Saturday, November 23, 2024

‘హగ్’లు సరే… ఆచరణ ఉంటుందా!

- Advertisement -
- Advertisement -

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఉద్రిక్తతలను తొలగించడానికి, భారత్ చైనా దేశాలు దోస్తితో గస్తీ సాగించడానికి ఒప్పందం కుదరడం రెండు దేశాల మధ్య తిరిగి మైత్రికి మొదటి అడుగు పడినట్టే. బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్నేహపూర్వకంగా కలుసుకోవడం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం చూస్తే జిన్‌పింగ్ విధానాల్లో ఏదో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే సరిహద్దు వివాదాలపై మరిన్ని చర్చలు జరగాలన్న అభిప్రాయం వీరి ప్రకటనల్లో వ్యక్తమైంది. వాస్తవాధీన రేఖ గస్తీ విషయంలో మాత్రమే ఒక ఒప్పందం కుదిరింది తప్ప మిగతా కీలకమైన అంశాల్లో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు వెలువడలేదు.

సామ్రాజ్య విస్తరణ కోసం ‘రణ’ దాహంతో తపించే చైనా మాటల్లో ఎంతవరకు ఆచరణ ఉంటుందో నమ్మలేం. సరిహద్దు సమస్యకు పూర్తి పరిష్కారం కుదిరే వరకు వాస్తవాధీన రేఖను ఉభయ దేశాలు పరిరక్షించుకోవాలన్న ఒప్పందం ఇదివరకే ఉన్నప్పటికీ ఆ ఒప్పందాన్ని చైనా ఖాతరు చేయలేదన్నది చారిత్రక సత్యం. ఇప్పుడు అనేక కారణాల వల్ల భారత్‌కు స్నేహ హస్తాన్ని అందించడానికి ముందుకు వచ్చింది. చైనాలో ఆర్థిక పరిస్థితి మందగించడంతో పొరుగు దేశాలతో వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 102 లక్షల కోట్ల మూలధనంతో చేపట్టిన జాతీయ మౌలికసదుపాయాల పైప్‌లైన్ ప్రాజెక్టుకు చైనా నుంచి తగిన సహాయం లభిస్తుందని భారత్ ఆశిస్తోంది. పొరుగు దేశాల భాగస్వామ్యంతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుకు చైనా నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుందో చూడాలి.

దేశంలో కీలకమైన ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు చైనా సహకారంతో ముడిపడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలనే ప్రకటించారు. సరిహద్దు దేశాల పెట్టుబడులపై ఆంక్షలను కూడా సడలిస్తాని ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాల దిశగా మన దేశానికి చైనా నుంచి ఊతం ఇస్తుందన్న ఆశలు మొలకెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులకు అడ్డంకులు, ఆంక్షలు తగ్గించినా, చైనా నుంచి మన దేశ పరిశ్రమలకు సాంకేతిక పరిజ్ఞానం అందడం లేదు. అయితే చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌లోని టెలికమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, ప్లాస్టిక్స్, సోలార్ ఎనర్జీ , ఆటోమొబైల్ వంటి ముఖ్యమైన పరిశ్రమలకు చైనాతో సంబంధాలు ఆసరా కల్పిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్టు ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది.

ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయితే అనిశ్చితి పరిస్థితులు తగ్గుతాయి. ముడివనరులు, విడిభాగాలు సజావుగా సరఫరా అవుతాయి.202324లో చైనాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 118.39 బిలియన్ డాలర్ల వరకు జరగ్గా, అందులో చైనా నుంచి రూ. 101.73 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. అదే సమయంలో మన దేశం నుంచి చైనాకు కేవలం 16.66 బిలియన్ డాలర్ల ఎగుమతులు మాత్రమే జరగడం ఆలోచించవలసిన విషయం. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడితే ఉత్పాదకతతో ముడిపడిన పెట్టుబడుల పథకం (పిఎల్‌ఐ)లో పెట్టుబడులు పెట్టడానికి చైనా సంస్థలు సిద్ధపడతాయి. ఫలితంగా స్థానికంగా వివిధ పరిశ్రమల అభివృద్ధి ప్రమాణాలకు తగ్గట్టు మన దేశంలోని ఎంఎస్‌ఎంఇ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) సంస్థలు, వాటి అనుబంధ పరిశ్రమల విస్తృత అభివృద్ధికి దోహదం చేస్తాయి.

దీని వల్ల ఉద్యోగాల కల్పన పెరగడమే కాక, పారిశ్రామిక వృద్ధికి అవకాశం కలుగుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్లలో కావలసిన విడిభాగాలను అమర్చాలంటే ఆ విడిభాగాలు 90% చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇప్పుడు చైనా పరిశ్రమలు ఈయూనిట్లపైనే దృష్టి కేంద్రీకరిస్తాయి. ప్రస్తుత పరిణామాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించినా, చైనా పెట్టుబడులు మన దేశంలోకి వెల్లువలా వస్తాయా అన్నదే ప్రశ్న. చారిత్రకంగా పరిశీలిస్తే భారత్‌లో ఇతోధికంగా చైనా పెట్టుబడులు పెట్టే అనుభవాలు ఎప్పుడూ లేవు ఈ విషయం లో చైనా చొరవ ఎప్పుడూ పరిమితమే.

ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావలసిన పరిశ్రమలకు పెట్టుబడులు భారీగా పెట్టడానికి చైనా ఎంతవరకు ముందుకు వస్తుందో చెప్పలేం. సంఘర్షణలు జరగని పూర్వకాలంలో కూడా భారత్‌లోని పారిశ్రామిక ప్రగతి కోసం ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వంటి కీలకమైన రంగాలకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి చైనా ముందుకు రాలేదు. చైనా ఎగుమతులపై అత్యధికంగా మనం ఎందుకు ఆధారపడవలసి వస్తుందో సమీక్షించుకోవలసి ఉంది. దీనికి దారితీసే మౌలిక వనరుల కొరత, నిపుణుల లభ్యత, తగిన పెట్టుబడులతో తయారీ పరిశ్రమల ఏర్పాటు ఇవన్నీ సాధ్యమైతేనే అనుకున్న ఫలితాలు లభిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News