Wednesday, November 27, 2024

అధ్యక్షుని కోసం శ్వేతసౌధం నిరీక్షణ

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే నెల 5వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతీ లీప్ సంవత్సరానికి ఒకసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకమైన రాజకీయ వాతావరణంలో జరుగుతున్నాయి. గెలుపొందిన అభ్యర్ధి 2025 జనవరి 20వ తేదీన అగ్రరాజ్యాధిపత్యం చేపట్టి శ్వేతసౌధంలోకి అడుగుపెడతారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీగా పోటీ జరగబోతున్నది.

34 కోట్ల జనాభా కలిగి, 50 రాష్ట్రాల సమాహారంగా భాసిల్లే అమెరికా ప్రపంచంలో అత్యధిక జనాభా గల మూడవ దేశం. ఆర్థిక, ఆయుధ సంపత్తిలో అగ్రదేశాల్లో అగ్రస్థానం కలిగి, ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాను పాలించడం కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అందరూ అనుకున్నట్టుగా అమెరికా శ్వేతసౌధం పూలపాన్పు కాదు. అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచ ప్రజల దృష్టిలో అధినాయకుడే కావచ్చు. బాధ్యతల విషయంలో కూడా అమెరికా అధ్యక్షుని భుజస్కంధాలపై మోయలేని భారం ఉంటుదన్న విషయం మరువరాదు. పెద్దన్నగా మనుగడ సాగించాలంటే ప్రపంచంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వేగంగా స్పందించడం, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అప్రమత్తం కావడం, మాటల్లో కాకుండా చేతల్లో శౌర్యం ప్రదర్శించడం వంటి లక్షణాలు నిండుగా ఉండాలి.

ప్రపంచ దేశాలన్నీ కేవలం తమ ప్రయోజనాల కోసమే పాటుపడుతూ, తమ దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుంటూ ఇతర దేశాలతో దైపాక్షిక, వాణిజ్య సంబంధాలను కలిగి ఉండడం వర్తమాన ప్రపంచంలో జరుగుతున్న తతంగం. గతంలో మాదిరిగా ఏదో ఒక దేశంతో అంటకాగే పరిస్థితులు ప్రస్తుతం లేవు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ప్రపంచ రాజకీయాలు మారిపోయిన నేపథ్యంలో పలు దేశాలు ఏ దేశానికీ పూర్తి స్థాయిలో మిత్రదేశాలుగా ఉండలేక, తటస్థ వైఖరి అనుసరిస్తున్నాయి. అయితే అగ్రరాజ్యాల ధోరణి ఇందుకు భిన్నం. అందునా అమెరికా వంటి అగ్రరాజ్యం ప్రపంచానికి తన ప్రత్యేకత ప్రదర్శించాలి. అగ్రదేశమన్న అహాన్ని, ఆధిపత్యాన్ని విడిచిపెట్టకుండా ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయిలో ఉండాలనే తాపత్రయమే అమెరికా పాలకుల నరనరాన జీర్ణించుకుపోయింది. ఆధిపత్య భావజాలమే అమెరికా అస్తిత్వానికి ఇంధనంగా మారింది. ఇందుకోసమే ప్రపంచంలో ఏ చిన్న సంఘటన జరిగినా అమెరికా జోక్యం చేసుకుంటూ తన ఆధిపత్యానికి ఎదురుతిరిగిన దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ప్రపంచంలో తనకు తిరుగులేదని భావిస్తున్నది.

ఈ నేపథ్యంలో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎలక్ట్రోరల్ కాలేజ్ ద్వారా అమెరికా అధ్యక్షుని ఎంపిక జరుగుతుంది. ఎప్పుడూ ఒక వ్యక్తే దేశాన్ని పాలించకూడదన్న ప్రజాస్వామ్య స్ఫూర్తితో 70 సంవత్సరాల క్రితమే అమెరికా రాజ్యాంగ సవరణలో చేసిన మార్పుల వలన అమెరికా అధ్యక్ష పదవిని కేవలం రెండు పర్యాయాలకు మాత్రమే కుదించారు. 4 సంవత్సరాల కాలపరిమితితో కూడిన అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నిక ప్రతి లీప్ సంవత్సరం నవంబర్‌లో జరుగుతాయి. ఆ మరుసటి సంవత్సరం జనవరిలో అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్, డోనాల్డ్ ట్రంప్‌ల గుణగుణాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది.

రెండు పర్యాయాలు అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా పాలన సాగిస్తున్న 82 సంవత్సరాల జో బైడెన్ రాజకీయాల్లో కురువృద్ధుడు. నవంబర్‌లో జరిగే ఎన్నికల కోసం డెమొక్రాటిక్ అభ్యర్థిగా రంగంలోకి దిగి, మరో పర్యాయం అమెరికా శ్వేతసౌధాన్ని శాసించాలనుకున్న జో బైడెన్ వయసు పైబడి, మాటతడపడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా అమెరికా అధ్యక్ష పదవి రేసు నుండి తప్పుకోవడంతో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడి మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడుతున్నారు. 34 కోట్ల జనాభాతో 50 రాష్ట్రాలతో ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన అమెరికాలో అధ్యక్ష పదవి అందుకోవడం ఆషామాషీ కాదు. 2016 ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, 2020 ఎన్నికల్లో పరాజితుడైన డోనాల్డ్ ట్రంప్ 78 సంవత్సరాల వృద్ధాప్యంలో 59 సంవత్సరాల మహిళ కమలా హ్యారిస్‌తో పోటీ పడుతున్నారు.

