న్యూజిలాండ్‌తో జరిగిన, మూడో చివరి వన్డేలో భారత మహిళా క్రికెట్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండింయా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జార్జియా (39) పరుగులు చేసింది. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ హాలిడే 96 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 86 పరుగులు సాధించింది. దీంతో కివీస్ మెరుగైన లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది. ఆతిథ్య జట్టు బౌలర్లలో దీప్తి శర్మ మూడు, ప్రియా మిశ్రా రెండు వికెట్లను పడగొట్టారు.
తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 44.2 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత సెంచరీతో జట్టును గెలిపించింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మంధాన 122 బంతుల్లో 10 ఫోర్లతో 100 పరుగులు చేసింది. వికెట్ కీపర్ యస్తికా భాటియా (35) తనవంతు పాత్ర పోషించింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 63 బంతుల్లో ఆరు ఫోర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ వేగంగా 22 పరుగులు చేసింది. దీంతో భారత్ అలవోక విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.