కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సుభాష్‌నగర్‌లో కోటి రూపాయల విలువచేసే 200 గజాల ఖాళీ స్థల యజమాని బతికుండగానే మృతి చెందాడని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డులను సృష్టించి ఓ బడా ముఠా రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంగతి విధితమే. సుభాష్ నగర్ లో 200 గజాలకు చెందిన యజమాని లెండాల సురేష్ ప్లాట్‌లో అదే ప్రాంతానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు పద్మజా రెడ్డి ఎలాగైనా ప్లాట్ కాజేయాలని పన్నాగం పన్నింది. సురేష్ ఫ్లాట్‌కు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను ఓ ముఠా సహకారంతో తయారు చేయించింది. విషయం తెలుసుకున్న స్థల యజమాని సురేష్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడు అందించిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి ఈ నెల 4వ తేదీన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసే రిమాండ్‌కు కూడా తరలించారు. పోలీస్ కస్టడీలో పద్మజా రెడ్డి వాంగ్మూలంతో సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ ఫేక్ డాక్యుమెంటు దర్యాప్తు కేసులో విచారణ చేపట్టిన జీడిమెట్ల పోలీసులు కోర్టు అనుమతితో ప్రధాన నిందితురాలు పద్మజారెడ్డిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. విచారణలో ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా అప్పటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని సైతం విచారించారు. ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించకుండానే జ్యోతి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు మంగళవారం అప్పటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.