Saturday, October 26, 2024

సమగ్ర కులగణనతోనే సమాజ గమనం

- Advertisement -
- Advertisement -

జనగణనలో కులగణన గత కొంత కాలం వాద, వివాదాలకు నెలవైంది. జనగణన జరగాల్సిందే కానీ, అందులో కులాలవారీగా గణన అక్కర లేదనే వాళ్ళున్నారు. అయితే కులగణన వల్లనే దేశ ప్రగతి అంటే ప్రజలందరి పురోగతి అర్థమవుతుందనే అభిప్రాయం బలంగా ఉంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు ఈ నినాదాన్ని ఎన్నికల హామీగా కూడా మార్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ప్రధాన డిమాండ్‌గా, హామీగా ముందుకు తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కులగణన తమ తక్షణ కార్యక్రమంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందుకనుగుణంగానే గత కొన్ని రోజుల క్రితం కులగణనకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది.

ముందుగా బి.సి జనగణనగా భావించారు. కానీ అది ఇప్పుడు పూర్తి జనగణన జరుపుతామని నిర్ణయించారు.
నిజానికి కేవలం బి.సి జనగణన జరిపితే సామాజిక చిత్రం మనకు అర్ధంకాదు. అన్ని కులాల, వర్గాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విషయాలతో కూడిన గణన జరగడం వల్ల సమగ్ర సమాజ గమనం అర్ధం కాగలదు. తెలంగాణ రాష్ట్రం 1948కి ముందు హైదరాబాద్ సంస్థానంలో ఉండింది. ఇందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలు ఉండేవి. అందులో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు లేవు. అయితే రంగారెడ్డి జిల్లాకు బదులుగా అత్రాఫ్ ఇ బాల్టా అనే పేరుతో ఒక ప్రత్యేకమైన జిల్లా ఉండేది. ఇది పూర్తిగా నిజాం నవాబుల ప్రత్యక్ష ఏలుబడిలో ఉండేది. మిగతా జిల్లాల్లో జాగీర్దార్లు, జమీందారుల పాలన ఉండేది. హైదరాబాద్ స్వతంత్ర సంస్థానంలో స్వతంత్రంగా ఉండేది.

అయితే కొన్ని విషయాల్లో బ్రిటిష్ ఇండియా విధానాలను అనుసరిస్తుండేది. అందులో ఒక సెన్సస్ (జనగణన) బ్రిటిష్ ఇండియాలో జనగణన 1881 నుంచి క్రమం తప్పకుండా ప్రతి పది సంవత్సరాల కోసారి జరిగేది. అదే విధానాన్ని హైదరాబాద్ అమలు చేసింది. 1881 కి ముందు అంటే బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి సారిగా 1802లో ఢాకాలో సెన్సస్ (జనగణన) నిర్వహించారు. ఆ తర్వాత వివిధ పట్టణాల్లో, వివిధ సందర్భాల్లో వివరాలను సేకరించారు. ‘సెన్సస్’ అనేది లాటిన్ పదం. దాని అర్థం అంచనా.

నిజానికి ‘సెన్సస్’ అంటే కేవలం జనగణన మాత్రమే కాదు. వనరులు, పశుసంపద, నీటి వనరులు, భూములు, పరిశ్రమలు, అడవులు ఇంకా అనేక రకాలైన విషయాలు ఇందులో ఉంటాయి. అయితే, సెన్సస్ అనే పదాన్ని జనగణన అనే పదానికి పర్యాయపదంగా వాడుతున్నాం. 1881 నుంచి జనాభా లెక్కలు క్రమ పద్ధతిలో మొదలైనప్పుటికీ, 1931 లో మాత్రమే కులగణన జరిపారు. అందులో ముందు మతాలకు సంబంధించిన లెక్కలు ఉండేవి. 1911 నుండి ఆనాడు అంటరాని కులాలుగా పిలువబడుతున్న కులాలను ఒక ప్రత్యేక కేటగిరి కింద నమోదు చేశారు.

హైదరాబాద్ రాజ్యం దళిత నాయకుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భాగరెడ్డి వర్మ నాయకత్వలోని ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అభ్యర్థన మేరకు ఇక్కడ ఉన్న మహర్, మాల, మాదిగ కులాలను ఆది హిందూవులని ప్రత్యేకంగా నమోదు చేశారు. భారతదేశంలో లాగానే హైదరాబాద్‌లో కూడా ‘సెన్సస్’లో కులగణన జరిగింది. అందులో దాదాపు 44 హిందూ కులాలను, రెండు ఆది హిందూ కులాలను, ఆరు ఆదివాసీ తెగలను నమోదు చేశారు.

1931 సంవత్సరంలో జరిగిన జనగణనలో కులగణన చాలా విషయాలను నమోదు చేసింది. వారి జీవన విధానం, అక్షరాస్యత, జీవనోపాధి, ఉద్యోగాలు, వివాహా వ్యవస్థలను ఇందులో పేర్కొన్నది. అంతేకాకుండా మతపరమైన, భాషాపరమైన వివరణ, జనన, మరణాలకు సంబంధించిన విషయాలను పొందుపరిచారు. బ్యాంకులు, పరిశ్రమలు వాటి యాజమాన్య వివరాలు కూడా ఇందులో వివరించారు.

ప్రస్తుతం మన రాష్ట్రంలో జరగబోయే కులగణన గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులో ఎవరి జనాభా ఎంత ఉంటుందో తెలుస్తుందనే ఉత్సుకత చాలా మందిలో ఉంది. అయితే 1931 లో ఆ వివరాలన్నింటినీ జనగణనలో నమోదు చేశారు.

