నగరంలో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. స్క్వేర్ అండ్ యార్డ్ ఫామ్‌హౌస్, విల్లాల పేరుతో కోట్లలో మోసానికి పాల్పడింది. ఎపిలోని విశాఖకు చెందిన అల్లం నాగరాజు అనే బాధితుడి ఫిర్యాదు మేరకు సంస్థపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు సంస్థ డైరెక్టర్లు బైరా చంద్రశేఖర్, వేములపల్లి జాన్వి, గరిమెళ్ల వెంకట అఖిల్ , రెడ్డిపల్లి కృష్ణచైతన్యలని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్‌లు, విల్లాల పేరుతో ప్రజల వద్దనుండి రూ. 24 కోట్లు వసూలు చేసినట్టు సమా చారం. ఫామ్‌హౌస్‌లు, విల్లాలపై పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్ ఆశ చూపినట్టు తెలుస్తోంది. అతని మాటలు నమ్మి 120 మంది స్క్వేర్ అండ్ యార్డ్ సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టారు. గత కొద్ది నెలలుగా చంద్రశేఖర్ నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆఫీసు వద్దకు వచ్చి నిలదీ యగా తన వద్ద డబ్బులు లేవంటూ చంద్రశేఖర్ చేతులు ఎత్తేశాడు.
మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా స్క్వేర్ అండ్ యార్డ్ సంస్థపై కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. కాగా స్క్వేర్ అండ్ యార్డ్ వినియోగదారులు/పెట్టుబడిదారులను ఆకర్షించడంలో తనదైన రీతిలో చాతుర్యాన్ని ప్రదర్శించింది. ఎవరైనా తమ సంస్థలో రూ.17 లక్షలు పెట్టుబడి పెడితే 100 నెలల పీరియడ్‌కు ప్రతి నెలా రూ.30,000 ఇస్తామని, అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్, తిరుమలగిరి విలేజ్‌లో రెండు గుంటలు (267 స్కెర్ యార్డ్) వ్యవసాయ భూమి అందజేస్తామని నమ్మబలికింది. ఇంతటితో ఆగలేదు. ఆ భూమలో గంధపు చెక్కల ప్లాంట్ వేసుకోవచ్చునని, 1315 ఏళ్ల తర్వాత ఆ చెట్లను అమ్ముకోవడం ద్వారా 50 శాతం లాభాలు గడించవచ్చునని ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందించింది. దీంతో పలువురు వినియోగదారులు/పెట్టుబడిదారులు సదరు సంస్థ ఉచ్చులో పడిపోయారు.
ముందు వెనక ఆలోచించకుండా ఆయాచిత రీతిలో డబ్బు వస్తుందని భావించిన వారంతా పెట్టుబడి పెట్టేశారు. పెట్టుబడి తీసుకున్న సదరు సంస్థ మాత్రం ఆనక తానిచ్చిన ఏ ఒక్క దానిని అమలుపర్చకపోగా ప్రతీసారి తమను సంస్థ చుట్టూ తిప్పించుకోవడం ప్రారంభించింది. ఇక లాభం లేదనుకుని సంస్థ డైరెక్టర్లను నిలదీయడంతో తమ వద్ద డబ్బులు లేవని చెప్పడంతో నిర్ఘాంతపోవడం వినియోగదారులు/పెట్టుబడిదారుల వంతైంది. ఈ విషయమై సైబరాబాద్ ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌లో ఓ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. వెనువెంటనే సదరు సంస్థకు సంబంధించి నలుగురు డైరెక్టర్‌లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.