Friday, December 20, 2024

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్.. పోదాం పదా… డేట్, టైం మీరే చెప్పండి

- Advertisement -
- Advertisement -

మూసీ సుందరీకరణపై సిఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో అబద్దమే అశ్చర్యపోయిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి.హరీశ్‌రావు విమర్శించారు. మూసీ సుందరీకరణపై బహిరంగ చర్చకు రావాలన్న సిఎం రేవంత్ రెడ్డి సవాల్‌కు తాము సిద్దమని చెప్పారు. “చర్చకు రేపు రమ్మంటావా.. ఎల్లుండి రమ్మంటావా… సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్.. పోదాం పదా… డేట్, టైం మీరే చెప్పండి, నేనే కారు డ్రైవింగ్ చేస్తా…ఇద్దరమే పోదాం… లేదంటే శుక్రవారం ఉదయం 9 గంటలకు నేను సిద్ధం… ముందు మూసీ నిర్వాసితుల వద్దకు, ఆ తర్వాత ఆర్‌అండ్‌ఆర్ కాలనీ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కట్ట మీదకు పోదాం అక్కడే కూర్చొని మాట్లాడుదాం” అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవంను వ్యతిరేకించడం లేదని, మూసీ ముసుగులో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పేదలకు సరైన పునరావాసం కల్పించకుండా వారి ఇళ్ళను కూల్చడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

తెలంగాణ భవణ్‌లో గురువారం మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, పార్టీ నేతలతో కలిసి హరీశ్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. మూసీ సుందరీకరణను 2800 కోట్లతో 36 శుద్దీ కేంద్రాలను ప్రారంభించిందే బిఆర్‌ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. కెసిఆర్ హయాంలోనే మూసీలోకి 1100 కోట్లతో గోదావరి జలాలను తరలించేందుకు డిపిఆర్ సిద్దమైందని తెలిపారు.

పేదల ఇళ్లపై దాడి చేయడం దుర్మార్గం
నదిని శుభ్రం చేయడం నుంచే పనులు ప్రారంభం కావాలని, నదిలో పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలువకుండా చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు తెలిపారు. అసలు పని వదిలిపెట్టి ఇళ్లు కూలగొట్టడంపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులకు సెలవులు ఉండే శని, ఆదివారాలు చూసి శత్రుదేశంపై దాడి చేసినట్లుగా పేదల ఇళ్లపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో ఫార్మాసిటీకి తాము సేకరించిన భూమితో రియట్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితులను పట్టించుకోలేదని అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని, 2013 భూసేకరణ చట్టం కంటే మించి మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్ని సహాయ,

పునరావాస చర్యలు తీసుకున్నామని వివరించారు. రెండు రెట్ల పరిహారంతో పాటు 250 గజాల ఇండ్లు మున్సిపాల్టీలో కట్టించామని, ఆ కుటుంబంలో 18 ఏళ్లు నిండిన వారందరికి ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ అందించామని తెలిపారు. దాదాపు 98 శాతం మంది నిర్వాసితులకు రూ.2 వేల కోట్లతో పునరాసం, ఉపాధి, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. కేవలం 2 శాతం మంది మాత్రమే మిగిలారని, రేవంత్ రెడ్డికి మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల అంత ప్రేమ ఉంటే మిగిలిపోయిన వారికి ఆర్‌అండ్‌ఆర్ కోసం మరో రూ.200 కోట్లు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవమంటూ, ఫ్యూచర్ సిటీ అంటూ సిఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు.

మల్లన్న ఇంటికి వర్తించిన నిబంధనలు మాల్ నిర్మాణానికి వర్తించవా..?
మూసీ పరివాహకంలో మల్లన్న ఇంటిని కూల్చి మాల్ కడుతామని చెప్పడం వ్యాపారం కాదా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ పరివాహంలో మల్లన్న ఇంటికి వర్తించిన నిబంధనలు మాల్ నిర్మాణానికి వర్తించవా..? అని నిలదీశారు. మూసీ నిర్వాసితులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నాడని, నిర్వాసితుల పట్ల శ్రద్ద ఉంటే వారికి 2013 చట్టం మేరకు సహాయ, పునరావాసం కల్పించాలన్నారు. గచ్చిబౌలీలో ఇటీవల కేసు గెలిచిన 480 ఎకరాల భూమిలో మూసీ నిర్వాసితులకు ఇండ్లు కట్టిస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు. బఫర్ జోన్‌లో తాను మూడు నెలలు ఉంటే నిర్వాసితులకు మేలు జరుగుతుందంటే తాను నాలుగు నెలలు ఉండేందుకైనా సిద్ధమని తెలిపారు. రేవంత్ రెడ్డి సిఎం స్థాయిని దిగజార్చారని, సిఎం కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమై ప్రజల దృష్టిని మళ్ళీంచేందుకు మూసీ సమస్యను తెరపైకి తెచ్చాడని ఆరోపించారు.

గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు రేవంత్ తీరు
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన పార్టీ ఎక్కడైనా ఉందా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు మాజీ మంత్రి, హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు రాలేదని, మధ్యప్రదేశ్‌లో కూడా ఒక్క సీటు రాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీనే ఉంది కదా..? అని ప్రశ్నించారు. గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నడో అర్థం కావడం లేదని విమర్శించారు.

నా శిశ్యుడిగా ఉంటూ నా కారు ముందు డ్యాన్స్ చేశావ్
తనకు ఎంఎల్‌ఎ పదవి లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తే తనకు కృతజ్ఞత లేదని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆ సమయంలో ఆయన ఎక్కడున్నారని హరీశ్‌రావు నిలదీశారు. తమ పార్టీలోనే తన శిష్యుని కింద ఉన్నాడని, తాను మంత్రి అయిన నాడు తన కారు ముందు డ్యాన్స్ చేసినోడని అన్నారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్కు వద్ద తన వెనుక నిలబడి.. టీవీలో కనబడేందుకు నిక్కి నిక్కి చూశాడని చెప్పారు. బిఆర్‌ఎస్ పొత్తుతోనే రేవంత్‌రెడ్డి మొదటిసారి ఎంఎల్‌ఎ అయ్యారని, ఆయనకు కృతజ్ఞత ఉన్నదా..? అని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ పార్టీ మీద..? అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతికత రేవంత్‌రెడ్డికి ఎక్కడిది..? అని నిలదీశారు. సోనియా గాంధీ బలిదేవత.. వెయ్యి మందిని చంపింది అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ప్రజలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర తమకు లేదని, ఇదే తెలంగాణ గడ్డపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి గతంలో ఉన్న టిడిపి ప్రభుత్వాలకే గుర్రాలతో తొక్కించిన చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News