ప్రాజెక్టుకు యాదవులు సహకరించాలి సదర్ ఉత్సవాలను గ్రామాలకు
విస్తరించాలి ప్రభుత్వంలో యాదవ సోదరులకు సముచిత స్థానం
సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సదర్ సమ్మేళనానికి ప్రారంభోత్సవం
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌దే
మన తెలంగాణ / హైదరాబాద్ : ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌దే అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామని, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ను ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, మూసీ పునరుజ్జీవ కార్యక్రమానికి యాదవులు సహకరించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సదర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పాం. మాటిచ్చినట్లుగానే ఇక నుండి సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని యాదవులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, యాదవ సోదరులు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సదర్ సమ్మేళన వేడుకలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కీలకమైనదని చెప్పారు. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. పశువులను పూజించడం యాదవుల ప్రత్యేకత అని కొనియాడారు. సదర్ అంటే యాదవుల ఖదర్ అని అన్నారు. సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని తెలిపారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారని గుర్తుచేశారు.
ప్రస్తుతం మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిస్తామని అన్నారు. యాదవ సోదరులకు రాజ్య సభలో కూడా ప్రాతినిధ్యం కల్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. యాదవులు రాకీయంగా ఎదగాలని యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌ను రాజ్యసభ కు పంపించామని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
ముషీరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ ను గెలిపించి ఉంటే ఆయన మంత్రి అయ్యేవారని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ ఓడిపోయినప్పటికీ ఆయన కుటుంబానికి తగిన ప్రాధ్యానం కల్పించామన్నారు. శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడి ధర్మం గెలిచింది. యాదవ సోదరులు కూడా ధర్మం వైపు నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.