Tuesday, October 22, 2024

డైట్ ఛార్జీలపై సర్కారుకు నివేదిక

- Advertisement -
- Advertisement -

భారీగా పెరగనున్న డైట్, కాస్మోటిక్ ఛార్జీలు
 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

భట్టికి నివేదిక అందించిన ఉన్నతాధికారుల బృందం

మన తెలంగాణ/హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్ధుల డైట్ ఛార్జీలు, కాస్మోటిక్స్ ఛార్జీల పెంపునకు ఉన్నతాధికారుల బృందం సోమవారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు నివేదికను అందజేసింది. కాలేజీ హా స్టళ్లకు రూ. 1500 నుండి రూ. 2100, గురుకుల హాస్టళ్ళలో 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు రూ. 900 నుండి రూ.1330, 8వ తరగతి నుంచి 10వ తరగతికి రూ. 1100 నుండి రూ. 1540 కు పెంచాలని ఆ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కాస్మోటిక్ ఛార్జీలు 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రూ.55 నుంచి రూ. 175, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ. 275కు పెంచాలని ప్రతిపాదించారు. కాస్మోటిక్ ఛార్జీలు 16 సంవత్సరాల తరువాత, డైట్ ఛార్జీలు 7 సంవత్సరాల తరువాత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్, సంక్షేమ వసతి గృహాల్లోని 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

కాస్మోటిక్స్, డైట్స్ ఛార్జీలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం తదితరులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు అక్టోబర్ 17న ఓ కమిటీని నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్ శ్రీదేవి,మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తఫ్పీర్ ఇక్బాల్, ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ అలుగు వర్షిని, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ సైదులు, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ సర్వేశ్వర్ రెడ్డిలతో ఒక కమిటీని నియమించారు.

నివేదికపై బీసీ సంఘం హర్షం
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళ, గురుకుల పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలను పెంచేందుకు అధికారులు నివేదిక ఇవ్వడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెంపుదల గతం కంటే మంచిగా ఉందన్నారు. గురుకులాలు, హాస్టళ్ళలో చదువుకునే విద్యార్ధులకు ఈ పెంపుదల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మంచిగా మెనూ తయారు చేసి పౌష్టిక ఆహారం పెట్టాలన్నారు.

రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒకదానికి కూడా సొంత భవనాలు లేవని తెలిపారు. కానీ చదువుకొని భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ లు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కావాల్సిన విద్యార్థులను బందెల దొడ్డిలో పశువులను తోలినట్లు ఒక్కొక్క రూంలో 20 నుంచి 50 మందిని వుంచుతున్నారు. భవిష్యత్ దిబ్బ తీస్తున్నారని, చదువు దెబ్బ తినడంతో పాటు ఆరోగ్యం దెబ్బ తింటున్నందున సొంత భవనాలు నిర్మించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News