Saturday, December 21, 2024

కిరాయి కిరికిరి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/నాంపల్లి : సొంత భవనాలు లేకపోవడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదాయాన్ని తీసుకురావడంలో ఈ శాఖ రెండోస్థానంలో ఉండగా భవనాలకు అద్దెలు, కరెంట్, నెట్ బిల్లులు చెల్లించడంలో వెనుకబడి ఉందని, దీనివల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. దీంతోపాటు ప్రతినెలా కిరాయి చెల్లించాలని భవన యజమానులు ఇ బ్బందులు పెడుతున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు. చాలావరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతుండడంతో ఆయా భవనాల యజమానులు అద్దెల కోసం సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు యజమానులు కరెంట్ కట్ చేయించడం, మరికొందరు యజమానులు తాళాలు వేస్తామని బెదిరిస్తుండడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఒ కసారి భవన యజమాలనుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అద్దెలను చెల్లించేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మూడునెలల నుంచి ఆరు నెలల్లోపు బకాయిలను చెల్లిస్తుండగా రెగ్యులర్‌గా తమకు అద్దెలు చెల్లించాలని భవన యజమానులు సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలిసింది.

ఆదాయం వచ్చే శాఖల్లో రెండోస్థానం
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని చోట్ల భవన యజమానులు కోర్టులకు సైతం వెళ్లడం విశేషం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ప్రతి సంవత్సరం రూ.14 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తోంది. ఆదాయం వచ్చే శాఖల్లో ఇది రెండోస్థానంలో ఉంది. అయినా ఈ శాఖకు అద్దెల నుంచి నెట్ బిల్లులను చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. .

సొంత డబ్బులతో నెట్, కరెంట్ బిల్లులు
తమ సొంత డబ్బులతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి నెట్, కరెంట్ బిల్లులను చెల్లింపులు చేసి రోజు వారీ పనులు జరిగేలా చూస్తున్నామని కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు పేర్కొంటున్నారు. అయితే చాలాచోట్ల కిరాయిలు, మిగతా బిల్లులను తాము చెల్లించలేమని మరికొందరు సబ్ రిజిస్ట్రార్‌లు చేతులెత్తేయడంతో ఆయా భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించి నోటీసులు జారీ చేస్తుండడం విశేషం.

30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు….
రాష్ట్రంలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా వాటిలో 30 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తుండగా మిగతావన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. తక్కువగా రూ.10వేల నుంచి అధికంగా రూ.3లక్షల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అద్దెలను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్త భవనాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది.
రెడ్‌హిల్స్‌లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అంధకారం
రెడ్‌హిల్స్‌లోని ప్రభుత్వ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె నాలుగు నెలలుగా చెల్లించడం లేదు. భవన యజమాని ఖురేష్ ఆఫీస్ కిరాయి కట్టాలంటూ, లేదా ఖాళీ చేసిపోవాలంటూ నెలరోజులుగా అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఆరు లక్షల రూపాయల కిరాయి రూపంలో కట్టకపోవడాన్ని ఆగ్రహించిన ఆయన శుక్రవారం ఉదయం సుమారు 9:30 గంటలకు యజమాని ఆఫీస్ ఫ్యూజ్‌ను తొలగించారు. వెంటనే ఆఫీస్ లోపల పలు విభాగాల్లో కరెంట్ సరఫరా స్తంభించిపోయింది. తర్వాత 10 గంటలకు ఆఫీస్ సిబ్బంది, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ అధికారులు తమ విధులకు హాజరయ్యారు. లోపల అంధకారం నెలకొనడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పలు విభాగాల్లో చిమ్మచీకటి అలుముకున్నది. దీంతో దాదాపు గంటసేపు వరకు సిబ్బంది విధుల్లో చేరలేదు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్కార్ నుంచి నిధుల విడుదల కాగానే మూడు నెలలకోసారి అఫీస్ అద్దెను చెల్లించడం అనవాయితీగా వస్తోందని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ తెలిపారు.. ఈ దఫా మాత్రం నెల రోజులుగా నిధుల మంజూరులో జాప్యం జరిగిందని, త్వరలో యజమానికి అద్దెలు చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు చేసేదిలేక ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో కిరాయి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామంటూ వారు హామీ ఇచ్చారు. వెంటనే ఉద్యోగులు యజమాని ఖురేషితో చర్చలు జరిపారు. ఆయనకు త్వరలో ఆరు లక్షల రూపాయల అద్దె బకాయిలు ఎలగైనా సరే చెల్లిస్తామంటూ బతిమిలాడి ఆయనను ఎట్టకేలకు ఒప్పించారు. దీనికి ఆయన సరే అని కరెంట్ సరఫరా పునరుద్ధరించారు.
సర్కార్ ఆఫీస్‌లకు కరెంట్‌ను నిలిపేయడం లేదు : విద్యుత్ ఎడీఈ విజయకుమార్
ప్రభుత్వ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఆఫీస్‌లకు తాము పేరుకుపోయిన బకాయిలున్న కరెంట్‌ను తొలగించడం లేదు. అదంతా ఉన్నతాధికారులు చూసుకుంటారని ఎసీగార్డ్ విద్యుత్ ఎడీఈ విజయకుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ నారాయణ పేర్కొన్నారు. యజమాని, ఆఫీస్ మధ్య నెలకొన్న కిరాయి వివాదానికి తమకు ఏ మాత్రం సంబంధం లేదు. తాము సర్కార్ ఆఫీస్‌లకు కరెంట్ బంద్ చేయబోమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News