Monday, October 21, 2024

సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

* గడువులోగా ప్రభుత్వానికి నివేదిక
* 80 వేల మంది సిబ్బందితో ఇంటింటి సర్వే
* అన్ని వర్గాల కుటుంబాల వివరాలూ సేకరణ
* పూర్తిస్థాయిలో నిమగ్నమైన ప్రణాళికా విభాగం
* ఈ నెల 24 నుంచి పది జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ
* 60 రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం : తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది. సర్వేను 60 రోజుల్లో పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియలు, బీహార్‌లో చేపట్టిన కుల సర్వేలను సైతం ప్రభుత్వం పరిశీలించింది. శాసనసభలో చేసిన తీర్మానం మేరకు ప్రజల సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ కుల సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు జీఓ నెంబరు 18 కూడా జారీ చేశారు. ఈ సర్వేకు నోఢల్ విభాగంగా ప్రణాళిక శాఖకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు మెరుగుపరిచేందుకు కుటుంబ సర్వే చేయాలని ఫిబ్రవరి 4న మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ ఆమోదించింది.

ఇటీవల కొత్త కమిషన్ ఏర్పాటు కావడంతో ఆ ప్రక్రియ వేగం పుంజుకుంది. సమగ్ర కుటుంబ సర్వేను గడువులోగా పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటికే కమిషన్ సిద్ధం చేసింది. యాప్‌లు, ఆన్‌లైన్లో వివరాలు తీసుకోవాలని భావించినా సమగ్రంగా సర్వే చేసేందుకు కాగిత రూప ఫారాన్ని ఎంపిక చేశారు. తద్వారా న్యాయవివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసుకున్నాక కుటుంబసభ్యుల సంతకం తీసుకుంటారు. ఈ ఫారాలను భద్రపరచడంతో పాటు ఏరోజుకారోజు వివరాలన్నీ సర్వే పోర్టల్‌లో నమోదు చేస్తారు. జిల్లా కలెక్టర్లు ఈ బాధ్యతను పర్యవేక్షిస్తారు. జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ల కోసం సమగ్ర సర్వే చేయాలని సీఎం నిర్ణయించారు. ఓటరు జాబితాల ఆధారంగా కాకుండా ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే నిర్వహణకు అవసరమైన యంత్రాంగం బీసీ కమిషన్ వద్ద లేదని గుర్తించిన ప్రభుత్వం ప్రణాళిక శాఖను నోడల్ విభాగంగా పేర్కొంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ సమగ్ర కుటుంబ సర్వేకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని కులాలు గ్రూపులు మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి.

కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఒకే వృత్తి నిర్వహించే కొన్ని కులాలను వేర్వేరు గ్రూపుల్లో పెట్టకూడదని విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని కులాలకు బీసీ హోదా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారని, మిగతా జిల్లాల్లోనూ అమలు చేయాలని కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేతో వాస్తవ పరిస్థితులు వెల్లడవుతాయి. ఈ సర్వే వివరాలతో అవసరమైన సిఫార్సులు చేయనున్నారు. సంచార జాతుల కుటుంబాలను, జీవనోపాధి కోసం వలస వెళ్లిన కుటుంబాలను సర్వేలో భాగం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా కుటుంబాలకు అవగాహన కల్పించాలని సంబంధిత సంఘాలకు సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన విధివిధానాల మేరకు బీసీ కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బీసీ కమిషన్ అధ్యయనంలో భాగంగా ఈ నెల 24 నుంచి పూర్వ పది జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టి అన్నివర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది.

సమగ్ర కుటుంబ సర్వే ఇలా : ఇంటింటి సర్వే కోసం దాదాపు 80 వేల మంది గణకులు (ఎన్యుమరేటర్లు), 10 వేల మంది సూపర్‌వైజర్లు అవసరమని అంచనా వేశారు. ఉపాధ్యాయుల సేవల వినియోగానికి న్యాయ అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కో గణకుడు రోజుకు కనీసం 15-20 కుటుంబాల సర్వే చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. తొలుత ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు కుటుంబాలను గుర్తిస్తారు. ఆ వివరాల మేరకు నెల రోజుల్లో ఇంటింటి గణన పూర్తిచేస్తారు. సర్వేలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అన్ని వర్గాల ప్రజల వివరాలు తీసుకుంటారు. ప్రస్తుతం 54 వివరాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఫారంలో నమోదు చేయాల్సిన వివరాలపై మేధావులు, సంఘాలతో సమావేశమై సూచనలు తీసుకుంటారు.

