హైదరాబాద్: దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ నవంబర్ 6 వ తేదీన తెలంగాణలో ప్రారంభం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ ఆదేశాల మేరకు తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన ప్రక్రియ చేపడుతున్నామన్నారు. సోషల్ మీడియా ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శాసన సభలో తీర్మానం పెట్టుకోవడం జరిగిందని తెలియజేశారు. సమగ్ర సర్వే సక్రమంగా జరిగి భవిష్యత్ లో అందరికి సమ న్యాయం జరిగేలా సహకరించాలని కోరుతున్నామన్నారు. దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాలలో అధికారులకు సహకరించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. 150 ఇళ్లకు అధికారుల బృందం సమగ్ర సమాచార సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని రకాలుగా అధికారులకు అందుబాటులో ఉండాలని పొన్నం పిలుపునిచ్చారు.
- Advertisement -