మధ్య ప్రదేశ్ జబల్పూర్‌జిల్లా ఖమరియాలో మంగళవారం ఉదయం ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీలో సంభవించిన శక్తిమంతమైన విస్ఫోటంలో డజను మందికి పైగా కార్మికులు గాయపడినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. ఫ్యాక్టరీ రీఫిల్లింగ్ విభాగంలో బాంబుల్లోకి పేలుడు పదార్థాన్ని నింపుతుండగా ఉదయం సుమారు 9.45 గంటలకు పేలుడు సంభవించిందని సంస్థ అధికారి వివరించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వారిని ఆసుపత్రిలో చేర్పించారని, మరొక కార్మికుడు కనిపించడం లేదని,
అతను బహుశా పేలుడు సంభవించిన విభాగంలో శిథిలాల కింద చిక్కుకుపోయి ఉందవచ్చునని ఆయన తెలియజేశారు. పేలుడు ఎంత శక్తిమంతమైనదంటే ఆ శబ్దం కొన్ని కిలో మీటర్ల దూరంలోని వారికి వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రక్షణ ఉత్పత్తి శాఖ కింద ప్రధాన ఆయుధ సామగ్రి ఉత్పత్తి యూనిట్లలో ఖమరియా ఆర్డ్‌నన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఆ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారని, దర్యాప్తు పూర్తయిన తరువాత పేలుడుకు కారణం తెలియరాగలదని అధికారి చెప్పారు.