.17.25 కోట్లు, మేడ్చల్‌లో 2023 సంవత్సరంలో రూ.52.69 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.55.53 కోట్లు, సరూర్‌నగర్‌లో 2023 సంవత్సరంలో రూ.57.73 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.60.55 కోట్లు, మహబూబ్‌నగర్‌లో 2023 సంవత్సరంలో రూ.25.84 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.26.99 కోట్లు, సంగారెడ్డిలో 2023 సంవత్సరంలో రూ.35.73 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.36.22 కోట్లు, సూర్యాపేటలో 2023 సంవత్సరంలో రూ.27.36 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.27.70 కోట్లు, మల్కాజిగిరిలో 2023 సంవత్సరంలో రూ.45.94 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.45.50 కోట్లు, కామారెడ్డిలో 2023 సంవత్సరంలో రూ.13.10 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.12.88 కోట్లు, నిజామాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.24.56 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.23.96 కోట్లు, శంషాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.61.31 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.59.64 కోట్లు, మంచిర్యాలలో 2023 సంవత్సరంలో రూ.20.79 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.20.10 కోట్లు, నిర్మల్‌లో 2023 సంవత్సరంలో రూ.11.41 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.11.01 కోట్లు, సికింద్రాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.38.02 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.35.87 కోట్లు, వనపర్తిలో 2023 సంవత్సరంలో రూ.12.67 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.11.25 కోట్లు, ఆదిలాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.11.06 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.9.52 కోట్లు, జోగులాంభ గద్వాల్‌లో 2023 సంవత్సరంలో రూ.14.16 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.12.04 కోట్లు, హైదరాబాద్‌లో 2023 సంవత్సరంలో రూ.45.56 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.38.50 కోట్లు, ఖమ్మంలో 2023 సంవత్సరంలో రూ.26.62 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.21.51 కోట్లు, కొత్తగూడెంలో 2023 సంవత్సరంలో రూ.10.14 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, ఈ సంవత్సరం రూ.7.19 కోట్ల విక్రయాలు జరిగినట్టు ఎక్పైజ్ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News