Friday, December 20, 2024

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

- Advertisement -
- Advertisement -

ఒసిలకే ఇడబ్ల్యుఎస్ అన్నప్పుడు ఓపెన్ కేటగిరీ 50 శాతంలో నుంచే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు 10 శాతం తీయాలి. కానీ మొత్తం 100%లో 10 శాతం తీయడం అంటే అన్యాయంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిల పోస్టులను లాగేసుకుని ఒసిలకు ఇచ్చినట్లు కాదా? ఈ మధ్యనే ఈ విషయంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఒక నిబంధన, అగ్రవర్గ కులాలకు ఒక నిబంధనా? ఉపకార వేతనాలు పొందాలంటే ఎస్‌సిలకు రెండు లక్షల ఆదాయం, ఎస్‌టిలకు రెండు లక్షల ఆదాయం, బిసిలకు 3 లక్షల ఆదాయం ఉండేట్లు మాత్రమే ఆదాయం సర్టిఫికెట్స్ ఉండాలంటారు. అప్పుడే ఆయా సర్టిఫికేట్లు చెల్లుబాటు అవుతాయంటారు. అగ్రవర్ణ కులాలకు మాత్రం ఇడబ్ల్యుఎస్ సర్టిఫికెట్స్ కోసం రూ. 8 లక్షల ఆదాయం వరకు అనుమతించారు. ఇది ఏ న్యాయసూత్రాల ప్రకారం సమంజసం. ఇది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదా?

ఒక జిల్లాలో 6వ ర్యాంక్ వచ్చిన బిసి(డి) అబ్బాయికి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో ఉద్యోగం రాలేదు. కానీ 42 వ ర్యాంకు వచ్చిన ఒసి అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. అదే జిల్లాలో 61వ ర్యాంకు వచ్చిన ఎస్‌సి అమ్మాయికి జాబ్ రాలేదు. 452వ ర్యాంకు వచ్చిన ఒసి అమ్మాయికి జాబ్ వచ్చింది. మరొక జిల్లాలో 70వ ర్యాంక్ వచ్చిన రవళి బిసి(బి) అమ్మాయికి ఉద్యోగం రాలేదు. 180వ ర్యాంక్ వచ్చిన ఒసి అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఇంకో జిల్లాలో 70వ ర్యాంక్ వచ్చిన బిసి(డి) అబ్బాయికి జాబ్ రాలేదు. కానీ 385 ర్యాంక్ వచ్చిన ఒసి అబ్బాయికి జాబ్ వచ్చింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మెదక్, ఆదిలాబాద్, నల్గొండ ఇలా 33 జిల్లాలో ఇదే పరిస్థితి. ఇవి ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ వల్ల ఎస్‌సి, ఎస్‌టి, బిసి లకు జరిగిన అన్యాయానికి కొన్ని ఉదాహరణలు.

రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా ఇడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్స్ వల్ల బిసి, ఎస్‌సి, ఎస్‌టి, బిడ్డలకు, ముఖ్యంగా బిసి బిడ్డలకు రావల్సిన 11 వందల ఉద్యోగాలు రాకుండాపోయాయి. కొత్తప్రభుత్వం ఉద్యోన నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే, ఇడబ్ల్యుఎస్ 10% రిజర్వేషన్స్ వల్ల 3000 ఉద్యోగాలు ఎస్‌సి, ఎస్‌టి, బిసి బిడ్డలు కోల్పోయారు. అంటే బిసి బిడ్డల నోటికాడి కూడును అన్యాయంగా ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ పేర అగ్రకులాల పిల్లలకు కట్టబెట్టారు. ఈ నష్టానికి కారకులెవరు? ఈ విధానాన్ని తెచ్చిన పాలకులు దీనిని ఎలా సమర్ధించుకుంటారు? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి రిజర్వేషన్లు ఎక్కడైనా ఉన్నాయా? ఏ దేశ రాజ్యాంగమైన ఇలాంటి విధానాన్ని అనుమతిస్తుందా? ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? తరతరాలుగా దోపిడీకి గురైన కులాలకు, సామాజికంగా వివక్షకు గురైన కులాలకు, విద్యాపరంగా, సామాజికంగా వెనకబడిన కులాలకు రాజ్యాంగ నిర్మాతలు సామాజిక కోణంలో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిందే రిజర్వేషన్ విధానం.

