Monday, October 21, 2024

నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్

- Advertisement -
- Advertisement -

మ.2 నుంచి సా. 5 వరకు పరీక్షలు
46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 31,383 మంది అభ్యర్థులు
అభ్యర్థుల ఆందోళనల
నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు
అభ్యర్ధుల బయోమెట్రిక్ హాజరు
తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బంది

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. 2011 సంవత్సరం తర్వాత జరుగనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

గ్రూప్ -1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు రాయనున్నారు. ఇప్పటికే 90 శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షల కోసం హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. అన్ని కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.

పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు నగర పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనలు తారస్థాయికి చేరడంతో పశ్నపత్రాల తరలింపు, పరీక్ష నిర్వహణ, తిరిగి జవాబు పత్రాలు తీసుకెళ్లడం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా గట్టి పోలీసు బందోబస్తు కల్పించాలని నిర్ణయించారు. ప్రతీ కేంద్రం వద్ద ఒక ఎస్.ఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంటారు. అదనంగా ఒక పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ పరీక్షా కేంద్రాలను తరచూ సందర్శిస్తుంది. స్థానిక ఇన్‌స్పెక్టర్, ఎసిపి పరీక్షా కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తుంటారు. భద్రతా పరమైన ఏర్పాట్ల పర్యవేక్షణకు మూడు కమిషనరేట్లలో ఒక్కో డిసిపిని నోడల్ అధికారిగా నియమించారు.

ఈ మేరకు పోలీస్ కమిషనర్లతో ప్రభుత్వం తగిన బందోబస్తు ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల వద్ద స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా పరీక్షల నిర్వహణ నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సిసిటివిలను ఏర్పాటు చేశారు. టిజిపిఎస్‌సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సిటిటివిలను పోలీసులు పర్యవేక్షిస్తారు.

పరీక్షల నిర్వహణలో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకోవడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయాన్ని అదనంగా కేటాయించారు. స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నిపరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా అందించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ప్రశ్నాపత్రాలు తరలించే వాహనాలను జిపిఎస్ ట్రాకింగ్

ప్రశ్నపత్రాలు, జవాబు తరలించే వాహనాలకు టిజిపిఎస్‌సి జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగిస్తోంది. స్ట్రాంగ్ రూముల నుంచి పరీక్ష కేంద్రానికి తరలించే వాహనాలకు జిపిఎస్ అమర్చి టిజిపిఎస్‌సి ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. వాహనం ఒక్కనిమిషం ఆగినా వెంటనే గుర్తించి అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేశారు. గ్రూప్-1 పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్‌నెట్ దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. స్మార్ట్‌వాచీలు, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News