మనతెలంగాణ / హైదరాబాద్ : మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణాలో కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసిందని ఐటీ, పరిశ్రమ ల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని షూఆల్స్ ప్రతినిధులు కోరినట్టు ఆయన వెల్లడించారు. కొరియా నుంచి వచ్చిన షూఆల్స్ ఛైర్మన్ చెవోంగ్ లీతో పాటు సంస్థ ప్రతినిధులు గురువారం శ్రీధర్ బాబును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిసి 87 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కే గిగా ఫ్యాక్టరీ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచారు. అడుగు భాగాన (సోల్స్) మెడికల్ చిప్ ఉండే బూట్లు, పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటీస్, ఆర్థరైటిస్ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలు రకాల ఉత్పత్తుల తయారీ కోసం 750 ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రతిపాదించారని శ్రీధర్ బాబు వెల్లడించారు.
షూఆల్స్ అభ్యర్థన అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భారీ కర్మాగారం నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలకు, అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లకు షూ సరఫరా చేస్తారని వివరించారు. బూట్ల తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ట్యానరీలు అవసరమవుతాయని, ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి దొరుకుందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణా హబ్ గా మారుతుందని అన్నారు. బూట్ల అడుగు భాగాన జిపిఎస్ ఉండే షూల వల్ల పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా ట్రాక్ చేయవచ్చని తెలిపారు. ఈ షూ ధరించిన వారు యాక్సిడెంట్ కు గురి అయినా, మరే ఆపదలో చిక్కుకున్నా కుటుంబ సభ్యులకు సిగ్నల్స్ వెళ్లే ఏర్పాటు ఉందని వివరించారు.
5000 ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటు :
అమెరికాలోని జాన్ హాప్కిన్స్ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతో పాటు పాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాలు కేటాయిస్తే ఏషియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ హెల్త్ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు. స్మార్ట్ హెల్త్ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని వివరించినట్లు మంత్రి వెల్లడించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిపారు. షూఆల్స్ కొరియన్ బృందంలో ఇన్హీ లీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇండియా) డాంగ్ యివోప్ కిమ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జేహెన్ పార్క్ ఉన్నారు.