Friday, December 20, 2024

ప్రొ. సాయిబాబా మృతి మౌలిక ప్రశ్నలు

- Advertisement -
- Advertisement -

కోనసీమలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా పరిచితులైన గోకరకొండ నాగసాయి బాబా (57) పదేళ్ల జైలు జీవితం నుండి నిర్దోషిగా తిరిగి వచ్చిన కొద్ది రోజులకే గత శనివారం మృతి చెందటంను పలువురు ‘వ్యవస్థీకృత’ హత్యగా అభివర్ణిస్తుండగా, మరికొందరు తాను నమ్మిన తీవ్రవాద ఉద్యమాలలో ఆధిపత్య ధోరణులకు బలయ్యారనే వాదనలను సైతం లేవనెత్తుతున్నారు. ఆయన అరెస్ట్, విడుదల అంతా చట్టబద్ధంగానే కనిపిస్తున్నప్పటికీ మన ‘చట్టబద్ధ పాలన’లో నెలకొన్న వ్యవస్థీకృత లోపల కారణంగానే ఆయన అకాల మరణం చెందారని చెప్పక తప్పదు. అంతకు ముందు ఫాదర్ స్టాన్ స్వామి (1937- 2021) 80 సంవత్సరాల వయస్సులో, ఎటువంటి విచారణ లేకుండా 270 రోజులు నిర్బంధంలో గడిపిన తరువాత జైలులో మరణించారు.

వీరిద్దరూ నిరంకుశ ధోరణులకు స్వతంత్ర భారతదేశంలో వేలాది మంది మాదిరిగా బాధితులే. చట్టబద్ధమైన వ్యవస్థీకృత దౌర్జన్యాన్ని ఎదుర్కొన్నారు. నిర్దిష్టమైన నేరారోపణలు లేకుండానే ప్రభుత్వ దమననీతికి బలికావాల్సి వచ్చింది. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టుకు దారితీసిన కారణాలు అసమంజసమైనవని స్వయంగా హైకోర్టు కొట్టిపారవేసింది. అందుకు నిర్దుష్టంగా ఎటువంటి సాక్ష్యాధారాలను చూపించలేకపోయారని కూడా స్పష్టం చేసింది. ఈ చట్టం క్రింద అరెస్టు చేసేందుకు ఎటువంటి ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఉగ్రవాద ఘటనలతో ఆయనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధం ఉన్నట్లు, మద్దతు ఇచ్చినట్టు ఎటువంటి ఆధారాలు ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది తెలిపింది. ఆయన రాజకీయ అభిప్రాయాలు, ఆయన ఉద్యమాల నేపథ్యం వంటి అంశాలను అటు ఉంచితే, ప్రధానంగా ఆయన అనారోగ్య కారణంగా చనిపోయారని స్పష్టం అవుతుంది. అందుకు పదేళ్ళపాటు తగిన వైద్య సహాయం లేకుండా ఆయనను నిర్బంధించటమే అని కూడా వెల్లడి అవుతుంది. అందుకు ఎవ్వరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే.

అసలే ఐదేళ్ల వయస్సులో పోలియోకు గురై, 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. నిజంగా ఆయన నేరాలు చేసి, ఆరెస్ట్‌కు గురయినా ఆరోగ్యం గురించి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాగలదు. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోగా, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో నిర్దోషిగా విడుదలైన కొద్దీ రోజులకే మృతి చెందారు. ఆయన జైలులో ఉన్న సమయం లో తీవ్ర ఆరోగ్య పరిస్థితులతో బాధపడ్డారు. ఈ ఆరోగ్య పరిస్థితులలో పోలియో సంబంధిత వైకల్యాలు, గుండె పరిస్థితి, మెదడు తిత్తి, రక్తపోటు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. జైలులో ఉండగా, ఓ కరడు గట్టిన నేరస్థుడో, ఎందరినో హతమార్చిన ఉగ్రవాదో అన్నట్లు కిటికీలు లేని సెల్‌లో ఏకాంత నిర్బంధం లో ఉంచారు. నిరంతరం సిసిటివి నిఘాలో ఉంచారు. జైలులో ఉన్నప్పుడు జనవరి 2021, ఫిబ్రవరి 2022లలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. దానితో అంతంత మాత్రంగా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడానికి దారితీసింది.

