Sunday, October 27, 2024

పేదల భారతం బాధాకరం

- Advertisement -
- Advertisement -

కష్టజీవి కలలకు గండి
మిగిలింది పెల్లుబికే కన్నీళ్లే
ఢిల్లీలో బార్బర్ అజిత్‌తో రాహుల్

న్యూఢిల్లీ : ఎగబాకుతున్న ద్రవ్యోల్బణం, దిగజారుతున్న ఆదాయం , ఆకాశం అగాధం రీతిలో ఉంది. ఈ క్రమంలో కష్టజీవుల కలలు చెదిరిపొయ్యాయి. వారికి కలత, కన్నీళ్లే మిగిలాయి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఆయన ఓ క్షౌరశాలకు వెళ్లారు. అక్కడ గడ్డం ట్రిమ్ చేసుకుంటూ క్షురకుల సాధకబాధకాలను అడిగితెలుసుకున్నారు. రోజంతా కష్టపడుతామని, తమకు చివరికి మిగిలేదేమి ఉండదని క్షౌరవృత్తిలో ఉన్న అజిత్ భాయ్ రాహుల్‌తో కన్నీళ్ల మధ్య ఆక్రోశం వ్యక్తం చేశారు. ఆయన చెప్పిన మాటలు, కన్నీళ్లే దేశంలోని శ్రామిక, మధ్య తరగతి జనం కడగండ్లను పుటల కొద్ది తెలియచేస్తాయని రాహుల్ ఆ తరువాత ఎక్స్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కమ్మరులు, కుమ్మరులు, బార్బర్లు , వడ్రంగులు ఈ విధంగా రోజువారి పనులలో ఉండే వారి పరిస్థితి దయనీయంగా ఉందని, ఇది తాను తరచూ వారి సాధకబాధకాలను తెలుసుకునే క్రమంలో గ్రహించిన చేదు నిజం అని రాహుల్ తెలిపారు. పెరిగే ధరలు, తరిగే ఆమ్దానీతో దిక్కుతోచని స్థితిలో వారు ఉన్నారని రాహుల్ స్పందించారు.

సొంత దుకాణాలు పెట్టుకోవాలని, ఆత్మగౌరవంతో బతకాలనుకునే కోట్లాది మంది ఆశలు అడియాసలు అయ్యాయని రాహుల్ నిరసన వ్యక్తం చేశారు. పేదల ఆత్మగౌరవం దెబ్బతింటోందన్నారు. ఈ క్రమంలో వారి ఆదాయం పెంచేలా పొదుపు పథకాలు తీసుకురావల్సి ఉందన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో పేదల స్థితిగతులను మార్చేందుకు అధునాతన పరిష్కారాలు , కొత్త పథకాలు అవసరం అన్నారు. పేద వాడికి పైసా పొదుపు సౌకర్యం దక్కినా అది వారికి మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదల ఆదాయ వనరులు పెరగాల్సి ఉంది. ఇందుకు పెద్దలు ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నైపుణ్యానికి సరైన ప్రతిఫలం దక్కే వాతావరణం ఏర్పడాలని పిలుపు నిచ్చారు. సానుకూల పరిస్థితి ఉంటే కష్టించి పనిచేసే వారు ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చుఅని వ్యాఖ్యానించారు. క్షురకుడితో రాహుల్ గాంధీ ముచ్చటను తెలిపే ఫోటోలను ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక మాధ్యమంలో పొందుపర్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News