టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారత టెస్టు చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 30 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా యశస్వి చరిత్ర సృష్టించాడు. కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో యశస్వి ఓ క్యాలెండర్ ఇయర్‌లో 32 సిక్సర్ల రికార్డును అందుకున్నాడు. ప్రపంచ టెస్టు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం బ్రెండన్ మెక్‌కల్లమ్ మాత్రమే యశస్వి కంటే ముందంజలో ఉన్నాడు.
మెక్‌కల్లమ్ 2014లో 33 సిక్సర్లు బాదాడు. యశస్వి ఇప్పటికే 32 సిక్సర్లు కొట్టాడు. ఇక ఈ సీజన్‌లో మరో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దీంతో మెక్‌కల్లమ్ రికార్డును బద్దలు కొట్టడం లాంఛనమే. దీంతో పాటు మరో అరుదైన రికార్డును కూడా యశస్వి నమోదు చేశాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని అందుకున్న యువ బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు. అంతేగాక ఓ క్యాలెండర్ ఇయర్‌లో సొంత గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా యశస్వి రికార్డు సృష్టించాడు.