Saturday, November 23, 2024

సైబర్ నేరాలపై జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

సురక్షిత డిజిటల్ భారత్
రూపకల్పనకు అందరూ కలిసి
రావాలి మన్ కీ బాత్‌లో మోడీ
ఆర్‌టిసి ఎండి సజ్జనార్
వీడియోను పంచుకున్న ప్రధాని

న్యూఢిల్లీ : ‘డిజిటల్ అరెస్టు’ల సైబర్ నేరానికి పాల్పడుతూ జనాన్ని లక్షం చేసుకునే వంచకుల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తన నెలవారీ ‘మన్ కీ బాత్’లో అప్రమత్తం చేశారు. అటువంటి కుంభకోణం ఎదురైనప్పుడు ‘ఆగండి, ఆలోచించండి, చర్య తీసుకోండి’ అనే మంత్రాన్ని అనుసరించవలసిందిగా ప్రజలకు ప్రధాని విజ్ఙప్తి చేశారు. ఆ చర్యలు వారికి డిజిటల్ భద్రత సమకూరుస్తాయని మోడీ స్పష్టం చేశారు. ఈ అంశంపై రాష్ట్రాలతో కలసి దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. అయితే. ఈ నేరం నుంచి స్వీయ రక్షణకు చైతన్యం కీలకం అని ప్రధాని ఉద్ఘాటించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, భగవాన్ బిర్సా ముండా 150 జయంత్యుత్సవాలను నిర్వహించాలని దేశం నిర్ణయించిందని కూడా ప్రధాని వెల్లడించారు.

సర్దార్ పటేల్ 150 జయంత్యుత్సవం ఈ నెల 31న మొదలు కానుండగా, బిర్సా ముండా జయంత్యుత్సవం నవంబర్ 15 నుంచి జరుగుతుందని మోడీ తెలియజేశారు. ఈ నెల 31న సర్దార్ పటేల్ జయంత్యుత్సవం దీపావళి పండగతో పాటే జరగనుండడంతో ఈ ఏడాది ‘రన్ ఫర్ యూనిటీ’ (సమైక్యత కోసం పరుగు) కార్యక్రమాన్ని మంగళవారం (29న) నిర్వహించనున్నట్లు మోడీ తెలిపారు. ఆ మహోన్నతులు ఇద్దరూ ముండా, పటేల్ వివిధ సవాళ్లను ఎదుర్కొన్నారని, కానీ వారి లక్షం ఒకటేనని, అది ‘దేశ సమైక్యత’ అని ఆయన తెలిపారు. ‘నా జీవితంలో ఎక్కువగా గుర్తుంచుకోదగిన క్షణాలు ఏమిటని మీరు నన్ను అడిగితే, నాకు అనేక సంఘటనలు గుర్తు ఉన్నాయి, కానీ వాటిలో ఒక క్షణం అత్యంత ప్రత్యేకమైనది. నిరుడు నవంబర్ 15న ఆ క్షణం చోటు చేసుకున్నది.

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్బంగా ఝార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలం ఉలిహాటు గ్రామానికి వెళ్లాను. ఆ పర్యటన నాపై అమిత ప్రభావం చూపింది’ అని మోడీ తెలియజేశారు. ఆ పవిత్ర ప్రదేశంలో తన శిరస్సు వంచి ప్రణామం చేసిన తొలి దేశ ప్రధాని తానేనని మోడీ చెప్పారు. ‘ఆ క్షణంలో స్వాతంత్య్రోద్యమ శక్తిని గ్రహించడమే కాకుండా ఈ భూమి బలంతో అనుసంధానమయ్యే అవకాశం కూడా నాకు కలిగింది’ అని ఆయన తెలిపారు. ఈ మహోన్నత వ్యక్తుల 150వ జయంత్యుత్సవాలు జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఈ ప్రచార ఉద్యమానికి జీవం పోస్తుందని ఆయన అన్నారు. డిజిటల్ అరెస్టు సైబర్ నేరాన్ని ఎత్తిచూపేందుకు ఒక బాధితునికి, ఒక వంచకునికి మధ్య జరిగిన సంభాషణను కూడా ప్రధాని మోడీ తన ‘మన్ కీ బాత్’లో పంచుకున్నారు.