గతంలో తొలిసారి సమగ్ర కుటుంబ సర్వే : గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆర్థిక, సామాజిక, కుల, విద్య, ఉపాది లాంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడంతో ఇంటింటా సర్వేకు లైన్ క్లియర్ అయింది. ఈసారి సర్వే ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం కీలకంగా మారతాయి.

సర్వే అధికారులకు ఈ రుజువులు : సర్వే కోసం 19న ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు కుటుంబానికి సంబంధించిన వాస్తవ వివరాలు తెలియచేయడంతో పాటు వారి అనుమానాల నివృత్తికి అందుబాటులో ఉన్న కొన్ని రుజువులు చూపాల్సి ఉంటుంది. సర్వే సమయంలో ఉన్న చిరునామా కాకుండా ఇతర ప్రాంతాల చిరునామాలతో ఆ పత్రాలు ఉన్నప్పటికీ అవసరం మేరకు చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు గత సంవత్సరం అద్దె ఇంట్లో ఉండి అదే ఇంటి నంబరుతో ఆధార్‌కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు పొంది ఉన్న వారు తరువాత వేరే ఇంట్లోకి మారినట్లయితే ప్రస్తుతం ఉన్న చిరునామా చెప్పడంతో పాటు పాత చిరునామాతో ఉన్న ఆధార్ కార్డు నంబరు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ చెప్పవచ్చు.

సర్వే అధికారులు అడిగితే చూపించాల్సిన పత్రాలు : ఆధార్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ కార్డు, ఇంటి అసెస్‌మెంట్, ఇంటి పన్ను రశీదు, కరెంట్ బిల్లు, ఎల్పీజీ కనెక్షన్ పుస్తకం, బ్యాంక్, పోస్టాఫీసు పాసు పుస్తకం, కులం, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్థులు చదువుకున్న పత్రాలు(మెమో, టీసీ వంటివి), వికలాంగుల ధ్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికెట్), వాహనాల రిజిస్ట్రేషన్ కాపీ కార్డు, వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం, ఓటర్ ఐడీకార్డు, పాన్‌కార్డు. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందితే ఇందిరమ్మ ఇల్లు, వంటి వాటి కేటాయింపు సర్టిఫికెట్. పెన్షనర్ల ఐడీ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి.

రేషన్‌కార్డు ప్రస్తావన లేదు : ప్రభుత్వం బేస్‌లైన్ సర్వే చేపడుతుందనగానే రేషన్‌కార్డుల ఏరివేత కోసమే అన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. అయితే నిజానికి సర్వేలో ఎక్కడా రేషన్‌కార్డుకు సంబంధించిన వివరాలు అడగడం లేదు. బోగస్‌కార్డుల ఏరివేతకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని, సర్వేతో రేషన్‌కార్డుకు ఎలాంటి సంబం ధం లేదని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే బోగస్ కార్డులు ఉన్న వారు స్వచ్ఛందంగా వాటిని అధికారులకు అందజేయాలని కోరారు. లేదంటే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ద్వారా కార్డుల ఏరివేత చేపట్టి అనర్హులుగా గుర్తించి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇంటికి నంబర్..ప్రభుత్వ స్టిక్కర్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేస్‌లైన్ ఇంటింటి సర్వేలో ఏ ఒక్క కుటుంబం, ఇల్లు తప్పిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. సర్వే కోసం వెళ్లిన ప్రతీ ఇంట్లో సర్వే పూర్తికాగానే ఆ ఇంటికి ప్రభుత్వ చిహ్నంతో ఒక స్టిక్కర్ అతికించడంతో పాటు సర్వే సందర్భంగా కేటాయించే నంబరును గోడపై రాస్తారు. ప్రస్తుతం సర్వే ఫారంలో కేటాయించిన నంబరు ఆ కుటుంబానికి సంబంధించి శాశ్వత నంబరుగా(యూనిక్ నంబరు) కేటాయిస్తారు.

60 రోజుల్లో సర్వే పూర్తి చేస్తాం : తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ తెలిపారు. ఈ సర్వేలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర అన్ని వర్గాల కుటుంబాల వివరాలు సేకరిస్తామని స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి రాజకీయ, కుల సర్వేలో అడగాల్సిన ప్రశ్నలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామన్నారు. ఈ సర్వే వివరాలను క్రోడీకరించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, కొన్ని కులాల గ్రూపుల్లో మార్పులు, ఇతర అంశాలపై ప్రభుత్వానికి సమగ్ర సిఫార్సులతో నివేదికలు అందిస్తామని వెల్లడించారు. సర్వే కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.150 కోట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరం మేరకు మరిన్ని నిధులు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News