Friday, November 22, 2024

బిజెపి 148, కాంగ్రెస్ 103 సీట్లకు పోటీ

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో 148 అసెంబ్లీ సీట్లకు బిజెపి పోటీ చేస్తున్నది. అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోని అర డజను ప్రధాన రాజకీయ పార్టీల్లో బిజెపి అభ్యర్థుల సంఖ్యే అధికం. 103 సీట్లకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉన్నది. మంగళవారం నామినేషన్ పత్రాల ప్రక్రియ ముగిసిన సమయానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకు అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లలోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి సుమారు 8000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 20న జరిగే ఎన్నికల కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన 80 సీట్లకు అభ్యర్థులను నిలబెట్టగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి 53 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. ఐదు సీట్లను ఇతర మహాయుతి మిత్ర పక్షాలు ఇవ్వడమైంది. రెండు సెగ్మెంట్లపై ఎటువంటి నిర్ణయమూ లేదు. ఎంవిఎలో కాంగ్రెస్ 103, ఉద్ధవ్ థాక్కరే నాయకత్వంలోని శివసేన (యుబిటి) 89, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) 87 సీట్లకు పోటీ చేస్తున్నాయి.

ఆరు సీట్లను ఇతర ఎంవిఎ మిత్ర పక్షాలకు ఇవ్వగా మూడు అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పష్టత లేదు. ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ (ఇసి) వద్ద 7995 మంది అభ్యర్థులు 10095 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సిఇఒ) కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తోంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం ఈ నెల 22న మొదలు కాగా మంగళవారం ఆ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు గడువు నవంబర్ 4 మధ్యాహ్నం 3 గంటలకు ముగియనున్నది.2019లో రాష్ట్ర వ్యాప్తంగా 5543 నామినేషన్లు ఇసికి అందాయి. ఆ ఏడాది అసెంబ్లీకి తుదకు 3239 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నవంబర్ 20 అసెంబ్లీ ఎన్నికల కోసం నాసిక్ జిల్లాలో 361 మంది అభ్యర్థులు 506 నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 255 మంది అభ్యర్థులు మంగళవారం తమ పత్రాలు సమర్పించారు. వోట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనున్నది.

6న ఎంవిఎ ఎన్నికల గ్యారంటీల ప్రకటన
ఇది ఇలా ఉండగా, మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) నవంబర్ 6న ముంబయిలో ఒక సమష్టి ర్యాలీ నిర్వహిస్తుందని, ఆ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల కోసం తన గ్యారంటీలను విడుదల చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బుధవారం ప్రకటించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలె ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ, నవంబర్ 6 సాయంత్రం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి)లో ర్యాలీ జరుగుతుందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీ, ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్కరే ర్యాలీకి హాజరవుతారని వెల్లడించారు. కాగా, రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటనపై 6న మహారాష్ట్రకు వస్తారని, ఆయన ఆ రోజు ఉదయం నాగ్‌పూర్‌లో ‘సంవిధాన్ బచావో’ సమావేశంలో పాల్గొంటారని పటోలె తెలియజేశారు. రాహుల్ గాంధీ ఆ తరువాత బికెసిలో ఎంవిఎ సమష్టి ర్యాలీకి హాజరవుతారని పటోలె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News