దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడ ఐసిసి టెస్టు ఫార్మాట్ లో నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. తాజాగా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో తొమ్మిది వికెట్లతో చెలరేగిన రబాడ.. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, పూణెలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి చేరుకున్నాడు.ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఇక, కివీస్‌పై ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ అశ్విన్ కూడా రెండు స్థానాలు దిగజారి నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా రెండు స్థానాలు కోల్పోయి ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. ముంబయిలో జరిగే మూడో టెస్టులో భారత్, న్యూజిలాండ్‌లు తలపడటంతో బుమ్రా, అశ్విన్‌లు రాణిస్తే.. తమ మొదటి రెండు స్థానాలను తిరిగి పొందే అవకాశం ఉంది.
కాగా, రావల్పిండిలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో పాకిస్థాన్ కైవసం చేసుకుంది.ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నోమన్ అలీ 759 రేటింగ్ పాయింట్లతో మొదటిసారిగా ఎనిమిది స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి ప్రవేశించాడు. ఈ సిరీస్ లో 10 వికెట్లు పడగొట్టిన సాజిద్ ఖాన్ ..12 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు.