Wednesday, October 23, 2024

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారు

- Advertisement -
- Advertisement -

పదేళ్ల కెసిఆర్ పాలనలో రంధి లేకుండా బతికిన రైతులను పది నెలల కాలంలో చేసిన కష్టానికి ఫలితం దక్కక అలమటించేలా చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ పాలనలో దుక్కి దున్నినప్పటి నుంచి పంట కొనుగోలు దాకా కంటికి రెప్పలాగా రైతులను కాపాడుకుంటే, కాంగ్రెస్ పాలన రాజకీయ విష క్రీడలో తిట్ల పురాణాల్లో మునిగి తేలుతుంటే రైతులు దిక్కులేని పక్షులై దీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాలు, మూసీలు, ఫోర్త్ సిటీ డంభాచారాలను కొంచెం పక్కనపెట్టి పంట కొనుగోలు మీద, మద్ధతు ధర మీద, ఇస్తామన్న బోనస్ మీద దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. పంట పెట్టుబడి కోసం ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇప్పటికే రైతుల నెత్తిన శఠగోపం పెట్టారని, ఇప్పుడు కొనుగోలు కూడా సరిగ్గా చేయక రైతుల ఉసురు తీయొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాష్ట్రంలో 44.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు జరిగిందని అధికారిక అంచనాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం, పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 7521తో పాటు, రూ. 500 బోనస్ కలిపి రూ. 8021 కొనుగోలు చేయాల్సిందని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ప్రైవేటు వ్యాపారస్తులకు 5వేలకే అమ్ముకునే దుస్థితి వచ్చిందని వాపోయారు. అకాల వర్షాల వల్ల దిగుబడి తగ్గిపోయి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల పత్తి కూడా పండలేదని, గోరు చుట్టు మీద రోకటి పోటులా దిగుబడి తగ్గడంతో పాటు తక్కువ ధరకు అమ్ముకొని పత్తి రైతులు దారుణంగా నష్టపోతున్నారంటే ఇది పూర్తిగా రేవంత్ సర్కారు వైఫల్యమని విమర్శించారు. మక్కల మద్దతు ధర రూ. 2,225. కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్ కలిపితే రైతుకు క్వింటాల్ కు రూ. 2725 మద్దతు ధర లభించాలని, కానీ ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దిక్కుతోచని మక్క రైతు రూ.2 వేలకే అమ్ముకొని లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు.

వరి కొనుగోలు దగ్గర ఇదే దుర్దశ అని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు గతేడాది ఇదే సమయానికి 8లక్షల 63వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిందని, ఇప్పుడున్న రేవంత్ సర్కారు ఇప్పటి వరకు కేవలం సుమారు పది, పదిహేను వేల మెట్రిక్ టన్నులు మించి కొనుగోలు చేయలేదని అన్నారు. గతంలో కొనుగోలు చేసిన ధాన్యంతో పోలిస్తే కేవలం 2శాతం ధాన్యం మాత్రమే కొన్నారని అన్నారు. వడ్ల మద్దతు ధర రూ.2320 ఉంటే, ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు మద్ధతు ధర కంటే తక్కువకు రూ.1800 నుంచి -1900 లకే, అడ్డికి పావుశేరు చొప్పున అమ్ముకొని కన్నీటి పర్యంతం అవుతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News