Thursday, January 2, 2025

ట్రిలియన్ డాలర్ ఎకానమీయే లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఐఎస్‌బి విద్యార్థులే తెలంగాణ బ్రాండ్
అంబాసిడర్లు హైదరాబాద్‌ను 600
బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలి
ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్,
పారిస్, టోక్యో, సియోల్‌తో పోటీ పడాలి
అమెరికా తరువాత హైదరాబాద్ బెస్ట్
సిటీగా మారాలి కాంగ్రెస్ హయాంలోనే
ప్రపంచస్థాయితో పోటీ పడే అభివృద్ధి
జీవితంలో రిస్క్ లేనిదే – మంచి విజయాలు
సాధించలేం ఐఎస్‌బి లీడర్‌షిప్ సమ్మిట్‌లో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి –

మన తెలంగాణ / హైదరాబాద్ : ఐఎస్‌బి విద్యార్థులు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్లు అని, తెలంగాణను ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న లక్ష్యసాధనలో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాలని సూచించారు. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని పిలుపునిచ్చారు. వెళ్లే ప్రతి చోట తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాలని సూచించారు. జీవితంలో గొప్ప పనులు చేయాలంటే కొంత రిస్క్ తీసుకోవాలని, రిస్క్ తీసుకోకుండా లక్ష్యాలను సాధించలేమని రేవంత్ రెడ్డి అన్నారు. మంచి నాయకుడిగా ఎదగాలంటే ధైర్యం, త్యాగం కీలకమైన అంశాలన్నారు.

ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నాయకత్వ శిఖరాగ్ర సదస్సు -2024లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐఎస్‌బి నిర్వహించిన ఈ నాయకత్వ సదస్సు పాల్గొన్న ముఖ్యమంత్రి లీడర్ షిప్ ఇన్ న్యూ ఇండియా అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడంలో అందరి సహకారం కావాలని సదస్సులో కోరారు. దేశంలోని నగరాలతో కాకుండా, న్యూయార్క్, ప్యారిస్, టోక్యో , సియోల్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలని కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోరట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని దేశానికి ఒక రోల్ మాడల్ గా, గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చెప్పారు.

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులం కాలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంచి లీడర్ అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని తెలిపారు. ప్రజలతో మమేకం అవ్వగలిగితే ఏదైనా సాధించవచ్చని చెప్పుకొచ్చారు. జీవితంలో రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమని అన్నారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు సహా ఎంతో మంది నాయకులు మనందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. తాను నాయకత్వ లక్షణాలను వారి నుంచే నేర్చుకున్నానని గుర్తు చేశారు. నాయకులు డబ్బు, వ్యక్తిగత జీవితం, సమయం ఇలా చాలానే త్యాగాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మంచి లీడర్ కావాలంటే ధైర్యం, త్యాగం ఉండాలని విద్యార్థులకు సూచించారు.

సిగ్గుపడకుండా ప్రజలతో మమేకమవ్వాలన్నారు. ఐఎస్‌బీలో ఉన్నవారంతా తెలంగాణ, దేశానికి అంబాసిడర్లు అని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని 600 మిలియన్ సిటీగా మార్చేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చనన్నారు. కేవలం న్యూయార్క్, పారిస్, లండన్‌తో పోల్చాలనుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీరంతా తెలంగాణలో 2, 3 ఏళ్లు పని చేయాలని సూచించారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి జీతాలు ఇవ్వలేకపోవచ్చు కానీ, మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్‌ను మాత్రం అందిస్తుందని చెప్పారు. ఒలింపిక్స్‌లో భారత్ దురదృష్టవశాత్తు స్వర్ణ పతకాలు గెలవలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐఎస్‌బీ లీడర్ షిప్ సమ్మిట్‌లో పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News