అప్పుడున్న తొమ్మిది జిల్లాలు, హైదరాబాద్, అత్రాఫ్ ఇ బాల్టా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో జనాభా 75,54,598.అందులో ప్రధాన కులాల జనాభా, వారి శాతాన్ని మనం ఇందులో పరిశీలించవచ్చు. బ్రాహ్మణులు 1,43,659, ఇది మొత్తం జనాభాలో 1.90 శాతం. వైశ్య జనాభా 2,24,660, వీరి శాతం 2.97. అదే విధంగా కాపు జనాభా 7,94,043 కాగా, వీరి శాతం 10.51 శాతం. ఇక్కడ గమనించాల్సిందేమంటే 1931 జనాభా లెక్కలో రెడ్ల ప్రస్తావన లేదు. అందరూ కాపులుగానే చెప్పుకున్నారు. వెలమల జనాభా 51,988 కాగా, వారి శాతం 0.68 గా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఒబిసి కులాల్లో తెలగ ఒకటి. ఇందులో రెండు కులాలను చేర్చారు. ఒకటి మాత్రాసి, రెండోది మున్నూరు. మున్నూరు అని అన్నారు కానీ మున్నూరు కాపు అనలేదు. వారిద్దరి జనాభా 8,59,874, వారి శాతం 11.38 శాతం. అదే విధంగా కలాల్ అంటే గౌండ్లు. వారి జనాభా 3,73.341 కాగా, వారి శాతం 4.94. మరొక ప్రధాన ఒబిసి కులం. యాదవులు వారి జనాభా 5,10,576, జనాభా శాతం 6.75. అంతేకాకుండా కురుమలను వేరుగా చూపెట్టారు. వారి జనాభా 1,64,075, జనాభా శాతం 2.17 అని పేర్కొన్నారు. వీరితోపాటు, పద్మశాలీలను జులాహిలుగా నమోదు చేశారు. ఇందులో సాలె, దేవాంగులను చేర్చారు. వారి జనాభా 2,95,445 కాగా, జనాభా శాతం 3.91గా నమోదయింది.

ఇక ఈ రోజు మనం ఎస్‌సి కులాలుగా చెప్పుకుంటున్న ఆది హిందువులలో మాల, దాని ఉప కులాల జనాభా 4,81,722 కాగా, జనాభా శాతం 6.37, మాదిగ, దాని ఉప కులాల జనాభా 7,72,680 అయితే జనాభా శాతం 10.22 శాతం నమోదు చేశారు. ఆదివాసుల్లో గోండుల జనాభా 1,11,367 అయితే దాని జనాభా శాతం 1.47 కాగా, లంబాడాల జనాభా 2,02,423 అయితే జనాభా శాతం 2.67.
ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. బోగం అనే పేరుతో ఒక కులం నమోదైంది. దాని జనాభా దాదాపుగా లేదు. అయితే ఈ రోజు ఆ సామాజిక వర్గం ఉనికిలో లేదు. రాబోయే కుల గణనలో ఆ కులం పేరు ఉండే అవకాశం లేదు.

మరొక కులం తేలి అందే గాండ్లు నూనె తీసే వాళ్ళు. గత ముప్పై సంవత్సరాల క్రితం గ్రామాల్లో గానుగతో నూనె తీసే వృత్తి కనుమరుగైంది ఈ కుల గణనలో ఆ సామాజిక వర్గం ఉనికి ఎట్లా ఉంటుందో చూడాలి.
ఇక ఆనాడు అక్షరాస్యత విషయానికి వస్తే, బ్రాహ్మణుల్లో అక్షరాస్యత అధికంగా ఉంది. మొత్తం జనాభాలో ఈ కులం శాతం కూడా చాలా తక్కువ. బ్రాహ్మణులలోనే అక్షరాస్యత 47.8 శాతం, అందులో స్త్రీల శాతం 4.67, కాపుల్లో 0.30, కోమట్లలో 16.42 శాతం, వెలమల్లో 14.44 శాతం మిగతా ఏ కులంలో కూడా ఒక్క శాతం దాటలేదు. తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత 1931 జనాభా లెక్కలతో సరిపోల్చుకుంటే ఈ వందేళ్లలో జరిగిన ప్రగతి మనకు అర్థం కాగలదు. ఇటువంటి విస్తృతమైన కులగణన 1931 తోనే ఆగిపోయింది. మళ్ళీ వందేళ్ళ తర్వాత ఇప్పుడు మనం దానిని చూడబోతున్నాం. జనాభా లెక్కల్లో కుల గణన వల్ల ఆర్థిక, సామాజిక రంగాల్లో ఏఏ కులాలు ఎటువంటి ముందడుగు వేశాయి. ఏఏ కులాలు వెనుకబడిపోయాయి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. చాలా కుల సంఘాలు తమ తమ కులాల జనాభాను ఎక్కువ చేసి చెప్పుకోవడం అలవాటైంది. దానితో అటువంటి పొరపాట్లకు తెరపడగలదు. గత చరిత్రను అర్థం చేసుకోవడానికి, వర్తమానాన్ని సరిచూసుకొని, భవిష్యత్తు నిర్మించుకోవడానికి వీలుగా 1931 జనాభా లెక్కల సారాన్ని మీ ముందు ంచాను.

దర్పణం

మల్లెపల్లి లక్ష్మయ్య

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News