Monday, October 21, 2024

బంగాళాఖాతంలో ’దానా’ తుపాను

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు
రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
తుపానుగా మారే అవకాశం ఉందన్న ఆర్‌ఎంసీ
వాయువ్య దిశగా పయనిస్తుందని వెల్లడి

మన తెలంగాణ / అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ సంస్థ (ఆర్‌ఎంసీ) వెల్లడించింది. ఈ తుపానుకు దానా అని నామకరణం చేసినట్టు తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆర్‌ఎంసీ వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది.

ఈ అల్పపీడనం అక్టోబరు 22 నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, ఈ నెల 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 21 కల్లా తిరిగి వచ్చేయాలని సూచించింది. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

దీని ప్రభావంతో బంగాళాఖాతంలో ఈ నెల 22 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చని తెలిపింది. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలో తీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News