కమలా హ్యారిస్ భారతీయ మూలాలున్న సౌత్ ఏషియన్ మహిళ కావడం వలన అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ఓట్లు ఆమెకే దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికల్లో అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ ఈసారి జరిగే ఎన్నికల్లో గెలిస్తే మొదటి అమెరికా మహిళా అధ్యక్షురాలిగా అరుదైన రికార్డును స్వంతం చేసుకునే అవకాశముంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా పని చేయడం, మహిళల స్వేచ్ఛ కోసం, వారి హక్కుల కోసం పోరాటం చేయడం, గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా పోరాడడం, ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి కోసం ఉద్యమించడం, మిలియన్ల సంఖ్యలో మహిళల జీవితాలను ప్రభావితం చేసి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం వంటి అంశాలు కమలా హ్యారిస్ విజయానికి దోహదం చేయవచ్చు.

జాత్యహంకార భావాలు అధికంగా ఉన్న దేశంలో, శ్వేత జాతీయులు ఆమెను సమర్ధిస్తారా? ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు అమెరికా అధ్యక్ష పదవి దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక నల్లజాతి స్త్రీని అమెరికా ప్రజలు గౌరవించి, అధ్యక్ష పీఠం అప్పగిస్తారా? అనే సంశయం కూడా పలువురిలో వ్యక్తమవుతున్నది. అయితే ఆమెకు ప్రత్యర్ధి జగమెరిగిన జగమొండి డోనాల్డ్ ట్రంప్ కావడం కమలా హ్యారిస్ కు కలిసి వచ్చే అంశం కావచ్చు. వలసవాదులకు, నల్లజాతి వ్యతిరేకిగా ముద్రపడ్డ ట్రంప్ గత పాలనా కాలంలో ప్రదర్శించిన వైఖరిని ప్రజలు మరచిపోలేదు. మెక్సికో గోడ విషయంలోను, విదేశీయులకు వీసాల మంజూరు విషయంలోను ట్రంప్ చర్యలు అతని విజయావకాశాలను తగ్గించే అవకాశముంది.

‘లాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్’ గా పేరొందిన అమెరికాలో ట్రంప్ గత పాలనలో వలసవాదుల పట్ల, విదేశీయులకు వీసాల మంజూరులో వ్యవహరించిన తీరుపట్ల అనేక మంది ప్రతిభావంతులు అమెరికా చదువులకు, ఉద్యోగాలకు దూరమైనారు. ట్రంప్ ఒక వివాదాస్పద వ్యక్తి. ట్రంప్ వాచాలత్వం, తెంపరితనం, నియంతృత్వం, జాతి వివక్ష అతని గెలుపు అవకాశాలకు గండికొట్టవచ్చు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా హుందాగా తప్పుకోవడం మాని, హింసాత్మక చర్యలకు పాల్పడిన విషయం ప్రజల స్మృతి పథం నుండి చెరగలేదు. అప్పట్లో జో బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించడానికి సమావేశమైన కాంగ్రెస్ ఉభయ సభలు భయంతో దద్దరిల్లిపోయాయి. ట్రంప్ వర్గీయులు అమెరికా క్యాపిటల్ భవనంపై హింసాత్మక దాడులకు పాల్పడడం వలన పలువురు మరణించిన సంఘటన అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది.

ట్రంప్ దుందుడుకుతనం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి మంచిదికాదు. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలని సూచించడం ట్రంప్ ఉన్మాదానికి పరాకాష్ఠ. తాను గెలిస్తే ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తానని ప్రకటించడం సముచితమే. ఇదే సందర్భంలో రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి స్వస్తి చెప్పడానికి ప్రయత్నించాలి. ఉత్తర కొరియా, ఇరాన్, చైనా విషయంలో ట్రంప్ వైఖరి కఠినం గా నే ఉండవచ్చు. చైనా పొడగిట్టని ట్రంప్ వలన భారత్ కు మేలు చేకూరవచ్చు. చైనాకు వత్తాసు పలుకుతున్న పాక్ కు కూడా ట్రంప్ వలన ఇబ్బందులు తప్పకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్‌కున్న రహస్య స్నేహం వలన ప్రపంచానికి మేలు జరగవచ్చు. అయితే ట్రంప్‌లో నెగిటివ్ షేడ్స్ ఆయన్ని మరోమారు అధికారంలోకి తీసుకురావడానికి అడ్డుగోడలు కావచ్చు.

ట్రంప్ గత పాలనలో అమెరికా ప్రజల్లో శ్వేతజాతీయులు, నల్లజాతీయులనే భేదభావం పెరిగింది. జాత్యహంకార బీజాలు నాటిన ట్రంప్ వలన అమెరికన్లలో వ్యతిరేక ధోరణి ప్రబలింది. పార్టీల పరంగా, జాతుల పరంగా దేశాన్ని రెండుగా చీల్చడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు అతన్ని రెండవసారి అధ్యక్ష పీఠానికి దూరం చేశాయి. అయినా తన అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకోవడానికి ట్రంప్ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ పై ఇటీవల జరిగిన హత్యా ప్రయత్నాలు అతనిపై సానుభూతి పవనాలు వీచేలా చేస్తాయనుకోవడం పొరపాటుగానే భావించాలి. హుందాతనం, సమస్యల పరిష్కారంలో నేర్పరితనం వంటి అంశాలకే పరిణితి చెందిన అమెరికా ప్రజాస్వామ్యం విలువనిస్తుంది. ఇలాంటి లక్షణాలేవీ ట్రంప్‌లో మచ్చుకైనా లేవు. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో శ్వేతసౌధం ఎవరి స్వంత మవుతుందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడక తప్పదు.

సుంకవల్లి సత్తిరాజు
9704903463

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News