చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు శరవణన్ శివకూమార్ కుమారుడే సూర్య. తండ్రి నటుడే అయినప్పటికీ సూర్య అనేక కష్టాలు పడి ఎదిగాడు. అనుభవం కోసం ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో కూడా పనిచేశాడు. బిజినెస్ గురించి అర్థం చేసుకున్నాడు. ఏదో ఒక రోజున తనదైన ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితులు అతడిని కెమెరా ముందు నిలబడేలా చేశాయి. ఈ విషయాన్ని సూర్య స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇటీవల ‘పింక్ విల్లా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ‘‘నేను ఓ గార్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశాను. మొదటి 15 రోజులు ట్రయినీగా ఉన్నాను. నా జీతం అప్పట్లో 15 రోజులకు రూ. 750. ఆరు నెలల వరకు నేను ఓ సినీ నటుడి కుమారుడినని వారికి తెలియదు. నా నెల జీతం రూ. 1200. నేను మూడేళ్లు పనిచేశాక నా జీతం రూ. 8000 అయింది’’ అన్నారు.
సూర్య పాత రోజుల విషయం గుర్తుచేసుకుంటూ, ‘‘ ఓ రోజు మా అమ్మ నాకు బ్రేక్ ఫాస్ట్ వడిస్తూ, ‘నేను రూ. 25000 అప్పు తెచ్చాను. అది మీ నాన్నకు తెలియదు’ అంది. నేను చాలా షాక్ కు గురయ్యాను. ‘ఏమంటున్నావు అమ్మ? నాన్న నటుడు. అయినా నువ్వు రూ. 25000 అప్పు తెచ్చావా? మన సేవింగ్స్ ఏమయ్యాయి? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత?’ అని అడిగితే, ఆమె ‘అది లక్ష రూపాయలు కూడా ఉండదు’ అంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.
తన తండ్రి నిర్మాతలు చెల్లించేంత వరకు వేచి ఉండేవారన్నారు. తండ్రికి సినిమా ప్రాజెక్టులు ఉండని రోజులు కూడా వచ్చాయన్నారు. ఒక్కోసారి 10 నెలల గ్యాప్ కూడా వచ్చేది. చిన్న పేమెంట్లు రూ. 25000 కూడా చెల్లించలేని మా అమ్మ స్థితి నన్ను బాధించింది. అప్పుడు ‘అసలు నేను ఏమి చేస్తున్నాను’ అనే ఆలోచన నన్ను తరచి చూసుకునేలా చేసిందన్నారు సూర్య.
‘‘నేను ఓ ఫ్యాక్టరీ నాదంటూ పెట్టాలనుకున్నాను. ఆ ఆలోచన నాకు రాగానే నా తండ్రి కోటి రూపాయలు పెట్టుబడి పెడతాడనుకున్నాను. అనుభవం కోసం నేనో ఫ్యాక్టరీలో పనిచేశాను. కానీ మా అమ్మతో మాట్లాడాక నా ఆలోచనా ధోరణి మారిపోయింది’’ అన్నాడు నటుడు సూర్య.
తన తండ్రి వారసత్వ కారణంగా తనకు అనేక అవకాశాలు వచ్చాయన్నారు. కానీ తానెన్నడూ కెమెరా ముందుకు రావాలని, సినిమాల్లోకి రావాలని అనుకోలేదన్నాడు సూర్య.
‘‘కానీ నేను డబ్బు సంపాదించడానికే సినిమా రంగంలోకి రావలసి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మ అప్పు చెల్లించేందుకు నేను సినిమాల్లోకి వచ్చాను. సూర్య గా నేను సినిమా రంగంలోకి ప్రవేశించాను. నేను తొలి షాట్ చేసేప్పుడు వేలాది మంది ప్రజలు నా దగ్గరలో నిల్చుని ఉన్నారు. కానీ వారెవరికీ నేనెవరో తెలియదు. తరాలు మారాయి. కానీ నాకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. నాకిప్పుడు 49 ఏళ్లు’’ అంటూ చెప్పు కొచ్చాడు సూర్య.