Sunday, December 22, 2024

అమెరికా ఎలక్షన్ …ఇమిగ్రేషన్

- Advertisement -
- Advertisement -

ట్రంప్ దూకుడుతో వలసదార్లలో టెన్షన్
స్థానిక వాదం విధానంతో కొత్త మలుపు ?
బర్త్ సిటిజన్‌షిప్‌పై ఎసరుకు యత్నాలు

అట్లాంటా : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో వలసవిధానం కీలక, విధానం అంశం అయింది. శ్వేతసౌధం అధినేతను ఖరారు చేసే ఎన్నికకు ఇప్పుడు తొమ్మిదిరోజులే మిగిలి ఉంది. ప్రధాన ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లు ఇమిగ్రేషన్ గురించి ఏమి మాట్లాడుతున్నారు? వారు అధికారంలోకి వస్తే వలసల ప్రక్రియ ఎటువంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరో కీలక విషయం ఏమిటంటే ఇకపై అమెరికాలో ఇమిగ్రేషన్ విధానం ఎటువంటి రూపం దాలుస్తుందనేది భారతీయ విద్యాధిక యువతకు , భారత ప్రభుత్వానికి ప్రధాన అంశం అయింది. రిపబ్లికన్ అభ్యర్థి, మరోసారి ప్రెసిడెంట్ కావడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న బిజినెస్ బిగ్‌బాస్ వంటి ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీని ఈసారి ఎన్నికల ప్రచార దశలో తన ప్రధాన అస్త్రం చేసుకున్నారు.

ఎప్పుడూ అమెరికా ఫస్ట్ , లోకల్ నినాదాలతో సాగే ట్రంప్ దేశంలోకి పెద్ద ఎత్తున వచ్చిపడుతున్న వలసల పట్ల మండిపడుతున్నారు. అమెరికాను బిగ్ బాస్కెట్ కానిచ్చేది లేదని చెపుతున్న ఆయన వాదనను తిప్పికొట్టేందుకు డెమోక్రాటిక్ పోటీదారు కమలా హారిస్ తగు వ్యూహరచనకు దిగాల్సి వచ్చింది. ఇండియా, దక్షిణాసియాకు చెందిన పలు దేశాల వీసాలకు , ఇమిగ్రేషన్ సంబంధిత ప్రక్రియలకు ట్రంప్ వస్తే షాక్ అని ఆందోళన వ్యక్తం అవుతోంది. డెమోక్రాట్ల హయాంలో ఇమిగ్రేషన విషయంలో సరళీకృత విధానాలు పాటించడం ఆనవాయితీ అయింది. అమెరికా వలసల విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళించడం జరుగుతుందని , ఇతర దేశాల యువత ఇక్కడి ఉద్యోగాల్లో ప్రవేశించడం అంత తేలిక కాదని, ఈ విధంగా తమ పాలన ఉంటుందని ప్రచార సభలలో ట్రంప్ బహిరంగంగానే తెలిపారు.

అయితే యువత ప్రతిభ, భారతీయత వంటి విషయాలపై తరచూ ఆయన అభిమానం చూపడం, ప్రధాని మోడీతో సఖ్యత వంటి కారణాలతో ఇమిగ్రేషన్ పాలసీపై ట్రంప్ పెద్దగా పట్టుదలకు వెళ్లకపోవచ్చునని కూడా కొందరు ఆశిస్తున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా సరైన ఇమిగ్రేషన్ నిర్థారణలకు లేకుండా అమెరికాలో ఉన్న వారిని గుర్తించడం జరుగుతుంది. వీరిని పెద్ద సంఖ్యలోనే వారివారి దేశాలకు పంపించడం జరుగుతుందని ట్రంప్ చెపుతూ వస్తున్నారు. తాను తిరిగి ఎన్నికైతే అమెరికా చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో అక్రమవలసదార్ల తిరుగుటపాలు తప్పవని ట్రంప్ ప్రకటించారు.

వలసదార్ల పిల్లలకు పౌరసత్వ హక్కుపై వేటు?

