Friday, October 25, 2024

అదుపులేని ఆహార ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: దేశంలోని ఆహార ద్రవ్యోల్బణం ఈ ఏడాది జులైలో 5.4 శాతానికి, ఆగస్టులో 5.6 శాతానికి 13 నెలల దిగువ స్థాయికి మందగించినప్పటికీ, సెప్టెంబర్ వచ్చేసరికి అమాంతంగా 9.2 శాతానికి పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ, పట్టణ, జాతీయ స్థాయిలో జనాభా వినియోగించే ఆహార వస్తువుల రిటైల్ ధరల్లో మార్పులు బట్టి వినియోగదారుల ఆహార ధరల సూచిక (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ సిఎఫ్‌పిఐ) ఆధారంగా గత జులై, ఆగస్టు నెలల్లో ద్రవ్యోల్బణం మందగించినట్టు అంచనాగా తేలింది. జూన్ లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.08 శాతంగా నమోదైంది.

కూరగాయల ధరలు జులైలో 6.8 శాతం, ఆగస్టులో 10.7 శాతం పెరగ్గా, సెప్టెంబర్‌లో 35.9 శాతం ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తి అంతగాలేని బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పప్పుధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల ధరలు 2022 ఆగస్టు నుంచి రెండేళ్లుగా 7 నుంచి 17 శాతం స్థాయిలో స్థిరంగా ఉన్నప్పటికీ, 2023 జూన్ నుంచి 10 నుంచి 21 శాతం స్థాయిలో రెండంకెల వరకు పెరగడం ప్రారంభించాయి. కందులు, శనగలు, మినుములు, ధరలు బాగా పెరిగాయి. అదే విధంగా 2023 జులై నుంచి కూరగాయల ధరలు 20 శాతం కన్నా ఎక్కువగా అమాంతంగా పెరుగుతున్నాయి.

మరోవైపు ఖాద్యతైలాలు (వంట నూనెలు) నెయ్యి వంటి ధరలు అత్యధిక స్థాయిలో 2023 ఫిబ్రవరి నుంచి పెరుగుతున్నాయి. దిగుమతుల సుంకాలు స్వల్పంగా తగ్గించడంతో వీటి దిగుమతులు కాస్తా పెరిగాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఖాద్య తైలాలు, కొవ్వు పదార్థాల ధరలు 2.5 శాతం వరకు పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు సెప్టెంబర్ 14 నుంచి అమలు లోకి రావడంతో వంట నూనెలు, కొవ్వు పదార్థాల ధరలు రానున్న నెలల్లో మరీ ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఐదేళ్ల లో శనగల దిగుమతులను నియంత్రించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముఖ్యమైన పప్పుధాన్యాలు, చమురు గింజల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) లను 20 శాతం వరకు గణనీయంగా పెంచారు. అయితే పెసలు, నూనె గింజలు, ఆవాలు, సొయాబీన్ సాగు విస్తీర్ణం మాత్రమే క్రమంగా 13 శాతం, 34 శాతం, 9 శాతం పెరిగింది. అదే సమయంలో మిగతా ముఖ్యమైన పప్పుధాన్యాలు, నూనె గింజలు, సాగు విస్తీర్ణం తగ్గిపోయింది.

202425 ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన పప్పుధాన్యాలు, నూనె గింజలు, కనీస మద్దతు ధర 6 నుంచి 8 శాతం వరకు పెరిగింది. అయినా కొన్ని ఎంపికైన పంటల ఉత్పత్తిలో పురోగతి 2024 అక్టోబర్ 7 వరకు పరిమితంగానే ఉంది. అందువల్ల సాగు విస్తీర్ణంపై కనీస మద్దతు ధర ప్రభావం అంతగా కనిపించక అనిశ్చితి ఏర్పడింది. దీంతో ఉత్పత్తులు కూడా ఆశించినంతగా పెరగలేదు. ప్రధానమైన పప్పుధాన్యాలు, వేరుశెనగ, శనగలు, పత్తి పంటలతో పోల్చుకుంటే కందిపప్పు, శనగలు, మినుములు, సొయాబీన్, పొద్దుతిరుగుడు ఉత్పత్తులు గత నాలుగు దశాబ్దాలుగా స్తంభించిపోయాయి. వీటి సాగు నీటిపారుదల లేని, మామూలు భూములకే పరిమితమైంది. ఖరీఫ్ సీజన్‌లో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం మితంగా 7 శాతం వరకు విస్తరించగా, నూనెగింజల సాగు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కేవలం 2.7 శాతమే పెరిగింది.

ప్రధాన పప్పుధాన్యాల్లో కందిపప్పు, పెసలు, సాగు విస్తీర్ణం మాత్రం బాగా పెరిగింది. మినుములు సాగు 8 శాతం వరకు పెరిగింది. ఇక నూనె గింజల సాగును పరిశీలిస్తే వేరుశెనగ సాగు మాత్రం 9 శాతం వరకు పెరగ్గా, సొయాబీన్ సాగు అక్టోబర్ 7 వరకు కేవలం 2.5 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. పంటలను కనీస మద్దతు ధరకు ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు వైపు రైతులు దృష్టి పెట్టడం లేదు. గత రెండేళ్లుగా నూనెగింజలు ముఖ్యంగా సొయాబీన్, పొద్దుతిరుగుడు సాగు బాగా పడిపోయింది. వీటి హోల్‌సేల్ మార్కెట్ అంతగా అనుకూలం లేదు. ప్రపంచ మార్కెట్‌లో పప్పుధాన్యాల లభ్యత పరిమితంగా ఉండటంతో పప్పుధాన్యాల దిగుమతులు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తోంది. వాతావరణ మార్పులకు తగ్గట్టు సాంకేతిక విధానాలు, ఇతర ప్రక్రియలు అవలంబించి పంటల దిగుబడులను మరింత పెంపొందించడం తప్పనిసరి. నేల, నీరు తదితర సహజ వనరులను చాలా పొదుపుగా సమర్థంగా వినియోగించుకుంటేనే సత్ఫలితాలు వస్తాయి. అలాగే రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెటింగ్ విధానాలు రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయడం కూడా ఎంతో అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News