నిజానికి రాజ్యాంగ రచనలో బిసిలకు అన్యాయమే జరిగింది. ఎస్‌సి, ఎస్‌టిలతో పాటే బిసిలకు రిజర్వేషన్లు ఆనాడే లభించాల్సింది. అంబేడ్కర్ ఆ ప్రయత్నం చేసినప్పటికీ అగ్రకులాలతో నిండిన రాజ్యాంగ సభ ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. రాబోయే ప్రభుత్వాలు ఇతర వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం తగు చర్యలు తీసుకోవాలని మాత్రమే రాజ్యాంగం పేర్కొంది. 1950 నుంచి బిసిలు పోరాటం చేస్తే కాక కాలేశ్వర్ కమిషన్ వేసి, రిపోర్ట్‌ను కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. జనతా ప్రభుత్వం బిసిల స్థితిగతుల అధ్యయనానికి మండల కమిషన్‌ను నియమించినప్పటికీ రిపోర్టు ఇచ్చే నాటికి ప్రభుత్వం కూలిపోవడంతో ఆ నివేదికను అట్టకెక్కించారు. చివరకు విసి సింగ్ ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్లు అమలు చేస్తే విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. 40 సంవత్సరాలు పోరాడితే గాని బిసిలకు రిజర్వేషన్లు రాలేవు. ఆ ఫలాలు ఇప్పుడిప్పుడే అందుకొని ఓపెన్ కేటగిరిలో పోటీపడుతున్నారు బిసి బిడ్డలు. నాడు బిసి రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఆ పార్టీయే ఏ రకమైన పోరాటం చేయకపోయినా, కమిషన్ రిపోర్టు లేకపోయినా, ఏకపక్షంగా మెజార్టీ ఉందని, రాజ్యాంగాన్ని సవరించి ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను తీసుక వచ్చి ఇప్పుడిప్పుడే ఓపెన్ కేటగిరిలో పోటీపడుతున్న బిసి బిడ్డల నోట్లో మట్టికొట్టింది.

తానతందానా అన్నట్లు బిసి కమిషన్లు సూచించిన విధంగా బిసి రిజర్వేషన్లు పెంచమంటే 50% సీలింగ్ విధించిన న్యాయశాఖ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్స్ ద్వారా 50% సీలింగ్ దాటిన రిజర్వేషన్లను సమర్ధించడం విస్మయానికి గురిచేసింది. ఇడబ్ల్యుఎస్ అమలుకై విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా 10% సీట్లను పెంచుతామని తద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు నష్టం జరగదని నమ్మపలికిన కేంద్రం ఎన్ని విద్యా సంస్థల్లో 10 శాతం సీట్లు పెంచింది? సూపర్ న్యూమారీ పోస్టులు సృష్టిస్తం అన్న కేంద్రం ఏ శాఖలో ఎన్ని పోస్టులు సృష్టించింది? ఇడబ్ల్యుఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలు ప్రత్యేక సీట్లు, సూపర్ న్యూమారీ పోస్టులు సృష్టించే అమలు చేస్తున్నాయా? మన రాష్ట్రంలో వైద్య విద్యాసంస్థలో ఏమి జరిగింది? ప్రత్యేక సీట్లలో, సూపర్ న్యూమారీ పోస్టుల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు వాటా వుండదా? ఆర్థిక ప్రాతిపదికన ఇచ్చినప్పుడు ఇడబ్ల్యుఎస్ ఒసిలతో పాటు ఎస్‌సి,ఎస్‌టి, బిసిలకు కూడా వర్తింపజేసిన కొంత న్యాయంగా అనిపించేది. అలా కాకుండా ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్ వర్తిస్తే ఇడబ్ల్యుఎస్ వర్తించదని ప్రత్యేక నిబంధన పెట్టి ఒసి పక్షపాతాన్ని చాటుకుంది ఇడబ్ల్యుఎస్ తెచ్చిన ఆ పార్టీ.

జుర్రు నారాయణ యాదవ్
9494019270

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News