ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సుమారు రూ. 12820 కోట్లు విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు అందరికీ తన ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్‌ను మోడీ విస్తరించారు. తొమ్మిదవ ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంత్యుత్సవం సందర్భంగా ఆరోగ్య రంగంలో పలు ప్రోత్సాహక కార్యక్రమాలను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరించారు. దేశ రాజధానిలో భారత తొలి అఖిల భారత ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ రెందవ దశకు కూడా మోడీ ప్రారంభోత్సవం చేశారు. రెండవ దశలో ఒక పంచకర్మ ఆసుపత్రి, ఔషధ తయారీకి ఒక ఆయుర్వేద ఫార్మసీ, ఒక స్పోర్ట్ మెడిసిన్ యూనిట్, ఒక కేంద్ర గ్రంథాలయం, ఒక టి, స్టార్టప్ ఇన్‌క్యుబేషన్ కేంద్రం, 500 సీట్ల ఆడిటోరియం ఉంటాయి. ఆరోగ్య సేవలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు 11 ఆరోగ్య సంస్ధల్లో డ్రోన్ సర్వీసులను మోడీ ప్రారంభించారు.
ఆ 11 సంస్థల్లో తెలంగాణ బీబినగర్‌లోని ఎయిమ్స్, ఆంధ్ర ప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్ కూడా ఉన్నాయి. ప్రధాని రుషీకేశ్ ఎయిమ్స్ నుంచి హెలికాప్టర్ ఎమర్జన్సీ వైద్య సేవను కూడా ప్రారంభించారు, టీకా ప్రక్రియను పూర్తిగా డిజిటైజ్ చేయడం ద్వారా గర్భిణులు, శిశువుల ప్రయోజనార్ధతం యువిన్ పోర్టల్‌ను మోడీ ప్రారంభించారు. గర్భిణులు, (పుట్టుక నుంచి 16 ఏళ్ల వరకు) పిల్లలకు ప్రాణ రక్షక టీకాలను సకాలంలో వేయడానికి దీని వల్ల వీలు కలుగుతుంది. అంతే కాకుండా అనుబంధ, ఆరోగ్య సేవ వృత్తినిపుణులు, సంస్థల కోసం ఒక పోర్టల్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న ఆరోగ్య సేవల వృత్తి నిపుణులు, సంస్థల కేంద్రీకృత డేటాబేస్‌గా ఇది ఉపయోగపడుతుంది. మధ్య ప్రదేశ్‌లో మూడు వైద్య కళాశాలలకు, పలు రాష్ట్రాల్లో వివిధ ఎయిమ్స్‌లలో సర్వీస్ విస్తరణలకు కూడా మోడీ ప్రారంభోత్సవం చేశారు.
ఇతర ప్రాజెక్టులో మడోఈ ఆంధ్ర ప్రదేశ్‌లోని అచ్యుతాపురంలో ఇఎస్‌ఐసి ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ఇతర ప్రాజెక్టుల్లో హైదరాబాద్ నైపర్‌లో బల్క్ డ్రగ్‌ల తయారీ యూనిట్ కూడా ఉన్నది. ఆరోగ్య సేవల రంగంలో భారత్ తయారీ పథకాన్ని పెద్దగా ప్రోత్సహిస్తూ గుజరాత్ వాపి, హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ, హిమాచల్ ప్రదేశ్ నాలాగఢ్‌లలో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్‌ల కోసం ఉత్పత్తి అనుసంధానిత పథకం(పిఎల్‌ఐ) కింద ఐదు ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఆ యూనిట్లు ముఖ్యమైన బల్క్ డ్రగ్‌లతో పాటు బాడీ ఇంప్లాంట్లు, క్రిటికల్ కేర్ పరికరాలు వంటి అత్యున్నత వైద్య సాధనాలను ఉత్పత్తి చేస్తాయి.