కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డు మీదకు రావటానికి సిఎం రేవంత్‌రెడ్డి వైఖరే కారణమని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పి.సబిత ఇంద్రారెడ్డి ఆరోపించారు. హోంశాఖ నిర్వహిస్తోన్న రేవంత్ ఫెయిల్ అవ్వటంతోనే పోలీస్ కుటుంబాలు బయటకు వచ్చాయని అన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఎంఎల్‌ఎ సునీతా లకా్ష్మరెడ్డి, ఎంఎల్‌సి వాణీదేవి, మాజీ ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్‌లతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… రక్షకభటులే న్యాయం కావాలని రోడ్డు ఎక్కటం బాధాకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు రోడ్డు ఎక్కటం చరిత్రలోనే మెదటసారి అని, ప్రజా పాలన అంటే.. ఇదేనా రేవంత్ రెడ్డి..? అని ప్రశ్నించారు.
తెలంగాణలో హోంమంత్రి లేకపోవటంతోనే కానిస్టేబుళ్ల బాధ ఎవరకి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. యూనిఫాం వేసుకుని దర్నాలు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో వచ్చిందని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమని చెప్పారు. ఏక్ పోలీస్ వ్యవస్థపై సిఎం రేవంత్ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 18 రోజులకు 4 రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలని తెలిపారు.పిల్లలు కూడా తండ్రులను గుర్తుపట్టని పరిస్థితులు పోలీస్ కుటుంబాలవి అని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు రాష్ట్రంలో సర్వసాధారణంగా మారాయని అన్నారు. డిజిపి స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు.
పోలీసులే నిరసన చేపట్టడం దేశంలోనే తొలిసారి : సునీతా లక్ష్మారెడ్డి
స్వాతంత్రం దేశంలో పోలీసులే నిరసన చేపట్టడం తొలిసారి అని ఎంఎల్‌ఎ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పోలీసులతో ఇళ్లలో వివిధ పనులు చేర్పిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయం ముందు రోజూ ధర్నాలు జరగటం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా..? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న తీరును చూస్తుంటే మనస్సు కలిచి వేస్తుందని ఎంఎల్‌సి వాణీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ఘటనలు తాను చూడలేదని చెప్పారు. కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఈ విధంగా ధర్నాలు చేసిన ఘటన మాత్రం ఎక్కడ ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి వద్దనే ఈ పోలీస్ వ్యవస్థ ఉందని, ముఖ్యమంత్రి దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పోలీస్ వ్యవస్థను కాపాడుకోవాలని చెప్పారు.