Friday, November 22, 2024

జనవరి 14న షాహీ స్నానంతో కుంభమేళాకు శ్రీకారం

- Advertisement -
- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా నది ఒడ్డున 42 రోజులపాటు జరిగే మహా కుంభమేళా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన మొదటి షాహీ స్నానంతో కుంభమేళా ప్రారంభమవుతుంది. వివిధ శాఖల భాగస్వామ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు 500 ప్రాజెక్టులు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 15 ప్రాజెక్టులు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికే చెందినవని అధికారులు తెలిపారు. అక్టోబర్ 6న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం గతంలో విధించిన గడువును మరో 15 రోజులు అంటే డిసెంబర్ 15 వరకు పొడిగించారు. ఈ ఏడాది వర్షాకాలం పెరగడంతోపాటు గంగానదిలో ప్రవాహం ఎక్కువగా ఉండడం కూడా ఈ గడువు పొడిగింపునకు కారణాలుగా అధికారులు చెప్పారు.

సాధారణంగా కుంభ మేళా సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించడానికి గంగా నదిలో నీటి మట్టం 10,000 క్యూసెక్కులు ఉండాలి. అయితే అక్టోబర్ 6న ముఖ్యమంత్రి గంగానదిని సందర్శించినపుడు నీటి మట్టం దాదాపు 1.25 లక్షల క్యూక్కులు ఉంది. ఇప్పుడు నీటి మట్టం తగ్గడంతో వివిధ ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయని వివిధ కుంభమేళా ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. సాధారణంఆ గంగానది నీటి మట్టం సెప్టెంబర్ 15 నుంచి తగ్గుముఖం పడుతుందని, అయితే ఈ ఏడాది అది నెల రోజులు ఆలస్యమైందని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ విలేకరులకు తెలిపారు. గడువులోపలే అన్ని ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 2013 మహా కుంభమేళాతో పోలిస్తే రానున్న కుంభమేళా బడ్జెట్ మూడురెట్లు అధికమని ఆయన తెలిపారు. వివిధ కుంభమేళా ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించడం కోసం ఐఐటి కాన్పూర్, ఐఐఐటి ప్రయాగ్‌రాజ్, మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని భాగస్వామ్యం చేసినట్లు ఆయన చెప్పారు.

అయితే వివిధ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాగలవని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నప్పటికీ రోడ్డు వెడల్పు ప్రాజెక్టులలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మహా కుంభమేళా కోసం 4,000 హెక్టార్లకు పైగా స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. మేళా ప్రాంతాన్ని 25 పరిపాలనా విభాగాలుగా విభజించినట్లు ఆయన చెప్పారు. 2,300 సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 99 తాత్కాలిక పార్కింగ్ ప్లేసులతోపాటు 1.5 లక్షల టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. గంగానదిపై 30 పంటూన్ వంతెనలను పిడబ్లుడి శాఖ నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. మేళా ప్రాంతంలో 67 వేల ఎల్‌ఇడి లైట్లు, 2 వేల సోలార్ హైబ్రిడ్ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆయనసూపరింటెండెంట్ ఇంజనీర్ మోజ్ గుప్తా తెలిపారు. మేళా జరిగే మొత్తం ప్రాంతానికి మంచినీటి సరఫరా కోసం 1,249 కిలోమీటర్ల పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ జల్ నిగమ్ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 200 వాటర్ ఎటిఎంలు, 85 వాటర్ పంపులు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

కుంభ మేళా కోసం దాదాపు 7 వేల బస్సులను నడపనున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంతీయ మేనేజర్ మనోజ్ కుమార్ త్రివేది తెలిపారు. కుంభమేళా నుంచి పరిసర ప్రాంతాలకు మరో 550 షటిల్ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. అదే విధంగా రైల్వే శాఖ 825 రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. కుంభమేళాలో ముఖ్యమైన ఘట్టాలైన పవిత్ర స్నానాల రోజులలో 825 రైళ్లను నడపాలని యోచిస్తున్నట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ హిమాంశు బదోని తెలిపారు. ఇవి స్వల్ప దూరం(200 కిలోమీటర్ల వరకు) నడిచే రైళ్లని, ఇవి కాక దూర ప్రాంతాలకు వెళ్లే 400 రైళ్లను కూడా నడపాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. మహా కుంభమేళా కోసం ప్రభుత్వానికి రూ. 6,000 కోట్ల మేరకు ఖర్చు కాగలదని అధికారులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News