Friday, October 25, 2024

బిజెపికి కళ్లెం వేసే ఉంచాలి!

- Advertisement -
- Advertisement -

దేశ పాలనా రథానికి ఏ గుర్రాలు కట్టాలో దేశ పౌరులకు బాగా తెలుసు. మోడీ పదేళ్ల పాలన చూశాక ఓటర్లకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. బిజెపి చేతిలో పగ్గాలు పెట్టినా పూర్తిగా వదిలేయకూడదని వారు అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు. అందుకే గతంలో కన్నా ఈసారి లోక్‌సభలో 63 సీట్లు తగ్గించి అదుపులో ఉంచుకున్నారు. దేశంలోని రెండు ప్రధాన పార్టీల శక్తియుక్తులను సరిగ్గా అంచనా వేసిన జనం మోడీ జట్టును గెలిపించి, ఆయనకు ఎంత బలాన్ని ఇవ్వాలో కొలత వేసి మరీ అందించారు. ఇప్పుడు ఎన్‌డిఎలోని పక్షాలు దూరమైతే మోడీ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదు. ఈ పరిస్థితి బిజెపికి గత పదేళ్లలో రాలేదు. ఇదే జనం కోరుకున్నది కూడా.

మోడీకి అన్ని విద్యలూ తెలుసు. దేశంలో ఇప్పుడు ఆయనకు సాటి రాజకీయనేత లేరని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఆయనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తులనాత్మక విశ్లేషణ చేయడం కూడా అనవసరం. కాంగ్రెస్‌లో రాహుల్‌ను మించినవారు, రాజకీయ ఉద్దండులు ఉన్నా ఆ పార్టీకి యువరాజే అన్నీ. పార్టీని నమ్ముకున్నందుకు ఆయన పట్టాభిషేకం కోసం నేతలందరూ తంటాలు పడుతున్నారు. అయితే ప్రపంచ స్థాయి నాయకత్వ సూచీల ప్రకారం మోడీ దరిదాపుల్లో కూడా రాహుల్ కనబడడం లేదు. రాజకీయ క్రీడల్లో మోడీ మైదానం అంచుల దాక వెళ్లి అనుకున్నది సాధించగలరు. ఆ సామర్థ్యం ఉన్నవారు బిజెపిలో కాని, దేశంలో కాని మరొకరు లేరనే చెప్పాలి.

అయితే మోడీ లక్ష్యాలు వేరు. ఆయనకు పూర్తి మెజారిటీ ఇచ్చిన పదేళ్ల కాలం లో ఆయన ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం, బలంగా ఉన్నవాటిని ప్రైవేటుపరం చేయడం జరిగింది. పూర్తిగా పారిశ్రామికవేత్తల అనుకూల పాలన కొనసాగింది. ఆయనకు అదెంతో సంతృప్తిని ఇచ్చి ఉండాలి. మరో వైపు ఆ కాలంలో హిందూ మత ఛాందసం విర్రవీగింది. దళితులకు, మైనారిటీలకు రక్షణ కరువైంది. ఆ చర్యలను మోడీ ఎన్నడూ ఖండించలేదు. వారు ఆ హద్దుల్లో ఉండాల్సిందే అని ఆయన కూడా భావించి ఉంటారు. మోడీ సంపూర్ణంగా అగ్రకుల హిందువుల పక్షపాతి అని కొత్తగా రుజువు పరిచే అవసరం లేదు. జనాభాలో 2% ఉన్న అగ్రకులాలకు ఆయన ఇడబ్ల్యుఎస్ పేరిట 10% రిజర్వేషన్లు కల్పించడం బహుజన సమ్మతంకాదు. ఇక సబ్ కా వికాస్ అన్నది నామమాత్ర నినాదమే.

ఆయన పాలనలో ముస్లిం లు ఏమాత్రం సంతోషంగా లేరు. దళితులు కులనిమ్నతకు కట్టివేయబడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన పరిణామాలను ఇటీవలి జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో చూశాం. ట్రిపుల్ తలాక్ రద్దు అనేది తమ సాంప్రదాయిక వ్యవహారాల్లో వేలు పెట్టడమే అని ముస్లిం సమాజం భావిస్తోంది. పూర్తి స్వేచ్ఛను ఇస్తే ఇలాంటి ఇబ్బందులు మరిన్ని తప్పవని సామాన్య జనం గ్రహించింది. బిజెపిని భయంలో ఉంచుకోకపోతే తమకు నష్టమే అని వారికీ తెలుసు. దీని ప్రభావం 2024 సాధారణ ఎన్నికల్లోనే కాకుండా ఆ తర్వాత జరిగిన, జరగబోయే ఎన్నికల్లో కూడా కనబడుతుంది. హర్యానాలో గెలుపు వ్యూహ ఫలితమే కానీ నిజమైన విజయం కాదు. ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్యన సీట్ల సర్దుబాట్లు కుదరక ఎవరికివారు పేరాశపడడంతో ఇద్దరి కొంపమునిగింది. ఇక నవంబర్‌లో జరగబోయే జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మోడీ పాలన కన్నా ఆయన ప్రతిష్ఠకు పరీక్షగా చూడాలి. ఈ రెండు రాష్ట్రాల్లో మోడీ 2.0 పాలనలో సాగిన రాజకీయ విన్యాసాన్ని ఆయన రాజకీయ చాణక్యనీతికి పరాకాష్ఠగా భావించాలి.

కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నపుడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు విలువే లేకుండా పోయింది. ఇప్పుడు సీను మారిపోయింది. ఒకనాడు లెక్కలోకి రాని చంద్రబాబు ఇప్పుడు మోడీని ఆడుకొనే దశకు చేరిపోయాడు. ఇలా మోడీకి పగ్గాలు పడాల్సిందే! ఈ పరిస్థితికి లోలోన మదనపడుతున్న మోడీ తన గత వైభవాన్ని తిరిగి చేరుకోవాలని తీవ్రంగా కోరుకుంటున్నారు. ఒకరు పంచన బతికే బతుకు ఆయనకు ఇష్టముండదు. జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా ఎన్‌డిఎ కూటమికి అనుకూలత తక్కువే. అక్కడ కాంగ్రెస్ కూటమికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కేజ్రీవాల్ సానుభూతి పవనాల ఆశతో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాడు. వీటి ఫలితాలు ఎలా ఉన్నా దేశంలో ఓటర్లను తిరిగి తనవైపు తిప్పుకోవడానికి మోడీ కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. కేవలం మతం, భక్తి భావనలు హిందూ ఓట్లను గంపగుత్తగా రాబట్టలేవని అద్వానీ కాలం నుండే రుజువు అవుతోంది. అయోధ్య ఆలయానికి రూ. 3500 కోట్లు అర్పించిన జనం అదే చోట బిజెపిని గెలిపించకపోవడం ఆ పార్టీకి చక్కని గుణపాఠమే. ఉన్నంతలో హిందూ ఓటు బ్యాంకు చెక్కుచెదరదు. అయితే అదొక్కటే పార్టీని గట్టెకించలేదు. అందుకే ప్రజలను ఆకర్షించే నిర్ణయాలు కొన్నయినా తీసుకోవాలి అనే ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది.

తన ప్రాభవాన్ని వెనక్కి తెచ్చుకొనేందుకు మోడీ గత నిర్ణయాల సవరణ బాట పట్టారు. వాటిలో ప్రధానమైన వాటిని పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు లో ఆమోదించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, సెప్టెంబర్‌లో ప్రకటించిన 70 ఏళ్లు పైనబడినవారికి ఆరోగ్యం బీమా పథకం ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపేవే. అయితే ఈ రెండు పథకాలు బిజెపి ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుతాయి. 2004 నుండి పాత పింఛను విధానం కోల్పోయినందుకు ఉద్యోగ వర్గాలు చాలా నిరాశలో ఉన్నాయి. జాతీయ పింఛన్ విధానం ఉద్యోగుల విశ్రాంత జీవితానికి పూర్తి భరోసా ఇవ్వలేదు. మధ్యే మార్గంగా రూపొందించిన సమీకృత పింఛన్ విధానం కొంత ఆశాజనకంగా ఉంది. 50% చివరి జీతం, 60% ఫ్యామిలీ పెన్షన్, 10 ఏళ్ల సర్వీసుకు రూ.10 వేల పెన్షన్ దీనిలోని ప్రత్యేకతలు. ఇక 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా ఇప్పటికే ఎంతో ప్రచారంలోకి వెళ్ళింది. దేశమంతా దీన్ని సంబరంగా ఆహ్వానిస్తున్నారు.

ఎలాంటి నిబంధనలు లేకుండా ఆ వయస్కులందరికీ ఇది వర్తిస్తుంది అనడమే దీని ప్రధాన ఆకర్షణ. బీమా ఆశించే సీనియర్ సిటిజన్ల కుటుంబాలు అన్నీ మోడీకి బాసటగా నిలుస్తాయి. దేశంలోని 90 కోట్ల ఓటర్లలో 30 కోట్లకు పైగా వీటి పరిధిలోకి వస్తారు. అయితే సామాన్య ప్రజలపై ప్రేమతో ఈ సంక్షేమ పథకాలను మోడీ స్వయంగా ప్రకటించినవిగా భావించకూడదు. కోల్పోయిన ఓట్ల సంఖ్యను సరిచేసుకునే మోడీ ప్రణాళికలో భాగంగానే చూడాలి. ఒకప్పుడు మోడీ ఓటరు గుర్రంపై కూచొని కర్రకు గడ్డి కట్టి అందుకో అన్నట్లు పరిగెత్తించారు. ఇప్పుడు సీను రివర్స్ అయి ఓటరు మోడీ నాడి పట్టుకున్నాడు. సమర్థుడి ఆలోచనలను జన సంక్షేమానికి మళ్లించడానికి కళ్లెమే బ్రహ్మాస్త్రం.

బి.నర్సన్

9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News