తాను అధికారంలోకి వస్తే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తూ వారి పిల్లలకు జన్మతః వచ్చే సిటిజన్‌షిప్ హక్కుపై కూడా వేటేస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇప్పటివరకూ వలసదార్లు అమెరికాలో ఉన్నప్పుడు సంతానం కల్గితే వారి పిల్లలు సహజసిద్ధంగానే అమెరికా పౌరులుగా నమోదు కావడం జరుగుతోంది. ఈ పద్థతికి తాను వ్యతిరేకిని అని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాలోని సగటు పౌరుడు, ఎక్కువగా ఇతర దేశాల వలసదార్ల ప్రతిభను వారి ఉద్యోగ అనుభవాన్ని వాడుకునేందుకు సముఖంగా ఉండే సంస్థలు ఇందుకు అంగీకరిస్తాయా? ట్రంప్‌ను తిరస్కరిస్తాయా? అనేది ఎన్నికల్లో తేలుతుంది. ఎక్కువగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వెళ్లిన వారి కుటుంబాలకు ట్రంప్ వ్యవహారం ఆందోళన కల్గిస్తోంది. ప్రచార తుది రౌండ్‌లో ఇప్పుడు ట్రంప్ , హారిస్ మధ్య పోటీ తీవ్రస్థాయికి చేరింది.

నువ్వానేనా దశలో ఉంది. ట్రంప్ తీసుకువచ్చిన ఇమిగ్రేషన్ అంశం అమెరికన్లకు నచ్చితే ఇది ట్రంప్ విజయానికి దారితీస్తుంది. అయితే తరాల నుంచి అమెరికన్లలో నెలకొని ఉన్న వలసవాద ఔదర్యాత గుణం కారణంగా జనం వెంటనే ట్రంప్ వైఖరికి ఆమోదం తెలియచేస్తారా? అనేది డౌటే అని ఓ విశ్లేషకుడు తెలిపారు. అమెరికాలో పుట్టిన వారి సిటిజన్‌షిప్ హక్కు ఎత్తివేత ఆలోచన కుదరదని, దీనిని న్యాయస్థానంలో సవాలు చేయడం జరుగుతుందని వలస హిత బృందాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో జన్మత: సిటిజన్‌షిప్ చట్టబద్ధమైందని, ఇది ట్రంప్ కాదనడం కుదదని పలువురు నిరసనకు దిగుతున్నారు. అయితే ట్రంప్ చివరికి అక్రమవలసదార్లను అక్రమ కార్యకలాపాల క్రిమినల్స్ అని తిట్టిపోశారు. మైగ్రైంట్ గ్యాంగ్‌లను డెమోక్రాట్లు పెంచి పోషించారని ప్రచారం సాగిస్తున్నారు. డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కూడా అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాల్సిందే అంటున్నారు. ఇప్పటికే దేశ ఇమిగ్రేషన్ విధానం దెబ్బతిందని, దీనికి చట్టపరమైన శాసనపరమైన దిద్దుబాట్లు అవసరం అన్నారు.

సామూహిక తిప్పిపంపివేత ఉండదు : ఫ్యూ సంస్థ

పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా అక్రమ వలసలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటారు , తప్పితే వెనువెంటనే పెద్ద ఎత్తున ఇక్కడున్న వారనిఇ వారి వారి వేశాలకు పంపడం కుదరదని ప్యూ విశ్లేషణ సంస్థ జరిపిన సర్వేలో తేలింది. ట్రంప్ మద్దతుదార్లలోనే అత్యధికులు అంటే 88 శాతం వరకూ సామూహిక తరలింపును స్వాగతిస్తున్నారని ప్యూ తెలిపింది. ఇక హారిస్ మద్దతుదార్లలో 27 శాతం మంది దీనికి మద్దతు ఇస్తున్నారు. హారిస్ ప్రాబల్యపు ఓటర్లలతో 72 శాతం ఇది కుదరదంటున్నారు.
ఇమిగ్రేషన్ రగడపై జనం స్పందన ఇదే
ట్రంప్ వస్తే తమ మీద విరుచుకుపడుతాడేమో , వలసవాదం అనేది అత్యంత సున్నిత అంశం, పలు సంక్లిష్టతలు ఇమిడి ఉన్నాయి. సదుద్ధేశంతో వలసకు వచ్చిన వారిపై కూడా ట్రంప్ వేటేస్తాడేమో అని భయంగా ఉందని బంగ్లాదేశీ అయిన గ్రీన్‌కార్డు దారు ఇక్భాల్ చెప్పారు.
విద్యావంతులు, శాంతికాముకులకు ట్రంప్ వ్యతిరేకి కాదని, ఈ క్రమంలో అమెరికాలో ట్రంప్ గెలిస్తే భారత్‌కు మరింత మేలు జరుగుతుందని జార్జియాలోని ఇండో అమెరికన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి వాసుదేవ పటేల్ చెప్పారు.
ట్రంప్ సాలసీ ఆందోళన కల్గిస్తోందని మిచిగాన్‌లోని విద్యార్థి లతన్యా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఎంచుకునే పాలసీతో పరిస్థితి ఎటునుంచి ఎటుపోతుందో అని ఆమె వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News