Friday, January 3, 2025

గడ్డకట్టే చలిలో 17 గంటల నరకయాతన !

- Advertisement -
- Advertisement -

ఎముకల కొరికే చలి..శరీరం గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత..సముద్ర మట్టానికి 12,000 అడుగుల ఎత్తయిన నిర్జన అటవీ ప్రాంతం. తినడానికి తిండి లేదు..సాయం కోసం 17 గంటలపాటు నిరీక్షణ.ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి) రాజీవ్ కుమార్‌కు ఎదురైన ఈ వింత అనుభవం కలకాలం గుర్తుండిపోతుంది. పితోరాగఢ్ ప్రాంతంలోని మారుమూల పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు బుధవారం మధ్యాహ్నం సిఇసి రాజీవ్ కుమార్ హెలికాప్టర్‌లో బయల్దేరారు. ఆయన వెంట పైలట్, మరో ఇద్దరు ఉన్నారు. అయితే దట్టమైన మేఘాలు కమ్ముకుని ఉండడంతో హెలికాప్టర్‌ను రాలం గ్రామం వద్ద పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అది నిర్జన గ్రామం. అక్కడ నివసించే ప్రజలు శీతాకాలంలో వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోతారు. తిరిగి వేసవి కాలంలో తమ గ్రామానికి చేరుకుంటారు.

ఇప్పటికే శీతాకాలం చలి తీవ్రత పెరిగిపోయిన కారణంగా గ్రామస్తులు గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ కుమార్ జోగ్‌దండే, హెలికాప్టర్ పైలట్, కుమార్ అనే ఉద్యోగితో కలసి సిఇసి అక్కడే ఒక పొలంలో సాయంత్రం ఐదు గంటల వరకు గడిపారు. ఇంతలో బెంగళూరుకు చెందిన ఇద్దరు ట్రెక్కర్లు వీరిని చూసి అక్కడకు వచ్చారు. తమ వద్ద ఉన్న ఇన్‌స్టంట్ నూడుల్స్, డ్రై ఫ్రూట్స్ సిఇసి బృందానికి ఇచ్చారు. ఎవరూ లేని ఒక ఇంటిని తెరచి చలిమంట వేసి ఆ ఇద్దరు ట్రెక్కర్లు వెళ్లిపోయారు. గడ్డకట్టే చలిలో ఉన్నిదుస్తులు ఏవీ లేకుండా గడపాల్సిన పరిస్థితి సిఇసి బృందానికి ఎదురైంది. అయితే తమ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు సిఇసి బుధవారం మధ్యాహ్నం 1 గంటకే పితోరాగఢ్ జిల్లా మెజిస్ట్రేట్ వినోద్ గిరీష్‌కు సమాచారం అందచేశారు. దీంతో ఆయన మిలాం, లిలాంలోని ఐటిబిపి పోస్టులను అప్రమత్తం చేసి సిఇసి ఉన్న ప్రదేశానికి వెళ్లాలని ట్రూపర్లను ఆదేశించారు.

ఇంతలో పరిసిర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు రలాంలో హెలికాప్టర్ దిగినట్లు తెలుసుకున్నారు. పటో గ్రామ సర్పంచ్ ఈశ్వర్ సింగ్ నబియాల్ మరి కొందరితో కలసి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ అర్ధరాత్రి ఒంటిగంటకు సిఇసి తలదాచుకున్న ఇంటిని చేరుకున్నారు. తమ వెంట తెచ్చిన డ్రైఫ్రూట్స్‌ను వారికి అందచేశారు. తెల్లవారుజామున 5 గంటలకు ఐటిబిపి బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయి. తమ వెంట తెచ్చిన మందులు, ఆహారాన్ని సిఇసి బృందానికి అందచేశాయి. వేడిగా తేనీరు అందచేశాయి. చివరకు ఉదయం 6 గంటల ప్రాంతంలో సిఇసి బృందం మున్సారీ బయల్దేరింది. అక్కడ ఐటిబిపి విశ్రాంతి గృహంలో కొద్ది సేపు గడిపి సిఇసి రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ బయల్దేరారు. కాగా..అత్యవసర పరిస్థితిలో తమను ఆదుకున్న స్థానికులకు సిఇసి కృతజ్ఞతలు తెలిపారు. దేవభూమి ప్రజలు సహజసిద్ధంగానే ఆపద్బాంధవులని ఆయన కీర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News