Monday, October 28, 2024

వంట నూనెలు పైపైకి!

- Advertisement -
- Advertisement -

భారీగా పెరిగిన వంటనూనెల ధరలు
దీపావళి పండగ ముందు సామాన్యులకు షాక్
గత నెలతో పోల్చితే 37 శాతం పెరిగిన పామాయిల్ ధరలు
సన్‌ఫ్లవర్, ఆవనూనె ధరల్లోనూ ఇదే పరిస్థితి
ధరల పెరుగుదలకు దిగుమతి సుంకాల పెంపు కారణం

మన తెలంగాణ / హైదరాబాద్ : దీపావళి పండగకు ముందు సామాన్యులకు ధరల దడ మొదలైంది. మార్కెట్లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధరలు గత నెలతో పోల్చితే ఏకంగా 37 శాతం మేర పెరిగాయి. సన్‌ఫ్లవర్, ఆవనూనెల ధరలు కూడా గత నెలతో పోల్చితే 29 శాతం పెరిగాయి. పండగ సీజన్ వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యుల బడ్జెట్‌లను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే వంటనూనెను అధికంగా ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, స్వీట్ షాపుల వ్యయాలు కూడా పెరగనున్నాయి.

ధరల పెరుగుదలకు దిగుమతి సుంకాల పెంపు ఒక కారణమని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్‌ఫ్లవర్ నూనెలపై దిగుమతి సుంకాలను పెంచింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతం వరకు పెంచిందని పేర్కొంది. ఇక శుద్ధి చేసిన వంట నూనెలపై సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచిందని వివరించింది. పెరిగిన సుంకాలు సెప్టెంబర్ 14 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. వంటనూనెల ధరల పెరుగుదలపై అధికారులు స్పందిస్తూ గత నెలలో ముడి పామాయిల్, సోయాబీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 16.8 శాతం, 12.3 శాతం మేర పెరిగాయని పేర్కొన్నారు. దేశంలో వంటనూనెల డిమాండ్‌లో 58 శాతం దిగుమతి అవుతోందని, భారత్ రెండవ అతిపెద్ద వినియోగదారుగా ఉందని ప్రస్తావించారు.

కాగా దిగుమతి సుంకాలను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేనందున వినియోగదారులు రాబోయే కొద్ది నెలల పాటు అధిక ధరలను భరించాల్సిన రావచ్చు. ఇక కొత్త సోయాబీన్, వేరుశెనగ పంటలు అక్టోబర్ నుంచి మార్కెట్‌లలోకి వస్తాయని భావిస్తున్నారు. గత కొన్ని నెలలుగా దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రస్తుతం పండగల సమయంలో సామాన్యులపై మరో భారం పడింది. ఒక్క నెల రోజుల్లోనే 37 శాతం పామాయిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. అదే సమయంలో ఆవనూనె ధరలు 29 శాతం పెరిగాయి.

ఇక సెప్టెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 9 నెలల గరిష్ఠ స్థాయి 5.5 శాతానికి చేరిన సమయంలో చమురు ధరల్లో పెరుగుదల వచ్చింది. పామాయిల్ ధరలు 37 శాతం, ఆవనూనె 29శాతం, సోయాబీన్ నూనె 23 శాతం, సన్‌ఫ్లవర్ 23 శాతం, పల్లి నూనె 4 శాతం పెరిగాయి. మనకు అవసరమయ్యే వంటనూనెలో 58 శాతాన్ని దిగుమతుల ద్వారానే చేరుకుంటున్నాం. దీంతో గ్లోబల్గా రేట్లు పెరిగినా, ఇంపోర్ట్ డ్యూటీ పెరిగినా రిటైల్ ధరల్లో మార్పుంటుందని గుర్తుంచుకోవాలి. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈఏ) విడుదల చేసిన డేటా ప్రకారం, గ్లోబల్‌గా క్రూడ్ పామ్ ఆయిల్ ధర టన్నుకు 1,145 డాలర్లు (సుమారు రూ.95 వేలు) పలుకుతోంది. సోయాబిన్ ఆయిల్ ధర టన్నుకు 1,160 డాలర్లు (రూ.96 వేలు), సన్ ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు 1,165 డాలర్లు(రూ.96,700) గా ఉంది. కిందటేడాది ఇదే టైమ్తో పోలిస్తే క్రూడ్ పామ్ ఆయిల్ రేట్లు 32 శాతం పెరగగా, సోయాబిన్ ఆయిల్ ధరలు 18 శాతం,సన్ఫ్లవర్ ఆయిల్ రేటు 26 శాతం ఎగిశాయి.

సుంకాలు పెంచాక రేట్లు పైకి : గత నెలలో వంట నూనెల దిగుమతులపై ప్రభుత్వం సుంకాలను పెంచింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు వరకు నిలకడగా ఉన్న వంట వీటి ధరలు, సెప్టెంబర్ నుంచి పెరుగుతున్నాయి. కన్జూమర్ అఫైర్స్ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రభుత్వం ఇంపోర్ట్ డ్యూటీ పెంచకముందు ఆవ నూనె రేటు లీటర్‌కు రూ.135 ఉండగా, ఈ నెల 24 నాటికి రూ.181కి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ.126 నుంచి రూ.148 కి పెరిగాయి. సోయాబిన్ ఆయిల్ ధర లీటరుకు రూ.143 దగ్గర కొనసాగుతోంది. ప్రస్తుత ఆయిల్ ఇయర్ (నవంబర్ 2023- అక్టోబర్ 2024) లో వంట నూనె దిగుమతులు 1.65 కోట్ల టన్నులుగా రికార్డ్ అవుతాయని ఎస్‌ఈఏ అంచనా వేస్తోంది. అంతకు ముందు ఆయిల్ ఇయర్లో వంటనూనె దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 17 శాతం పెరిగి 1.47 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. అప్పుడు దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడంతో దిగుమతులు పెరిగాయి. కాగా వంట నూనెల వినియోగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఇండియా కొనసాగుతోంది. వెజిటెబుల్ ఆయిల్ దిగుమతుల్లో టాప్‌లో ఉంది. ఇండియాలో ఆవనూనె, సోయాబిన్ నూనె, వేరుశెనగ నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.

దిగుమతులు తగ్గించేందుకు : దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వ సంస్థలు నాఫెడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రైతుల నుంచి మద్ధతు ధరకే 28 లక్షల టన్నుల సోయాబిన్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ సంస్థలు ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రైతుల నుంచి రబీ సీజన్లో 12 లక్షల టన్నుల ఆవాలను కొనుగోలు చేశాయి. మరోవైపు సరఫరాఇ తక్కువగా ఉండడంతో పామ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇండియా, చైనా వంటి దేశాల్లో ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఆయిల్ ధరలు ఈ నెలలో ఇప్పటి వరకు 12.7 శాతం పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌లలో వీటి ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News