Friday, October 25, 2024

ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై మరో భూకుంభకోణం ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్‌కు మరో షాక్ తగిలింది. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై మరో భూ కుంభ కోణం ఫిర్యాదు తెర పైకి వచ్చింది. దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. 840 మంది ప్లాట్ ఓనర్స్‌ను అమాయకుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని మోసం చేశాడన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ప్లాట్ ఓనర్ల పేర్లు ఉన్నప్పటికీ ఇతరుల పేర్ల మీద అక్రమంగా ధరణిలో చేర్చి భూములను ఇతరులకు బదులాయించినట్టు ఇడికి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు

. అమోయ్ కుమార్‌పై ప్రస్తుతం ఇడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును సైతం పరిగణలోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఇక అటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ప్రభుత్వ భూమి వట్టినాగుల పల్లి, కాజాగూడా లోని పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పన్నంగా అప్పగించాడని అమోయ్ కుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి. మొ త్తం నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలాగా అమోయకుమార్ భూముల కేటాయింపు జరిపాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూకేటాయింపుల వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఈ భూముల కేటా యింపు ద్వారా లబ్ధి పొందిన డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తున్నారు.

మూడోరోజు విచారణలో ఐఎఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై ఇడి ప్రశ్నల వర్షం
అమోయ్ కుమార్ ఈడీ విచారణ మూడోరోజు కొనసాగింది. మూడోరోజు (శుక్రవారం) కూడా ఉదయం 9 గంటలకు ఇడి కార్యాలయానికి హాజరైన అమోయ్‌కుమార్‌ను ఇడి అధికారులు ప్రశ్నించారు. దాదాపు 8 గంటల పాటు అమోయ్ కుమార్‌ని ఇడి అధికారులు విచారించారు. మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నెంబర్ 181,182 భూములపై విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారు 70 ఎకరాల భూదాన్ భూములు అన్యాక్రాంతంపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు గతంలో కలెక్టర్ గా పని చేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములతోపాటు, భూదాన్ భూములను గత ప్రభుత్వ నాయకులను

అడ్డం పెట్టుకొని అతి తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అమోయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయా జిల్లాలలోని రైతులను బెదిరించి వారి భూములను బలవంతంగా లాక్కున్నారని పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇడి రంగంలోకి దిగి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. గత రెండు రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘ విచారణ జరిపి అమోయ్ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా అమోయ్ కుమార్ నుండి మరింత సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News