‘డిజిటల్ అరెస్టు ఫోన్ కాల్స్ చేసే వంచకులు కొన్ని సార్లు పోలీసులు, సిబిఐ, నార్కోటిక్స్, ఒక్కొక్కసారి ఆర్‌బిఐ వంటి వివిధ పేర్లను ఉపయోగించుకుంటూ ఎంతో నమ్మకంగా బోగస్ అధికారుల వలె సంభాషిస్తుంటారు. ‘మన్ కీ బాత్’ శ్రోతలు అనేక మంది ఆ విషయమై మనం చర్చించాలని ఆకాంక్షించారు’ అని మోడీ తెలియజేశారు. ‘ఆ వంచక ముఠాలు ఎలా పని చేస్తుంటాయో మీకు చెబుతాను. ఈ ప్రమాదకర గేమ్ ఏమిటి? దానిని అవగాహన చేసుకోవడం మీకు అత్యంత ప్రధానం’ అని ఆయన అన్నారు. అటువంటి వంచకుల విధానాన్ని మోడీ వివరిస్తూ, వారు ముందుగా వ్యక్తిగత సమాచారం సేకరించి, తరువాత తమ రెండవ యత్నంగా భయ వాతావరణం సృష్టిస్తుంటారని చెప్పారు. ‘మీరు క్రితం నెల గోవా వెళ్లారు, మీరు వెళ్లలేడా? మీ కుమార్తె ఢిల్లీలో చదువుకుంటోంది, సరేనా? వారు మీ గురించి అటువంటి సమాచారం ఎంతగానో సేకరించి మిమ్మల్ని విస్మయపరుస్తారు. రెండవ యత్నంగా భయ వాతావరణం సృష్టి& యూనిఫామ్, ప్రభుత్వ కార్యాలయం సెటప్. చట్టం సెక్షన్లు. వారు ఫోన్‌లోనే అంతగా మిమ్మల్ని భయపెడతారు.

సంభాషణ మధ్యలో మీకు ఆలోచించుకోవడానికైనా వీలు కుదరదు’ అని ఆయన వివరించారు. అటువంటి వంచకుల మూడవ యత్నం ఏమంటే సమయం గురించి ఒత్తిడి తీసుకురావడం అని ఆయన అన్నారు. ‘మీరు ఇప్పుడు నిర్ణయించుకోవలసి ఉంటుంది లేదా మీరు అరెస్టు అవుతారు? ఆ వ్యక్తులు బాధితునిపై ఎంతో మానసిక ఒత్తిడి తీసుకువస్తారు. దీనితో అతను భయపడతాడు. ప్రతి వర్గం, వయో వర్గం నుంచి జనం డిజిటల్ అరెస్టు బాధితులు అవుతారు’ అని ఆయన చెప్పారు. తాము కష్టించి ఆర్జించిన లక్షలాది రూపాయలను జనం వట్టి భయంతో నష్టపోయారని కూడా మోడీ తెలిపారు. ‘అటువంటి కాల్ ఎప్పుడు వచ్చినా భయపడవద్దు. ఏ దర్యాప్తు సంస్థ కూడా ఈ విధంగా ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా దర్యాప్తు చేయదని మీరు తెలుసుకోవాలి’ అని ప్రధాని సూచించారు.

బాధితులు జాతీయ సైబర్ విభాగం హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయాలని, అటువంటి సంఘటనలను సైబర్‌క్రైమ్.గవ్.ఇన్‌కు తెలియజేయాలని కూడా మోడీ విజ్ఞప్తి చేశారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ వంటి విధానం ఏదీ లేదని, అది కేవలం వంచన, అబద్ధం అని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఈ పని చేస్తున్న వారు, నేరస్థుల ముఠా సమాజానికి శత్రువులు అని మోడీ పేర్కొన్నారు. సైబర్ కుంభకోణాలకు వ్యతిరేకంగా ఈ ప్రచారోద్యమంలో విద్యార్థులను భాగస్వాములను చేయవలసిందని పాఠశాలలు. కళాశాలలకు కూడా మోడీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News