తన భార్యకు రాసిన లేఖలో తనకు తక్షణ వైద్యం అందించాలని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యులు సిఫార్సు చేసినప్పటికీ తనకు ఎలాంటి చికిత్స అందలేదని సాయిబాబా జైలులో తనకు ఎదురైన దుష్ప్రవర్తన గురించి చెప్పారు. ఆయనకు తగు వైద్య సదుపాయాలు అందించాలని కోరుతూ ఆయన, ఆయన కుటుంబ సభ్యులు వ్రాసిన లేఖలకు, విజ్ఞప్తులకు న్యాయస్థానాలు గాని, జైలు అధికారులు గాని, ప్రభుత్వం గాని స్పందించలేదు. మానవ హక్కుల రక్షకులపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గతంలో వైద్య కారణాలపై ఆయనను విడుదల చేయాలని భారత ప్రభుత్వంకు పిలుపునిచ్చారు, అయినా స్పందన లేదు. బెయిల్ అనేది సాధారణం, జైలు మినహాయింపు అని భారత అత్యున్నత న్యాయస్థానం పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో అత్యున్నత న్యాయస్థానంతో సహా దేశంలో న్యాయస్థానాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

అనారోగ్య కారణంగా 45 రోజుల పాటు బెయిల్ కావాలని కోరుతూ 28 జులై 2020న సాయిబాబా దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు తిరస్కరించింది. జైలులో ఉన్న సమయంలో ఆరోగ్య సంరక్షణ నిరాకరించిన కారణంగానే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురయి, విడుదలైన తర్వాత కూడా కోలుకోలేకపోయారని చెప్పవచ్చు.సాయిబాబా అకాల మరణానికి తప్పుడు జైలుశిక్ష పాక్షికంగానైనా కారణమని ఫ్రంట్ లైన్ డిఫెండర్స్ స్పష్టం చేసింది. యుఎపిఎ వంటి క్రూరమైన తీవ్రవాద వ్యతిరేక చట్టాలను సవరించాలని, మానవ హక్కుల పరిరక్షకుల చట్టబద్ధమైన పని నేరంగా పరిగణించబడకుండా చూసుకోవాలని అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల ఉద్యమాలు ఎంతగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

అయితే, ఆయన జైలు జీవితం, జైలులో తగు వైద్యసహాయం నిరాకరించడం అంతా బిజెపి హయాంలో జరిగింది. అంటే, రాజకీయ పార్టీలతో, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా అకారణంగా అరెస్టులు జరపడం, జైలులో ఉన్నవారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంకు ప్రధాన కారణం మన వ్యవస్థీకృత లోపాలే అని చెప్పాల్సి ఉంటుంది.ప్రభుత్వానికి కనికరంలేని ఉదాసీనత, అణచివేత ఫలితం’ అని ప్రముఖ మానవ హక్కుల ఉద్యమనేత, పీపుల్స్ వాచ్ డైరెక్టర్ హేన్రి తపంగె స్పష్టం చేశారు. జైలులో ఉండగా తన భార్య, కుమార్తెలతో సాయిబాబా తెలుగులో మాట్లాడేందుకు కూడా ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ రాని భార్యతో సైగల ద్వారానే మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఆయనను అరెస్ట్ చేయడంకన్నా ఆ తర్వాత వ్యవహరించిన తీరు మరింత దుర్మార్గంగా, కర్కశంగా ఉందని చెప్పవచ్చు. అందుకు మన వ్యవస్థలు సిగ్గుతో తలవంచుకోవలసిందే. అందుకనే సాయిబాబా మరణం మన వ్యవస్థల అమానుష దివాలాకోరు వైనాన్ని బహిర్గతం చేస్తుంది.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News